మహా కైలాస దర్శనం (Maha Kailasa Darshan)
- Prasad Bharadwaj
- 1 day ago
- 11 min read

మహా కైలాస దర్శనం (Maha Kailasa Darshan)
---------------------
కైలాసం ! Kailasa!
అది ఒక ఆధ్యాత్మిక శివభావనా నగరం !
It is a spiritual city of Shiva-consciousness!
ఊహించినంత మాత్రమున ముక్తి నొసగే ఊర్ధ్వస్థలి అది!
It is an exalted realm that grants liberation merely upon being contemplated!
నిర్గుణ రూపంతో ఉన్న నిటలాక్షుని వలె
కైలాస పర్వతం కూడా
హృదయాంతరాళంలో ఊహించదగిన సంకేత శైవభూమి !
ఊహకందని హిమగిరీశృంగంపై శివ భావన చేయడం ఒక రుద్రాభిషేకమే !
ప్రస్తుతం కైలాస నగరాన్ని ఊహాలోకంలో కల్పించి ఎదురుగా నిలిచిన ఒక శివభక్తునితో "అదిగో చూడు ! కన్నులు మూసుకుని హృదయాకాశంలో సుస్పష్టంగా చూడవచ్చు ,
'ముందుకు పద ! ' అంటూ ఆ శివప్రస్థానం వైపు దారి చూపడమే ఈ గ్రంథ ఉద్దేశ్యం !
దీంట్లో మార్గదర్శనం చేసేవారు ఒకరు , ప్రయాణించేవారు మరొకరు !
హిమాలయ ప్రాంతానికి సమీపంలో ఉండి "అదిగో అల్లంతదూరంలో కనిపించేదే కైలాస నగరం !
దానిని చేరాలంటే ఇలా వెళ్ళు ! "
అంటూ తొలత "మానస సరోవరాన్ని " దర్శింప చేస్తాడు !
అక్కడి విశేషాలు వివరిస్తూ అక్కడి నుండి హిమాలయ పర్వత పాద ప్రదేశానికి తీసుకువెళ్తాడు !
"అక్కడే దేవతలు మొదలైన వారు భూమిపై కాలు మోపే ప్రదేశం !'అంటూ చెబుతూ ,అక్కడి నుండే కైలాస మహాప్రస్థానం ప్రారంభం అవుతుందని వివరిస్తూ ముందుకు కదులుతారు .
మాత్రా చందస్సులో సాగే ఈ కైలాస వర్ణనను చదువుతూ హృదయంలో ఒక మహోన్నతమైన శివానుభూతిని అందరూ పొందాలని ఆశిస్తూ ....
మీ
భాను
----------
ప్రథమావరణం
(మానస సరోవరమండలం)
---------
1
అదిగదిగొ కైలాస
మదె మహా శివపురము
అర్థనారీశ్వరుని
ఆనంద మందిరము !
2
అదియె శంభుని నగము
అది శాంభవీ జగము
బ్రహ్మాండ నాయకుని
భవ్య నటనాంగణము
3
అదియె వెన్నెల కొండ
అది వేల్పులకు అండ
అణువణువు శివముగా
వెలుగు వన్నెలు నిండ
4
శివుడు తాండవమాడ
గళమెత్తి పాడునట
శివ శరీరిణి కూడి
శివమెత్తి ఆడునట
5
అట గిరీ నిర్ఝరుల
పరుగులే మురిపించు
అచట మేఘ శ్రేణి
మెరుపులే కురిపించు
6
కనులు అరమోడ్పులై
అశృవులు వర్షించు
హృదయ మరవిందమై
వికసించి వినుతించు
7
ముదిత హృదయుండవై
ముందు ముందుకు సాగు
ముక్తినాథుని చేరి
మోక్ష పదమే వేడ
8
శంభు పర్వతమదిగొ
శాంభవికి గర్వమది
శివ రూప సర్వమది
భువనైక పర్వమది
9
అటుచూడు మటుచూడు
ఆనందకర పదము
అచట కొలువై నిలిచె
అమల శీతల హ్రదము
10
భవ్యమై హృదయాంత
రంగమే ఉప్పొంగ
భువికి చేరెను వడిగ
బ్రహ్మమానస గంగ
11
అటుచూడు మటు పక్క
రమణీయమౌ హొయలు
రాజ హంసల ఠీవి
రాచ నడకల వగలు
12
కలువ పూవులు ఇచట
కనక కాంతుల మెరియు
బ్రహ్మ కమలము లిచట
భాగ్య రాశులు కురియు
13
నగములూ శృంగములు
నయన పర్వము గూర్చు
విహగములు వింతగా
విహరించి రమియించు
14
నరులునూ కిన్నరులు
రుషులు కింపురుషులూ
స్నానములు కావించు
సత్య లోకపు జలము
15
వేదనాదము లిచట
వినువీధి వినిపించు
విశ్వ సోయగమిచట
విరివాన కురిపించు
16
అమరమౌ అతులమౌ
విమలమౌ విశదమౌ
జలపు బిందువు కూడా
అమృత సింధూ సమము
17
సోహ మంచును వాయు
