మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు Pancha Swarupa of Ayyappaswamy
- Prasad Bharadwaj
- 10 hours ago
- 2 min read

🌹 మనిషి జీవిత ఐదు దశలను సూచించే అయ్యప్పస్వామి పంచ స్వరూపాలు 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 Pancha Swarupa of Ayyappaswamy representing the five stages of human life 🌹
Prasad Bharadwaja
శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శ్రుతి విభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
మనిషి జీవితాన్ని ఐదు దశలుగా మన పెద్దలు చెబుతుంటారు. ఈ ఐదు దశలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయ్యప్ప అవతారాలున్నాయి. ఆయన కేరళలో ఐదు చోట్ల ఈ ఐదు రూపాలలో దర్శనమిస్తున్నారు.
1. బాల్యం – కుళత్తుపుళా
2. యవ్వనం – ఆరియంగావు
3. గృహస్థాశ్రమం – అచ్చన్ కోవిల్
4. వానప్రస్థం – శబరిమల
5. ఏకాంతం – కాంతి మలై
1. కుళత్తుపుళా
పూర్వం కొట్టార్కర అనే ప్రాంతాన్ని పరిపాలించిన రాజు, ప్రస్తుతం మనకు కనబడుతున్న ఆలయాన్ని నిర్మించాడు. ఆయన వేటకోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వంటవాళ్ళు, మూడు రాళ్ళతో పొయ్యని పెట్టారట. అందులో ఒక రాయి కాస్త పెద్దదిగా ఉండడంతో, దాన్ని సరిగ్గా పెట్టేందుకు వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. సరే ఈ రాయిని పగుల గొడదామనుకొని, ఆ రాయిపై ఇంకొక రాయి వేసి కొట్టారు. కానీ పోయ్యకోసం వీళ్ళనుకున్న రాయి పగులకపోగా, వీళ్ళు తీసి కొట్టిన రాయి పగిలింది. అంతకంటే ఆశ్చర్యం. ఆ రాయి నుంచి రక్తం కారడం. వెంటనే ఈ విషయాన్నీ రాజుకు చెప్పగా రాజు వేద పండితులను, నంబూద్రిలను పిలిపించారు. విరుగగొట్టింది అయ్యప్ప విగ్రహం అని వారు చెప్పడంతో, జరిగిన అపరాధానికి మన్నించమని అయ్యప్పను వేడుకున్న రాజు, వెంటనే ఆ ప్రాంతంలో ఓ గుడిని కట్టించాడు. ఆ ప్రాంతమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కుళత్తుపుళా.
ఇక్కడ అయ్యప్ప బాలకునిగా వెలసినప్పటికి, ఎనిమిది ముక్కలుగా చేయబడ్డ ఆ రాళ్ళను గర్భ గృహంలో నేటికి చూడొచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్కటిగా చేర్చబడే ఆ రాళ్ళు, పూజానంతరం దూరంగా జరుపబడు తుంటాయి. ఈ ఆచారం నేటికి కొనసాగుతోంది.
ఈ ఆలయంలో మకర విళక్కు, విషు పండుగలు గొప్పగా జరుపబడతాయి. కుళత్తుపుళా తిరువనంతపురం నుండి సుమారు 45 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి విరివిగా భక్తులు వస్తుంటారు.
2. అరియంగావు
బ్రహ్మచారి అయిన అయ్యప్పకు కల్యాణోత్సవం జరిగే ఒకే ఒక పుణ్యస్థలం అరియంగావు. ఇందుకొక కారణం ఉంది. ఈ ఆలయంలో అయ్యప్ప గృహస్థాశ్రమంలో వెలసి ఉన్నాడు. అయ్యప్ప పుష్పకళాదేవిని పరిణయమాడాడు. అయితే, ఘోటక బ్రహ్మచారి అయిన అయ్యప్పకు పెళ్ళెప్పుడు జరిగిందనే సందేహం కలుగుతుంది కదూ!
యోగనిష్ఠలో ఉన్న అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు. శాస్తాకు మరొక అవతారంలో వివాహం జరిగిందట. ఈ కధనం ప్రకారం, ఓ సౌరాష్ట్రీయుడు పట్టు వస్త్రాలను నేసి, ట్రావెన్ కూర్ మహారాజుకు సమర్పించి, ఆయన నుంచి కానుకలను పుచ్చుకుంటుండేవాడు. అలా ఒకసారి ఆ వ్యాపారి తన కూతురు పుష్పకళని కూడా పిలుచుకొని వెళుతుండగా, ఆరియంగావు వచ్చేసరికి చీకటి పడింది. దాంతో వారు అక్కడున్న ఆలయంలో తలదాచుకున్నారు. మరునాడు ట్రావెన్ కూర్ బయలుదేరిన తండ్రితో పుష్పకళ, తనకు స్వామిని వదిలి కదలబుద్ధి కావడం లేదని, అందుకని తండ్రిని ట్రావెన్ కోర్ వెళ్ళి రమ్మని, ఆయన తిరిగి వచ్చేదాకా తను దేవాలయంలోనే ఉంటానని చెప్పింది. మరుమాట్లాడలేని ఆ వ్యాపారి ఆలయ మేల్ శాంతి (అర్చకుడు) దగ్గర పుష్పకళను వదలి రాజు దగ్గరకు బయలుదేరాడు. అలా వెళ్తున్నపుడు ఆ వ్యాపారి ఓ మదపుటేనుగు బారిన పడగా, ఓ యువకుడు అతడిని కాపాడతాడు. మెరుపులా దూసుకొచ్చి తన ప్రాణాలు కాపాడిన ఆ యువకునుకి, తన దగ్గరున్న పట్టువస్త్రంతో అలంకరించిన ఆ వ్యాపారి, ఏం కావాలో కోరుకోమ్మంటాడు. అప్పుడా యువకుడు నీ కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయమని చెప్పి, అరియంగావు గుడిలో తనను కలుసుకోమని వెళ్ళిపోతాడు.
అరియంగావు గుడికి వచ్చిన ఆ వ్యాపారికి, ఎంత వెదికినా తన కూతురు కనబడదు. మేల్ శాంతి దగ్గర ఆరా తీస్తే, ఆమె స్వామిలో ఐక్యమైనట్లు చెబుతాడు. ఆ తెల్లవారుఝామున ఆలయ ద్వారాలు తెరచి, లోపలకి వెళ్ళిన పూజారి, వ్యాపారులకు ఆశ్చర్యం! అడవిలో తను ఇచ్చిన శాలువాతో ప్రత్యక్షమైన స్వామిని చూసి అ స్వామికి సాష్టాంగ పడతాడు. ఈ ఆలయములో స్వామివారి శ్రీకల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఊరికి తిరువనంతపురం నుంచి విరివిగా బస్సు సౌకర్యాలున్నాయి.
3. అచ్చన్ కోవిల్
శబరిమలలో వలె ఈ ఆలయానికి పద్దెనిమిది మెట్లున్నాయి. పూర్ణ, పుష్కళలతో అయ్యప్ప దర్శన మిస్తుంటాడు. ఈ ఆలయములో ప్రత్యేకత బంగారపు కత్తి. ఇది సాక్షాత్ దేవతలు భూమికి తీసుకువచ్చిన కత్తి అని చెప్పబడుతుంది.
మిగతా రెండు దశలకు శబరిమల, కాంతిమలై ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.
🌹🌹🌹🌹🌹


Comments