🌿🌼🌹వసంత నవరాత్రులు విశిష్టత🌹🌼🌿
చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి...అంటే ‘ఉగాది’ నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది. శిశిరంలో .... ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత... నవ పల్లవాలతో చిగిర్చి , పూల సోయగాలతో కనువిందులు చేస్తూ , సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే.. ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే... ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో , కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ?
ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే.. సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ ‘వసంత నవరాత్రులు" సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే... తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి ? పదిరాత్రులు జరుపుకోకూడదా ? ఏమిటీ లెక్క ? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ‘నవ’ అంటే ‘తొమ్మిది’ అని ‘కొత్త’ అని రెండు అర్థాలు ఉన్నాయి. ‘కొత్త’ అంటే... అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం. ఇక తొమ్మి రాత్రులు ఎందుకుచేయాలంటే....
💐 భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు 💐
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం
శ్రవణం - కీర్తనం - స్మరణం - పాదసేవనం - అర్చనం - వందనం - దాస్యం - సఖ్యం - ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తిమార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.
నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు , ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని , అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే... ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు మన ఋషులు.
🌻 వసంత నవరాత్రి మహిమ 🌻
ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|
శరద్వసంత నామానౌ తస్మాత్ దేవీం ప్రపూజయేత్||
సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండూ ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ , ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై , సర్వాపద్లినివారిణియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని , ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు."
సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రాలు అని , అర్థ సంవత్సరం గడచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ శరన్నవరాత్రులు అని వ్యవహరింప బడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం. "శ్రీరామో లలితాంబికా" అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం.
మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి , తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి , ప్రశాంత స్థితిని అనుభవించడానికి , నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు. వ్యాస మహర్షి.
నవరాత్రులకు ముందు రోజే కుంకుమ , పూలు , పండ్లు , సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని , మరునాడు (పాడ్యమినాడు) ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ "సంకల్పం" చెప్పాలి తాను భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులూ దేవిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించు కోవడమే "సంకల్పం".
తొలినాడు ముందుగా గణపతి పూజ , తరువాత పుణ్యాబవాచనం , అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి , పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. విఘ్ననివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ. పూజ జరుగు చున్న ప్రదేశము , సమయము , పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు , పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికి మనస్సు , పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం.
పూజా వేదికపై నలుదిక్కులా సూర్యుణ్ణి , గణపతిని , శివుణ్ణి , విష్ణువుని , నిలిపి , కేంద్రంలో పరాశక్తిని ప్రతిష్ఠించి ప్రశాంతమైన మనస్సుతో , నిర్మలమైన భావంతో పూజ సాగించాలి.
"భావేషు విద్యతే దేవో న పాషాణ న మృణ్మయే|
న ఫలం భావహీనానాం తస్మాత్ భావో హి కారణమ్"||
అని శాస్రం వివరిస్తోంది. శిలావిగ్రహాలలో , మట్టిబొమ్మలలో దేవుడున్నాడా ? అని అంటే అది 'భావనా' బలాన్ని బట్టి - అని శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక ఆ విగ్రహాలనో లేకమట్టిబొమ్మలనో ప్రతిమలుగా కాక , దివ్య శక్తికి ప్రతీకలుగా భావనం చేయడమే సాధనలో తొలిమెట్టు.
శ్రద్ధాళువులైన వారు నవరాత్రులలో యాథాశక్తిగా దేవీ మంత్రాన్ని జపించాలి. గౌరీ పంచాక్షరీ, బాలా షడక్షరీ, నవార్ణ చండికా, పంచదశీ, షోడశీ మంత్రాలు అన్నీ దేవికి సంబంధించినవే. గురుముఖతః ఉపదేశం పొంది, విధానం తెలుసుకొని, నియమనిష్ఠలతో మంత్రానుష్ఠానం సాగించాలి.
మంత్రము, యంత్రము, తంత్రము అనేవి మూడూ దేవీ పూజా విధానంలో ముఖ్యమైనవి. మంత్రానుష్ఠానం అయిన తరువాత పీఠపూజతో ప్రారంభించి షోడశోపచారాలతో దేవిని ఆరాధించి, సహస్రనామావళితో, అష్టోత్తర శతనామాలతో పూజించి, ధూప దీప నైవేద్యాలను, తాంబూల నీరాజనాలను సమర్పించి, యథాశక్తిగా గీత, వాద్య, నృత్య శేషాలతో అర్చించి ఛత్ర చామరాలతో దేవికి సపర్యలు చేయాలి.
ఈ తొమ్మిది రోజులూ దేవీ సంబంధమైన స్త్రోత్రాలతో, కథలతో దేవీ మహీమా విశేషాలతో కాలాన్ని దేవీ మయంగా భక్తి భావనతో దీక్షగా గడపాలి. కావ్యాలాప వినోదిని అయిన జగన్మాత సన్నిధిలో ఈ నవరాత్రులలో సౌందర్య లహరి, సప్తశతి, దేవీ బాగవతం మొదలైన దేవీ సంబంధమైన వాఙ్మయాన్ని పఠనం లేదా శ్రవణం చేయాలి. ఇలా తొమ్మిది రోజులూ పూజించి , పదవనాడు విజయ సూడకంగా విజయోత్సవం నిర్వహించాలి.