శ్వాసలను బంధించి
మౌనులును యోగులను
ధ్యానములు జేతురిట
18
కమల పూవుల ధూళి
రేణువులు దశ దిశల
కాకలీ గీతముల
కావ్యములు వినిపించు
19
విరులిచట విచ్చుకొని
వింత కాంతులు చిమ్ము
జల సిరుల సవ్వడులు
జపమేదొ జపియించు
20
ప్రకృతి కాంతే మురిసి
పరవశము చెందునట
ప్రణవ నాదము చేసి
ప్రణతులర్పించునట
21
నింగి నేలల మధ్య
నిండు తెరలను పరచి
సందె కాంతులు విరిసి
సైయాటలాడునట
22
రంగు పక్షుల గుంపు
నింగి చిత్రము పేర్చ
భృంగ పంక్తులు వంపు
రంగ వల్లులు గూర్చు
23
ఇచటి వెలుగుల జిలుగు
బ్రహ్మ ప్రభావమట
ఇచట భూతల కణము
భస్మాంగ దేహమట
24
పూర్వ సంధ్యా తరుణ
పుణ్య కాలమ్ములో
పుడమి చుక్కల సురులు
పూని ఇటు వత్తురట
25
జల కణము స్పర్షించ
పలకరించును సరసు
జలదరించును తనువు
పులకరించును మనసు
26
ఉదయ భానునికిచట
ఉదకార్ఘ్యములనిచ్చి
పితృ తర్పణములిచ్చి
పితరులను మెప్పించు
27
శతరుద్రియము తోడ
సర్వేశ్వరుని గొలిచి
సకల జన కళ్యాణ
సౌఖ్యమును కాంక్షించు
28
ముక్కోటి దేవతలు
మురిసి తడిసెదరిచట
మూడు మున్కలు వేసి
మోకరిల్లుము స్వామి !
29
పద పదము వేదమయ
పదమాత్మగా నెంచి
పరమేశ్వరా యనుచు
పాడి ముందుకు సాగు !
---------------------
ద్వితీయావరణం
------------------------
( గిరిపాద మండలం)
1
కదిలి ముందుకు సాగు
కమనీయ హిమగిరుల
పాద సన్నిధి అదిగొ
పరమ పెన్నిధి అదిగొ
2
దివి నుండి తారకలు
భువికి చేరుదురిచట
దిక్పతులు సతులతో
దిగి వత్తురిచ్చటికి
3
గంధర్వ గాయకులు
గరళ కంఠుని చూడ
గగన మార్గము వీడి
నగము చేరుదురిచట
4
అప్సరో భామినులు
అవని చేరుదురిచట
నాగ కన్యలు మురిసి
నర్తింతు రిచ్చటే
5
యక్ష పరమాంగనల
పదధూళి రేగునిట
కిన్నరాంగన పాద
కింకిణిలు మోగునిట
6
ఇచట రేగిన ధూళి
కణ కణము శివమయము
శీర్షమందున దాల్చి
సిద్ధి కోరుచు కదులు
-------
తృతీయావరణం
------------------------
( గో మండలం)
1
గోలోక మది చూడు
గోధూళి తో నిండు
గోమయము దారులట
గోపాల బాలురట
2
చిత్ర మయ వర్ణములు
చపలతర కర్ణములు
గంగడోలుల చిన్ని
గోబాల బాలికలు
3
వేదమాతయె వేయి
రూపములు గొన్నట్లు
ధర్మదేవత కోటి
దేహములు గన్నట్లు
4
గోశరీరము నందు
కోటి సురకాంతులట
కణ కణము సురలోక
గణముతో సమమంట
5
నతులలో నుతులతో
శృతులతో కృతులతో
గో గణము నర్చించి
కోరి ముందుకు సాగు
---------
చతుర్థావరణం
(తపో మండలం)
---
1
శత కోటి వర్షములు
శమదమాదుల తోడ
తప మాచరించేటి
తత్త్వదర్శుల చూడు
2
మౌనులును యోగులను
శౌనకాదుల చేరి
సత్సంగ సభ చేయు
సాధు వర్తన భూమి
3
యజ్ఞాగ్ని శిఖలచట
విజ్ఞాన జ్యోతులట
హోమ ధూమము లచట
క్షామ నాశినులంట
4
నిత్యాగ్ని హోత్రములు
నిరతాన్న దానములు
నిటలాక్ష సేవనలు
నియతి తప్పనినేల
5
భద్ర వాటిక లోన
భస్మ ధారణ చేసి
సోమ పానము చేసి
స్తోత్ర గానము చేయు
6
హర హరా మహ దేవ
పరమేశ్వరా యనుచు
మునులనే మదిదలచి
మునుముందుకై సాగు
7
అది తపోలోక మట
ఆది మునులే అచట
అవి యాగ భూములట
హవిషా వితర్దులట
8
అచటి ధూళులు కూడ
అగ్ని శిఖలకు సమము
అచట కురిసెడి వాన
అమృతాభిషేకమ్ము
9
అచట పెరిగిన గరిక
రుద్ర జటలకు సమము
అటవాయు నిస్వనము
అఖిల వేద స్వరము
10
అచట లతలే సోమ
రసము వర్షించునట
