top of page

శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం‌ ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు / Sri Parabhava New Year, Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 6 hours ago
  • 2 min read

🌹. శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం‌ ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి ,

Sri Parabhava New Year, Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri Greetings to All. 🌹

✍️ ప్రసాద్‌ భరధ్వాజ


🙏 శ్రీ పరాభవ నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🙏

"పరా భట్టారికా దేవీ, భవ శంకర నామినీ,

శ్రీ పరాభవ నామాబ్దే, శుభం కురు నమస్తె."


🍀 పరాభవ నామంలోని అంతరార్థం 🍀


“పరాభవ” అనే పదం లోపాలను గుర్తించి వాటిని అధిగమించి ఆత్మోన్నతికి చేరుకునే కాలాన్ని సూచిస్తుంది. మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవలం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి.


🌴. ఉగాది విశిష్టత - ఉగాదిలోని అంతరార్థం మరియు పరమార్థం 🌴


పరమాత్మ ఉపదేశించినట్లుగా మనం స్వయం ప్రకాశించే "ఆత్మ స్వరూపులమని గ్రహించి ఆ పరమాత్మను స్మరిస్తే అవమానాలు "గ్రహచారాలు రాశి దోషాలు లేని స్వర్ణయుగంలోనికి వెళ్తామని గ్రహించడమే, ఉగాది పర్వదిన ఉగాదిలోని అంతరార్థం మరియు పరమార్థం."


ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినము. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’. దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.


వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుడి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది రోజు అని, పురాణములు పేర్కొన్నాయి.


ఏడాదిలో ఉన్న 365 రోజుల్లో ఒక రోజుకు మాత్రం రాత్రి, పగలు సమానంగా ఉంటాయట. ఆరోజు తర్వాత వచ్చే తొలి పాఢ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. అంతే కాకుండా భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు భూమి పైకి సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని పేర్కొన్నారట. అలాగే వరాహమిహిరుడు తాను రూపొందించిన పంచాంగాన్ని ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ప్రజలకు అంకితం ఇచ్చారని చెబుతారు.


🪷. ఉగాది నాడు పాటించే ప్రధానాంశములు 🪷


ఉగాది పండుగ నాడు ప్రధానంగా ఆచరించే విషయములు: అభ్యంగన స్నానము, ఇష్ట దేవతారాధన, సంవత్సర దేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.


🪷. పంచాంగ శ్రవణం ప్రాముఖ్యత 🪷


తిథి వార నక్షత్రయోగ కరణములతో కూడినది - పంచాంగం.

‘‘తిథేశ్చ, శ్రీయమాప్నోతి వారాదాయుష్య వర్థనమ్

నక్షత్రాత్థరతాపాపం, యోగార్రోగ నివారణమ్

కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్

కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభౌత్’’


తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాపపరిహారం, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత, పంచాంగ శ్రవణము వలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి. జీవన ప్రణాళికకు మార్గదర్శకంగా కూడా ఉపయోగపడుతుంది.


🪷 🍯🥭🥣. ఉగాది పచ్చడి 🪷🍯🥭🥣

ఇది షడ్రుచులతో కూడిన భక్షణం. వేపపువ్వు (చేదు), మామిడి పిందె (వగరు), క్రొత్త చింతపండు (పులుపు), మిరియాల పొడి (కారం) ఇప్పుడు పచ్చి మిర్చి ముక్కలు వేస్తున్నారు. కొద్దిగా సైంధవ లవణం (ఉప్పు). మానవజీవిత వైవిధ్యం అంతా, ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అంతా మాధుర్యము- సుఖమే ఉండదు. చేదు, పులుపు, వగరు లాంటి కష్టనష్టములతో, ఒడుదుడుకులతో కూడికొని ఉంటుంది. ఉప్పు ఉంటుంది, బెల్లము ఉంటుంది. జీవితంలోనూ సుఖదుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలన్నది, ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.


🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :

1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం


2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"


ఉగాదినాడు ఈ శ్లోకములను చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page