రథ సప్తమి .. సూర్య జయంతి శుభాకాంక్షలు Greetings on Ratha Saptami... Surya Jayanti
- Prasad Bharadwaj
- 7 hours ago
- 3 min read

🌹రథ సప్తమి .. సూర్య జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
🌻 విశిష్టత - శుభముహూర్తం - పూజా విధానం ...🌻
ప్రసాద్ భరద్వాజ
🌹 Happy Ratha Saptami and Surya Jayanti wishes to everyone 🌹
🌻 Significance - Auspicious time - Puja procedure... 🌻
Prasad Bharadwaj
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వర శ్చ సదా శివః |
పంచ బ్రహ్మ మయాకారా యేన జాతా స్త్వమీశ్వరమ్||
కాలాత్మ సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
జన్మమృత్యు జరావ్యాధి సంసార భయనాశనః||
బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
అస్తమానే స్వయం విష్ణు స్త్రయీ మూర్తి ర్దివాకరః ||
హిందువులు పండుగలకు .. పర్వదినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మాఘమాసం కొనసాగుతుంది. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టిన రోజు మాఘమాసం శుక్ల పక్షం సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ... నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి . అలాంటి సమయంలో చెయ్యాల్సిన కొన్ని పనులు చెయ్యటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రహ్మ ముహూర్తపు శుభ సమయంలో స్నానం చేయడం, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల పాపాలు విముక్తమవుతాయని, తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు.
రథ సప్తమి అంటే అది మన జీవిత రథాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి చేసే సంకల్పం. సూర్యుడు ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి కారకుడు. సప్తాశ్వాలను పూర్చిన రథం మీద నిలబడి, రెండు చేతులతో తామర పూలను పట్టుకొని... ప్రచండమైన వెలుగులతో దర్శనమిస్తాడు.
వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అన్ని శాస్త్రాల్లో సూర్య భగవానుడి స్తుతులు కనిపిస్తాయి. 'సప్తాశ్వ రథమారూఢం'... ఏడు గుర్రాలను పూన్చిన రథం మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ ఏడు గుర్రాలు ఏడు వర్ణాలలో ఉంటాయి. మనకు ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలు ఆ ఏడు గుర్రాల నుంచే వచ్చాయంటారు. ఒకే చక్రంతో ఉండే ఆ రథానికి 'చైత్రరథం' అనే పేరు కూడా ఉంది. అందుకే సూర్యుణ్ణి 'చిత్రరథ స్వామి' అంటారు.
రథ సప్తమి శుభ ముహూర్తం
హిందూ పంచాగం ప్రకారం ఈ సంవత్సరం ( 2026) మాఘ శుక్ల సప్తమి తిథి జనవరి 25వ తేదీన తెల్లవారు జామున 12:39 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అదే రోజు జనవరి 25వ తేదీన రాత్రి 11:10 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం రథ సప్తమి 2026 పండుగను జనవరి 25వ తేదీ ఆదివారం రోజు జరుపుకుంటారు. రథసప్తమి రోజు పవిత్ర స్నానం చేయడానికి ఉదయం 5:26 గంటల నుంచి 7:13 వరకు శుభ సమయం ఉంటుంది.
రథసప్తమి రోజున సూర్యభగవానుడిని స్మరించుకుంటారు. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. సూర్య భగవానుడు ప్రత్యక్షమై తన బంగారు రథాన్ని అధిరోహించాడని నమ్ముతారు. రథ సప్తమి కథలోకి వస్తే...సూర్య దేవుడు, కశ్యప మహర్షి, అతని భార్య అదితికి జన్మించాడు. సూర్యుడు అన్ని జీవులకు ప్రాణ ప్రదాత. సూర్యుడు ఒక సంవత్సరంలో ప్రతి 12 రాశుల గుండ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తాడు.
🌻 రథ సప్తమి పూజా విధానం 🌻
రథ సప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి, తర్వాత రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు మగవారు... ఏడు చిక్కుడు ఆకులు ఆడవారు పెట్టుకుని తలస్నానం చేయాలి. రథ సప్తమి నాడు ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవుపేడతో అలికి పద్మం వేసి, పొయ్యి పెట్టి ఆవుపాలు పొంగించాలి. పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం వేయాలి. ఇలా పరమాన్నాన్ని తయారు చేయాలి.
తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు ఆకులతో రథం చేయాలి. ఆ తర్వాత ఆ చిక్కుడు ఆకులపై పరమాన్నం పెట్టి నైవేద్యం సమర్పించాలి. ఇలా వీలుకాకపోతే గ్యాస్ స్టవ్ పైన అయినా నైవేద్యం వండి సమర్పించవచ్చు. ఇలా చిత్తశుద్ధితో సూర్యుని ఆరాధిస్తే విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుందని పండితులు చెబుతున్నారు.
రథ సప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి. సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించాలి. భక్తితో సూర్యుడిని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే చేసిన పూజకి ఫలితం ఉంటుంది.
రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. ముందుగా రాగిపాత్రతో అర్ఘ్యం ( నీళ్లను) సమర్పించాలి. ఆ తర్వాత సూర్య దేవుని ఆరాధించి.. సూర్య మంత్రం, సూర్య చాలీసా పఠించాలి. ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇవ్వాలి. దీంతో పాటు నీరు, వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక, మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.
🌹🌹🌹🌹🌹



Comments