అచటి చిరు కొమ్మలే
స్రుక్కులట స్రువములట
11
ప్రతిఎండు పుల్లయును
హవనాగ్ని సమిధ యట
ప్రతి వృక్ష పత్రమ్ము
వ్యజనైక పాత్రమట
12
అట యోగి పుంగవులు
ఆది యుగముల నుండి
వాయువును బంధించి
ఆయవును గలవారు
-----
పంచమావరణం
(బిల్వ మండలం )
-------
1
ఆది భిక్షువు చెంత
అడవి ఐనది పుడమి
అడుగడుగు శివతరువు
తడబడక నడువుమట
2
లక్షయోజన పరిధి
వృక్ష బిల్వములచట
మోక్షపథ గాములకు
ముక్తి దాతలు అవియె
3
వనములుపవనములూ
వేలకొలదులు అచట
ఏకబిల్వపు తరువు
లేడేడు వనములట
4
అచటే త్రి బిల్వములు
లక్షోపలక్షలట
పంచ బిల్వ శ్రేణి
కోటి శత కోటులట
5
నవ బిల్వ తరువులే
వేల వేలుగ నుండు
బహుబిల్వ దళ వృక్ష
బాహుళ్యములు ఎన్నొ
6
శతబిల్వముల తోడ
శంకరుని అర్చించు
శాంతి నొందును మనసు
సౌఖ్యమొందును తనువు
------
షష్టావరణం
(నక్షత్ర మండలం)
-------
1
నక్షత్ర మండలము
నభపు ప్రభలే ఇచట
కలలొ కాంచని కాంతి
ఇలలొ వెలుగును ఇచట
2
మిల మిలల తారకలు
మిన్ను దిగి వచ్చునట
మంచు కొండకు మణుల
హారతులు నిచ్చునట
3
ఇంపైన నక్షత్ర
పటలమ్ము నిటలాక్షు
ఇంటి ముంగిట రంగ
వల్లికలు దిద్దునట
4
సప్తర్షి మండలము
స్వర్ణ కాంతులు చిందు
ధృవ తారకా గతులు
దురితములు తొలగించు
5
తరళ తర తారకలు
వెలుగు జిలుగులు గూర్చి
హిమ గిరీశుని కంఠ
సుమమాలికై నొప్పు
6
నతులతో నక్షత్ర
మండలము నర్చించి
నడిచి ముందుకు సాగు
నయన పర్వము నీకు
------
సప్తమావరణం
(భాను మండలం)
1
అచట ముందుకు సాగ
అగుపించు బింబములు
భాను మండల భవ్య
భాస్వద్విడంబములు
2
ద్వాదశార్కులు శీత
కిరణాలు ప్రకటించ
కోటి విద్యుత్ ప్రభలు
కోరి చేరిన నేల
3
చిత్తమంతయు శివుని
చింతించి ధ్యానించ
వేయి కిరణాలిచట
వెన్నెలలు కురిపించు
4
అరుణ కిరణుడు ఇచట
అమృతమే వర్షించి
కరుణ చూపెడి నేల
గరళ కంఠుని లీల
5
హిమగిరీ శృంగమున
సుమములద్దినయట్లు
మలయ వాయువు గంధ
మలర వీచినయట్లు
6
చందనపు వృక్షములు
గంధ మలదినయట్లు
మరు మల్లియలు విరిసి
మత్తు గొల్పినయట్లు
7
సప్త కిరణము లిచట
గుప్తశక్తుల నిచ్చు
హేమ కాంతికి దివ్య
ధామమై కనిపించు
8
మింట మండెడు రేడు
చంటి పిల్లడువోలె
కంటి కింపును గూర్చు
మంటప శృంగమదె
9
అఖిల భానుల కచట
అర్ఘ్య మిచ్చుచు సాగు
అవని పరమాత్మగా
అగుపించు శివుడతడు
10
పార చూడుము అతడె
ప్రత్యక్ష పరమాత్మ
పాప సంచయ మెల్ల
పెకిలించు బ్రహ్మాత్మ
11
శివుని మది భావించి
చిత్తమును బంధించి
కదిలిముందుకు సాగు
కామితార్ధము దలచి
-------
అష్టమావరణం
( ది క్ మండలం)
-----
1
కనులముందదె కనుము
కమనీయ లోకమును
ఇంద్రాది దేవతల
ఇలలోని స్వర్గమును
2
హిమ సానువుల నిండ
సుమ సౌరభము మెండు
కల్ప వృక్షపు వనము
కలదు శతయోజనము
3
కామధేనువు లచట
కామనలు తీర్చునట
కార్య సాధన కోరు
కదిలి ముందుకు చేరు
4
అష్ట దిక్పాలకుల
స్పష్టముగ దర్శించు
విశ్వనాథుని చేర
వినతులను వినిపించు
5
తూర్పు దిక్ శృంగమున
దేవేంద్రుడే అచట
దేవసభ చేయునట
దేదీప్యమాన ముగ
6
ఆగ్నేయ పర్వతము
అగ్ని దేవాలయము
ఆజ్యముల నర్పించి
ఆహుతుల నందించు
7
దక్షిణ శృంగమున
ధర్మ దేవత యముడు
దర్శించినంతనే
దయచూపు ధార్మికుడు
8
నైరుతీ నగమదే
నిరుతి నిలయమ్మదే
పాప వంశోద్భవుల
పుణ్య నిలయమ్మదే !