ఈ నవరాత్రులలో కుమారీ పూజ , సువాసినీ పూజ బ్రాహ్మణ పూజ జరపడం దేవికి ప్రీతి పాత్రమైన విషయాలు. కుమారీ పూజలో పాడ్యమి నుండి నవమి వరకు వరుసగా రెండు సంవత్సరాల వయస్సు గల కన్య మొదలుకొని పది సంవత్సరాల కన్య వరకు ఆ యా దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు , మంగళ ద్రవ్యాలు సమర్పించాలి.
"ఉపవాసేన నక్తేన ఏకభుక్తేన వా పునః"
అనే శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి , ఉపవాసంతో కాని , ఏక భుక్తంతో కాని , రాత్రి భోజనంతో గాని ఆహార నియమాన్ని విధించుకొని నవరాత్రి వ్రతం పాటించాలి.
🍀 పాడ్యమి నాడు రెండు సంవత్సరాల కన్య "కుమారిక !"
🍀 విదియనాడు మూడు సంవత్సరాల కన్య "త్రిమూర్తి ,"
🍀 తదియ నాడు నాలుగు సంవత్సరాల కన్య "కల్యాణి ,"
🍀 చవితినాడు ఐదు సంవత్సరాల కన్య "రోహిణి ,"
🍀 పంచమినాడు ఆఱు సంవత్సరాల కన్య"కాళిక ,"
🍀 షష్ఠినాడు ఏడు సంవత్సరాల కన్య "చండిక ,"
🍀 సప్తమినాడు ఎనిమిది సంవత్సరాల కన్య "శాంభవి ,"
🍀 అష్టమినాడు తొమ్మిది సంవత్సరాల కన్య "దుర్గ ,"
🍀 నవమినాడు పది సంవత్సరాల కన్య "సుభద్ర"
ఈ క్రమంలో ఆయా సంవత్సరాల వయః పరిమితి గల కన్యలను ఆరాధించడం వల్ల దారిద్ర్యనాశము , శత్రు వినాశము , దుఃఖ నివృత్తి , ఆయురారోగ్య బలాభివృద్ధి కలుగుతాయి.
నవరాత్రి పూజా విధానంలో సప్తమినాడు సరస్వతిని , అష్టమినాడు దుర్గను , నవమినాడు లక్ష్మిని పూజించాలి. ఈ ముగ్గురికీ మహాసరస్వతి , మహాకాళి , మహాలక్ష్మి అని పేర్లు . వీరే ముగ్గురమ్మలు.
నవరాత్రి పూజలలో ఎఱ్ఱని పుష్పాలు , ఎఱ్ఱని గంధం , ఎఱ్ఱని అక్షతలు ఎఱ్ఱని వస్త్రాలు దేవికి సమర్పించి , ఆమెను కుంకుంతో పూజించాలి. ఈ విధమైన పూజ ఆమెకు ప్రీతిపాత్రము.
"రక్త గంధా, రక్త వస్త్రా, రక్తమాల్యాసు లేపనా"
అని అమ్మవారిని వర్ణించడంలోని అంతర్యం ఇదే. ఆ తల్లి సర్వారుణ. ఆమెకు సమర్పించే పూజా ద్రవ్యాలన్నీ ఎఱ్ఱగా ఉండడమే. ఆమెకు అభీష్టమని ఇందలి అంతరార్థం. ఎఱ్ఱని రంగు అగ్నివర్ణం.
తామగ్ని వర్ణాం తపసా జ్వలన్తీం "
అని వేద వాఙ్మయం వర్ణించింది. పవిత్రతకు సంకేతం అగ్ని. ఆమె ఆ రంగులో ఉన్నది - అంటే - పవిత్రతయే దైవము. అని అర్థం. ఆ రంగులో ఉన్న పూజా ద్రవ్యాలతోనే ఆమెను అరాధించాలి. అంటే సాధకుడు పవిత్ర హృదయం కలవాడై ఉండాలి - అని అంతరార్థం.
వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో పరాశక్తిని అరాధించి అబీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.
రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిసిన తర్వాత దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు. దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి , దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని , దేవిని ఆరాధించి , సకల సంపదలనూ పొంది, దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు. అజ్ఞాతవాసం ఆరంభించబోతూ , పాండవులు విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతను సేవించి నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.
కనుక వసంత నవరాత్రులలో , శరన్నవరాత్రులలో మానవుడు ఆ పరాశక్తిని ఆరాధించి , ఐహిక , ఆముష్మిక సుఖ సంపదలను పొందవచ్చునని వ్యాసమహర్షి వివరించాడు.
🌹🌹🌹🌹🌹
Comments