మన ప్రశ్నలు - మాస్టర్ గారి సమాధానములు - 18 - 1 (మాస్టర్ ఇ. కె.) Our Questions - Master's Answers - 18 - 1 (Master E. K.)
- Prasad Bharadwaj
- 2 hours ago
- 2 min read

మన ప్రశ్నలు - మాస్టర్ గారి సమాధానములు - 18 - 1
మాస్టర్ ఇ. కె.
ప్రశ్న
ఒక వ్యక్తి చనిపోయిన తరువాత నిత్యకర్మ మొదలైనవి చేస్తారు గదా! వీటిని చేయడంవల్ల ఈ పోయినవాళ్ళకు నిజంగా మేలు జరుగుతుందా? ఒక వేళ ఆచరించకపోతే పోయినవాళ్ళేమైనా ఇబ్బందుల పాలవుతారా? మనం ఆచరించే ఈ పితృకర్మలకు పరమార్థం ఏమిటి?
మాస్టర్ ఇ. కె. :
ఇందులో విషయాలు విప్పిచెప్పడం కొంత మందికి అంతమంచిది కాదు. అది కొంతవరకు తప్పే అయినా విప్పి చెపుతాను. పోయినవాళ్ళకి కలగవలసిన ఉత్తమ గతులో, అధోగతులో వారు ఆచరించిన కర్మలనుబట్టి ఉంటాయి గాని వారి పుత్రులో, దత్తపుత్రులో ఆ పదిరోజులు ఆచరించే కర్మలను బట్టి మారవు. అపర కర్మకాండలో రెండు భాగాలు వున్నాయి. 1. వేదమంత్రాలు, 2. కల్పం వాక్యాలు. ఈ రెండూ వేరేవేరే గ్రంథాలు. వేదమంత్రాలు ప్రాచీనమైనవి. కల్పాలు బోధాయన, అశ్వలాయనాది ఋషుల కాలంలోనివి. వాళ్ళు కల్ప వాక్యాలతో వేదమంత్రాలను కూర్పు చేసుకున్నారు. ఈ కూర్పు మంత్ర ద్రష్టలకు సంబంధించినది కాదు. అంటే తక్కువ రకమని అర్థం కాదు.
వేద మంత్రాలలో వున్న విషయం పితృదేవతలకి, పిండోత్పత్తికీ సంబంధించిన విషయం. అనగా జీవులకు గర్భధారణం, గర్భ పిండవృద్ధి, గర్భస్థ జీవుని సత్సంస్కారయుతునిగా చేయడమనే జగత్కర్మకు సంబంధించిన దేవతలు పితృదేవతలలో ఒక తెగవారు. వీరు చంద్రకిరణాల యొక్క, చంద్రకళల యొక్క ప్రభావరూపంలో భూమి జీవులపై పనిచేస్తూ ఉంటారు. శనగగింజ నానవేస్తే తోకల్లే మొక్క బయటికి వస్తుంది. దాని నిర్మాణానికి, వృద్ధికి, జలములయందు, జలములపై ఆధిపత్యము వహించే చంద్రుని యందు వున్న పితృదేవతలు పనిచేస్తూ ఉంటారు. అలాగే గర్భధారణాదుల విషయంలో కూడ పనిచేస్తూ వుంటారు. ఈ ప్రజాసర్గ కార్యక్రమానికి సంబంధించినవే అపర కర్మకాండలో ఉపయోగించే మంత్రాలు, వానిని భోక్తల పూజతో జోడించి చేసిన క్రతువువలన కర్త ఇంటికి, వారి చనిపోయిన పెద్దలు సంతానంగా దిగిరావడానికి సంస్కార పూర్వకమైన, అంగీకార రూపమైన మార్గం ఏర్పడుతుంది. ఇంతవరకు చెప్పినది అపర కర్మకాండలో గాని, ఆబ్ధిక మంత్రాలలో గాని, అమావాస్యనాడు పితృతర్పణ విషయంలో గాని యిమిడివున్న శాస్త్రీయమైన విధానం.