9
వరుణ దేవుని యద్రి
కరుణనే కురిపించు
వర్షధారల తడవ
హర్ష ముప్పొంగునిట
10
వాయవ్య పర్వతము
వాయు దేవుని నేల
అఖిల లోకశ్వాస
అందించు సురుడతడు
11
ఉత్తరపు దిశ చూడ
యది కుబేరాద్రి ఆ
యక్ష రాజుకు మొక్క
రక్షణను కల్పించు
12
ఈశాన్య శృంగమది
ఈశ్వరుని లింగమది
శత రుద్రియము చదివి
నత శీర్శుడవు కమ్ము
13
అష్ట విధ సిద్ధులను
అచట సాధించుకొని
కృత్తివాసుని చేర
చిత్తమున ధ్యానించు
14
కష్టములు నష్టములు
మరచి కొండల నెక్కి
ఇష్టముగ ఈశ్వరుని
తలచి ముందుకు సాగు
-------
నవమావరణం
(గ్రహ మండలం)
---------
1
అదిగదిగొ హిమఖండ
సోపాన పంక్తులవి
అచట శీర్శము వంచి
అవని సంస్పర్షించు
2
సప్త సోపానములు
సంధ్యా మరీచికలు
సుప్త చైతన్యములు
శుద్ధ ప్రదీప్తములు
3
నవ నవోజ్వల గోళ
నవ రత్న కాంతులతొ
నవ మహా గ్రహపతులు
అవని చేరుదు రిచట
4
ఏడు గుర్రము లెక్కి
ఏడేడు లోకాలు
భ్రమియించు భానుడట
భాస్వత్ ప్రతాపుడట
5
వెన్నెలలు కురిపించు
వన్నెచిన్నెల వాడు
మదిని ఆకర్షించు
మనసున్న చందురుడు
6
కుంకుమాంగుడు కుజుడు
కల్లోల కారకుడు
కష్ట జీవి ని చేరి
ఇష్ట సిద్ధిని గూర్చు
7
బుధుడతడు సద్బుద్ధి
సౌమ్య సద్గుణ శీలి
భూరి విద్వత్ తేజ
భువన మోహనశాలి !
8
గురువులకు గురువైన
దేవగురువే అతడు !
అతులమేధోశక్తి
అమర తేజోద్దీప్తి
9
సౌందర్య కారకుడు
సరస ప్రదీపకుడు
సుకళాధి పోషకుడు
శుభుడు శుక్రుడు అతడు
10
మందగతి మార్గణుడు
గుణ దోష కారకుడు
శని దేవ సంస్తుతుడు
శమ కరుడు శుభకరుడు
11
మాయా మహోత్సాహి
మోహకుడు రాహువట
పట్టు విడుపుల రేడు
పరమ పూజ్యుడు అతడు
12
ముక్తి ప్రదాయకుడు
యుక్తి ప్రచోదకుడు
కేతు ఛాయా దేహి
కైవల్య పద గేహి
13
మననున్న గ్రహములను
మదిలో సమర్చించి
కోర్కెలన్నియు విడిచి
కోరి ముందుకు సాగు
----------------------
దశమావరణం
( ప్రమధ గణ మండలం)
1
శత కోటి శృంగములు
శాక్తేయ కుడ్యములు
అష్ట దిగ్ద్వారములు
అఖిల ప్రమోదములు
2
ప్రమథ గణములు నిలిచి
పాలనను చేతురట
వారి ఆనతి లేక
గాలి అయినా చొరదు
3
మణి మయోజ్వల దివ్య
మాణిక్య భిత్తికలు
చలిత విలసల్లలిత
భరితాభ్ర భంజికలు
4
తూర్పుద్వారపు రక్ష
కూర్పు నందీశ్వరుడు
అమిత విక్రమశాలి
అతులరక్షణ శీలి
5
ఆగ్నేయద్వార పతి
అరి భయంకరుడంట
అతి మహా కాలుడట
అగ్ని ముఖ రూపుడట
6
దక్షిణ ద్వారమున
దక్షణా కవచమై
మూడు కాళ్ళ భృంగి
ముందుండి కాచునట
7
నైరుతీ ద్వారమున
నాయకుడు భద్రుడట
చీమయైనా నిలిచి
చేర వెరచును ఇచట
8
పడమట ద్వారమున
పార్వతీ పుత్రుడగు
వీరగణపతి నిలిచి
విష్నుములు తొలగించు
9
వాయవ్య ద్వారమున
వల్లీ సమేతుడై
సుబ్రమణ్య స్వామి
బల్లెమై రక్షించు
10
ఉత్తర ద్వారపతి
విత్తమంతకు విభుడు
ధన కుబేర స్వామి
దక్షుడై పాలించు
11
ఈశాన్య ద్వారమున
ఈశాన భైరవుడు
కాశికాపురివోలె
కాచి రక్షణ సేయు
12
ఇష్ట సిద్ధుల నిచ్చు
ఈశ్వరుడి రూపములు
వ్యష్టియౌ వేదములు
అష్ట శివ ద్వారములు
13
ఆ ద్వార తోరణము
లన్ని మొక్కుచు సాగ
సిద్ధి యోగులు గాంచు
శ్రీ సభా భవనములె
------
ఏకాదశావరణం
( అభిషేక మంటపం )
1
అది రుద్ర భవనమట
అతి భద్ర హవనమట
ఏకాదశేశ్వరులు
ఏకమై వత్తురిట
2
ఆసభా భవనమున
అంతటా కనిపించు
అపురూప కుండములు
అభిషేక భాండములు
3
పదకొండు రుద్రులిట
ప్రత్యక్ష రూపులుగ
పానవట్టము జేరి
పరవశింతురు చూడు
4
అమర శివ రుత్వికుల
నమక చమకపు గతులు
అఖిల గాయక గాన
రస ఝరీ సంస్తుతులు
5
ఎచట వింటే అచట
ప్రణవైకనాదములు
ఎచట ఉంటే అచట
శ్రవణ ప్రమోదములు
6
శివగణాలన్నిచట
శంకరా మహ దేవ
హరహరా యని యంచు
గళమెత్తి పాడుదురు
7
స్వర్ణ కుంభములతో
పూర్ణ గంగా జలము
కరమెత్తి పోతురట
గరళ కంఠుని పైన
8
శంఖములు డంకములు
సందోహలయమౌను
శివ సభా భవనమ్ము
శృతి సుధామయమౌను
9
అతిరుద్ర స్వరములే
చెలగి అంబరమయ్యె
అభిషిక్త ధారలే
తరలి అంబుధి అయ్యె
10
రుద్ర మూర్తుల చేరి
రుక్కులతొ సేవించి
నడిచి ముందుకు సాగు
నయన పర్వము గలుగు
-------
ద్వాదశావరణం
(తాండవ మంటపం )
--------
ఆనంద తాండవమంటపం
------------
1
కొంత ముందుకు చేర
కోటి కాంతులు చిందు
శివ నాట్య భవనమది
శాక్తేయ హవనమది
2
నాట్య భవనము నడుమ
నటనా విలాసుడగు
అర్థనారీశ్వరుని
ఆనంద తాండవము
3
సిద్ధులును సాధ్యులును
రుద్రులును భద్రులును
శివ తాండవపు వేళ
శివమెత్తి వత్తురట
4
కోటి శివ గణములును
కోలాటమాడుదురు
పరమ పురుషునిజేరి
పదము కలిపెదరిచట
5
నందీ భృంగీ చండీ
నర్తనము గావించు
నారదుడు తుంబురుడు
కీర్తనల సేవించు
6
తాళములు తప్పెట్లు
వాయించి మురిసేరు
డంకాలు డమరులూ
నినదించి ఎగిరేరు
7
వీణా నినాదముల
వేడుకల తనిసేరు
బూర కొమ్ముల నూది
శూరులై రగిలేరు
8
శివుడు తాండవ వేళ
శివమెత్తి ఆడునట
శివ శక్తితో కూడి
చిందేసి పాడునట
9
కిన్నెరలు వాయించు
కన్నెలెందరొ అచట
రాగ మాలిక లల్లు
రమ్య భామినులచట
10
ఘలు ఘల్లుమని కాలి
యందెలే మోగంగ
భస్మాంగ దేహుడికి
డెందమే ఉప్పొంగు
1 1
పదము పదమూ కలిసి
పరమేష్టి సతితోడ
గళము గళమూ కలిసి
కీర్తనలు పాడునట
1 2
విసరద్విరూపాంగ
వికళా ప్రదర్శనము
విగళజ్జటా జూట
విశిఖా ప్రభంజనము
13
తతగిణీ తోం అనుచు
తనిసి నాట్యము చేయ
తాండవానందమున '
తన్మయులె అందరును
14
అచట శీతాచలము
అధిక కోలాహలము
భవ నాట్య మందిరము
భువనైక మోహనము
---------------
సంధ్యా తాండవ మంటపం
----------
1
అచటనొక తెర తీయు
అసుర సంధ్యా సమయ
కుటిలాంగ నర్తనలు
నిటలాక్ష కీర్తనలు
2
రుద్ర భూముల పైన
విద్రావ నర్తనలు
ఛిద్ర దేహుల వీర
భద్రావతారములు
3
కరములో కంకాళ
వికటాట్టహాసములు
వెరువు అరుపులు లేక
వినవోయి కనవోయి
4
మస్తకములే లేని
హస్తకాపాలికలు
న్యస్తోర్ధ్వ దైహికులు
వ్యస్తాధి మోహితులు
5
భగ్న ప్రదేహులట
నగ్నైకరూపులట
చిత్ర రూపులు కూడి
చిందేసి ఆడెదరు
6
వికృతాధి వేషములు
వేరు వేరుగ నుండు
ప్రళయ ప్రహాసములు
తీరు తీరుగ నుండు
7
పాపాల భైరవులు
ధూపాల తాంత్రికులు
బేతాళ రూపులను
కాపాల మాంత్రికులు
8
ప్రేతలును భూతములు
ప్రీత చిత్తులె అచట
శవ గాత్రులయినట్టి
శివ మాత్రులందరును
9
ఆపాద మస్తకము
గాలిలో కదిలేరు
అసలు దేహము వదిలి
ధూళి లో ఎగిసేరు
10