ఇక రెండవ భాగం. కర్త, వాని బంధువులును, ఆత్మీయులు పోయినందువలన పొందే శోకతాపాదులు తగ్గించుకోమంటే తగ్గేవి కావు. అవి తగ్గటానికి వారిలోనున్న రాగద్వేషాల లోకానికి కొంత పని కల్పించాలి. దానికోసమే పరేతను ఆవాహన చేసినట్లు, తాపం తగ్గటానికి స్నానాలు చేయిస్తున్నట్లు, అర్చన పూజనాదులు ఉంటాయి. సన్నిహిత రక్త సంబంధము కలవారు చనిపోయినపుడు మానసిక బాధ మాత్రమేకాక వేరే కొంత తాపం అనిర్వచనీయంగా ఏర్పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల, అన్నదమ్ముల శరీర దహనం జరుగుతూ ఉన్నప్పుడు తమ శరీరంలో కొంత వేదన కలుగుతుంది. ఇది కొందరు విషయం తెలియకపోయినా అనుభవించడం కూడా అనుభవ సిద్ధమే. దూరదేశంలో వున్న తన కొడుకు చనిపోతూవున్న సమయంలో ఒకామెకు బొడ్డుదగ్గర విపరీతమైన వేదన కలిగింది. తల్లి దేహం దహనం చేస్తున్న సమయంలో ఆ వార్త తెలియని దూరదేశంలో ఉన్న కొడుకు ఒళ్ళంతా మంటలు అని స్నానం చేయటం మేమెరుగుదుము. ఇలాంటి బాధలు ఉపశమనం కావాలంటే శాస్త్రీయమైన మార్గాలు నవీన శాస్త్రాల్లో లేవు. ఇంతవరకు మానవుడు కనిపెట్టిన వైద్యశాస్త్రం ఇక్కడ అక్కరకు రాదు. దీన్ని గూర్చిన సరియైన శాస్త్రీయ తాపోపశమన విధానం ఈ కర్మకాండలోని కల్పంలో వుంది. అది చేస్తే ఈ తాపం ఎందుకు తగ్గుతుంది? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం. ఈ మందులు పుచ్చుకుంటే ఈ రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి? దీన్ని వివరించగలిగితే దాన్నీ వివరించ గలగవచ్చు. వివరించ లేకపోయినందువల్ల శాస్త్రం కాదు అంటే ఆ లోపం వైద్య శాస్త్రానికి కూడా సంక్రమించవలసి వుంటుంది.
మరొక ముఖ్య విషయం. ఎంత పాషండుడికైనా భూతదయ, దానబుద్ధి, సత్ప్రవర్తన అంటించవలెనంటే ఇంతకన్నా సరియైన సమయం దొరకదు. చనిపోయిన వారియందు ఆర్ద్రమైయున్న మనస్సుకి దానధర్మాలు నేర్పాలంటే ఇవి మీ చనిపోయిన వాడికే చెందుతాయి అని చెప్పాలి. ఎంత విద్యావంతుడికైనా ముముక్షుధర్మ విశారదుడికి తప్ప భయాదులు పోవు. చదివినవారిలోను, చదవనివారిలోను, భయపాశాలున్న వారి సంఖ్య ఎక్కువ. చనిపోయిన తమ బంధువులు బాధపడతారనే భయాన్ని చూపి దానధర్మాలు చేయించడం ఈ కల్పంలో ఇమిడివుంది. కనుకనే దీనిని విప్పి చెప్పడం అంత మంచిది కాదు అన్నాను. ఇది తెలుసుకున్నవారు కూడ పామరులకు విప్పిచెప్పడంవల్ల అపకారం, చెప్పక పోవడంవల్ల ఉపకారం జరుగుతుంది. ఇక తెలుసుకున్నవారి విషయం వారి యిష్టం మీద, దైవనిర్ణయం మీద ఆధారపడి వుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
Comments