ఛిద్ర దేహము లున్న
భద్ర మూర్తులు వారు
చితి నాట్యములు సలుపు
క్షుద్ర శక్తులు వారు
11
వికటాట్టహాసములు
వింతైన వేశములు
వికలాధిఘోషణలు
వికృతాభి భాషణలు
12
కోటి రుద్రులు చేరి
కోలాటములు చేయ
కోర్కె తీరగ చూసి
కోరి ముందుకు సాగు
13
హృదయ మందానంద
మందిరము నిర్మించి
వేద వేద్యుని శివుని
మదిలో ప్రతిష్ఠించి
14
భూఖండ కైలాస
పుణ్య లోకము వైపు
పదమంటు పదమెత్తి
పయనమగుమా !స్వామి
-------
త్రయోదశావరణం
(శివ సభామండపం )
-------
1
సాగి ముందుకు చేర
శివసభా భవనమది
సకల దేవానంద
సల్లాప మందిరము
2
బ్రహ్మ విష్ణువు శివుడు
భాషింతురట చేరి
భస్మాధి గాత్రునే
భూషింతురట కోరి
3
విశ్వ కళ్యాణ ప్ర
నాళికలు వేతురిట
నశ్వత్ప్రపంచాగ్ని
కేళికలు చేతురిట
4
చరరాశి స్థిర రాశి
పరిణామ ఫలచర్చ
జగతిలో విలసిల్లు
జనన మరణపు చర్చ
5
విశ్వలోకానంత
వివిధ విధముల చర్చ
సకల ధర్మాధర్మ
సందోహముల చర్చ
6
పాప పుణ్యపు చర్చ
పరమ లోకపు చర్చ
సుకృత విధముల చర్చ
వికృత హృదయుల చర్చ
7
విశ్వ కళ్యాణముల
విరచించు మదిరము
బ్రహ్మాది దేవతల
ప్రవచనా మంటపము
8
ఎచట చూచిన అచట
శివ సభా ప్రాంగణము
ఎదలో సమర్చించి
కదిలి ముందుకు సాగు
--------
చతుర్దశావరణం
(విలాస మంటపం )
---------
1
లక్ష్మీ సరస్వతుల
హాస్య ప్రచంద్రికలు
లలితా మహా దేవి
లాస్య ప్రహేళికలు
2
ముగ్గురమ్మల ముద్దు
లీలా వితర్దికలు
ముల్లోక సంబంధ
ముచ్చట్ల వేదికలు
3
శివ కేళిభవనమది
సిద్ధ గణ రక్షితము
రాజేరాజేశ్వరుల
రమ్య లీలాస్థలము
4
శివ వృక్ష రాజములు
శివ లతా కుంజములు
శివ సరస్సులు అచట
శివమయము అంతటను
5
విభ్రమము గలిగించు
భ్రమర ఝంకారములు
భువనైక మోహినికి
భూపాల రాగములు
6
అట పాచికల తోట
అచట గవ్వల గద్దె
పరమ పద సోపాన
వలయ దివ్య క్రీడ
7
వనమాలికా క్రీడ
చలదూర్మికా క్రీడ
పద నిర్మిత క్రీడ
జల డోలికా క్రీడ
8
వలయ నృత్య క్రీడ
అలరు చందన క్రీడ
జలజ బంధ క్రీడ
మలయ గంధ క్రీడ
9
అమర క్రీడానంద
మంబరము నంటునట
అఖిల లోకేశునికి
అర్చలే అవి అచట
10
ఆరు రుతువులు అచట
బారులే తీరునట
అచట వర్షములెపుడు
హోరుగా కురవవట
11
శీత వాయువు ఎపుడు
జోరుగా వీచదట
చింత నిప్పుల ఎండ
తీరు అసలుండదట
12
గూఢో పగూఢములు
గుహ్య ప్రకాశికలు
కేళీ విలాసములు
బాలా విహారములు
13
లీలా వినోదములు
వీణా నినాదములు
శృంగార గీతములు
శుద్ధోపహారములు
-----
పంచదశావరణం
(శ్రీ చక్ర మంటపం )
-------------
1
కదిలి ముందుకు సాగ
కమనీయ కల్పమది
రాజేశ్వరీ హృదయ
రమణీయ ద్వీపమది
2
అట చుట్టు సంద్రమట
అమృత ప్రబంధమట
మకరములు మీనములు
నికర ప్ర సాంద్రమట
3
సాగరము మధ్యలో
సప్త యోజన ఘటిత
ప్రాకార కుడ్యములు
ప్రాలేయ భిత్తికలు
4
నాలుగు ద్వారములు
నయన మనోహరములే
భువనైక మోహినీ
భక్త గణ పరములే
5
అట చూడ వృక్షములు
ఆకాశమంటునట
వన సుందరీ కృపా
వర్షాభ్ర దీప్తులట
6
దశ యోజనాకర్ణ
దేవతా వృక్షములు
గగనాన వెదజల్లు
గంధ ప్రసూనములు
7
చంపకాశోకములు
సాగంధికా తతులు
చాంపేయ వకుళములు
సౌవీర చూతములు
8
శింశుపా వృక్షములు
శివమల్లి తాళములు
కాదంబ కాశ్మీర
కాంతార భూజములు
9
హంస కారండములు
గండభేరుండములు
శుకములు పికములూ
సుందరాలాపములు
10
అటు చూడు మటు చూడు
ఆరుప్రాకారములు
రుతు రాజ్య విక్రమపు
రక్షణా చక్రములు
11
అవి దాటి అటు చూడు
అష్ట దిక్కుడ్యములు
అమరాధిపాలికలు
సమర ప్రహేళికలు
12
పద్మ రాగపు మణుల
ప్రాకార మంటపము
వీర నారీ మణులు
పాలించు ప్రాంగణము
13
రథములూ గజములూ
తురగములు సిద్ధమట
యుద్ధ భేరీ నివహ
క్రుద్ధ సన్నద్ధులట
14
గోమేదికా మణుల
కోటి ప్రాకారములు
అరుణార్ణకాంతి మయ
తరుణీ మణులె అచట
15
సద్వజ్ర ప్రాకార
భిత్తికలు పాలించు
భువనేశ్వరీ దేవి
భవనైక రక్షకులు
16
వైడూర్య ప్రాకార
కైవారములు దాట
అష్ట మాత్రుకలచట
ఇష్టపాలికలంట
17
ఇంద్రమణి ప్రాకార
మింద్ర నీలపు కాంతి
నిండి వెలుగులు ఎగిసి
నింగి కెగెసేనచట
18
ముత్యాల కుడ్యములు
మరకతపు కుడ్యములు
ప్రా వాళ కుడ్యములు
పర రత్న కుడ్యములు
19
కుడ్య కుడ్యము నడుమ
కుసుమైక వనములూ
వనము వనమూ నడుమ
నదములూ హ్రదములూ
20
కొంత దూరము సాగ
చింతా మణీ గృహము
శివసతీ హృదయైక
చిత్కళా మంటపము
21
కదలి ముందుకు సాగ
కమనీయ హర్మ్యములు
కామేశమానసపు
రమణీయ సౌధమలు
22
అదిగదిగొ శ్రీ చక్ర
భవన విద్యుత్ కాంతి
లలితా మహా దేవి
లావణ్య వర భూమి
23
చింతామణీ గృహము
చిత్కళా శోభితము
త్రిపురా మహాదేవి
అపర మానస గృహము
24
లలితా మహాదేవి
లావణ్య మందిరము
యోగినీ గణ దివ్య
లాలిత్య సుందరము
25
పంచ బ్రహ్మాసనము
పైన శంభుడు ఉండు
అతని వామాంకమున
పైన శాంభవి ఉండు
26
అచటే మహా కోణ
తంత్రైక తేజమట
అదియే జగన్మూల
మంత్రైక బీజమట
27
షట్ చక్ర నిష్టితము
శత రుద్ర విష్ఠితము
త్రి జగన్ మహా దేవి
త్రైలోక్య మోహనము
25
అర్ధ నారీశ్వరుని
ఆహార్య చిత్రమది
మాహేశ్వరీ హృదయ
మాధుర్య పాత్రమది
26
త్రిపురాంబికా దేవి
స్వపురమున కేతెంచె
త్రినయనార్థాంగియై
ప్రణయినిగ శోభించె
28
వాగ్దేవతా గణము
వాక్కులతొ భూషించి
నక్షత్ర కాంతులతొ
అక్షరార్చన చేసె
29
రదనచ్చద స్వచ్ఛ
రత్నహాసాన్వితాం
నవ నీల మణి విద్ధ
నాసా మహోజ్వలాం
30
మాణిక్య రత్న మయ
మకుటాంశివాం భవాం
లలితాం భజే యంచు
వర్ణనల నుతియించి
31
శ్రీ మాతృమూర్తివని
శ్రీ మహారాజ్ఞివని
సింహాసనేశ్వరివి
చిత్కళా రూపివని
33
దేవకార్యముకొరకు
నీవె వచ్చితివనుచు
వేయి నామములతో
వేడ్కగా పాడిరట
34
రాజేశ్వరీ దేవి
రాజ్య వల్లభ ధాత్రి
రాజత్ కృపా సాంద్ర
రమ్య లీలా మూర్తి
35
తాటంక యుగళీ సు
కర్ణ భూషాన్వితాం
రదనచ్చద స్వచ్ఛ
రత్నహాసాన్వితాం పరాం
36
నవ నీల మణి విద్ధ
నవ్యోజ్వల ప్రభాం
స్వర్ణ మయ మాణిక్య
మకుటాన్వితాం శివాం
37
మధుర కీర్తన చేసి
మదిలోనె భావించి
కదులు ముందుకు మహా
కైలాస గిరి వైపు
------------------
శోడషావరణం
-------------------
(మహా కైలాస మంటపం )
1
అడుగు ముందుకు వేయ
ఆనంద మందిరము
ఆవనిపై కైలాస
శివ మహా మంటపము
2
కను మూసి కనుమయ్య
కైలాస శంకరుని
కణ కణము తానైన
కైవల్య కింకరుని
3
కనులు చెదిరే దివ్య
కమనీయ కాంతులట
హృదయమందానంద
కావ్యాను భూతులట
4
అష్ట నందులు శివుని
ఇష్ట వాహనములవి
కైలాస మంటపపు
కై వార పాలకులు
5
నందీశ్వరుడు నంది
నందికేశ్వర విభుడు
నందికేరుడు నంది
నాథుడచ్చట నుండు
6
నందివర్ధనుడునూ
నందిముఖులను గూడి
నందీ మహారాజు
నలుదిక్కులను కాచు
7
మిరుమిట్లు గొలిపేటి
మింటి చుక్కల బోలు
కోటి రుద్రులు అచట
కోరి నడిచే నేల
8
పంచ ముఖ పరమేశ
పంచతత్త్వము లచట
ప్రతి అణువులో నిండు
పరమ శివ కాంతులవి
9
వీరభద్రులు అచట
విశ్వ యాగము చేయ
నిజ రుద్రమూర్తినే
భజియింతు రట చేరి
10
మౌన ముద్రను దాల్చి
మంత్ర సాధన చేసి
మాహేశ్వరుని గొలుచు
మౌనులెందరొ అచట
11
సిద్ధులును సాధ్యులను
బ్రహ్మలును విష్ణులును
కోటి తపములు చేసి
కోరి చేరే స్థలము
12
పరమేశ రూపులగు
పార్థివేశ్వరులనే
ప్రతి అణువులో గాంచ
పరవశము పొందెదవు
13
వేదమే ఓంకార
నాదమై వినిపించ
ఎదలోయలో ప్రతి
ధ్వానమై నినదించు
14
మంద్ర స్వరప్రోక్త
మంత్రమై వినిపించు
పంచాక్షరీ జపము
పరమ పుణ్యప్రదము
15
కోటి రుద్రులు వీర
భద్రులును సిద్ధులును
ఆరాధనలు చేసి
ఆనంద మొందుదురు
16
హిమ శృంగ స్తంభముల
సుమ లతా కుంజములు
అరుణార్ణకుసుమములు
అర్కేందు పత్రములు
17
నాల్గు వేదాలవలె
నలువైపులా గిరులు
గిరులపై హర పత్ని
తీర్చి పేర్చిన తరులు
18
వెలుగు జిలుగుల నడుమ
వెలుగు మంటపమదిగొ
మంటపము మధ్యలో
వేదికా స్థలమదిగొ
19
అచట పరివేష్టించె
అపర పరమేశ్వరుడు
అది రాజరాజేశు
డర్ధనారీశ్వరుడు
20
విష్ణు దేవుడు శివుని
వేయి నామాలతో
భజియించునట చేరి
భక్తి భావము తోడ
21
అచట బ్రహ్మానంద
సంద్రమే ఉప్పొంగు
అచట అమృతపు ధార
గంగయై ప్రవహించు
22
బ్రహ్మకొక యుగమునట
అచట నిలిచిన క్షణము
అచట శివ దర్శనము
విశ్వ సంవీక్షణము
23
అరుణ వర్ణపు కాంతి
కరుణ కురిపించగా
శుక్లవర్ణము శుద్ధ
శాంతినే గలిగించు
24
అచట వీచును విమల
మలయ మారుత తతులు
అవియె వినిపించు శివ
మధుర మానస కృతులు
25
అతని కను సైగతో
కృశియించు లోకములు
ఆమె కొన చూపుతో
నశియించు శోకములు
26
శాంభవీ దంత రుచి
శంభు సరసన చేర
శర్వ నయనపు కాంతి
శర్వాణి చేరెనట
27
నిటలాక్షు డుండేటి
స్ఫటిక వేదిక అదియె
పరమేశ మోహినీ
పరమాసనమ్మదియె
28
చంద్ర శిలలకు అమృత
చందనము పూయించి
ధవళతరమాల్యములు
అవిరళ సుమార్చనలు
29
రాజ రాజేశ్వరుని
రాజ్య వేదిక పైన
రస రమ్య గీతికా
కుసుమాల పూజించు
30
హృదయమే ఉప్పొంగి
ఉద్వేగమే పొంద
శంభో మహాదేవ
యని పిలువు గొంతెత్తి
31
కన్నీటి జలధార
కడలిగా మారగా
ఆది దేవుని చేరి
అభిషేక జలమౌను
32
కైలాస వాసినం
కమనీయ విగ్రహమ్
రాజేశ్వరం భజే
రాజేశ్వరీ విభుమ్
3 3
పంచ వక్త్రం శివం
పర భూషణాన్వితం
పరమ శివ శంకరం
ఫణి భూషణం భజే
3 4
సాంద్ర భానుద్యుతిం
చంద్ర శీతాన్వితం
మహాఉగ్ర నేత్రం
భజే అగ్ర పూజ్యం
35
అర్ధ నారీశ్వరం
అర్ధ చంద్రాన్వితం
పూర్ణ యోగీశ్వరం
పూర్ణ తేజం భజే
36
భజే భాను దీప్తిం
భజే బ్రహ్మ మూర్తిం
భజే విశ్వనాథం
భజేహం సతీశం
37
కైలాస వాసినం
కమనీయ విగ్రహం
రాజ రాజేశ్వరం
రుద్ర రూపంభజే !
------
---చొప్పకట్ల భాను



Comments