💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 7 🏵
సిద్ధేశ్వరీపీఠంలోకి నా ప్రవేశం కూడా చిత్రమైన పరిణామం. కాళీదేవి ఆలయ నిర్మాణం తరువాత సన్యాసం తీసుకోవాలన్న ఆశ ప్రబలంగా పెరిగింది. కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి శ్రీ శివచిదానందభారతీస్వామివారిని ఈ విషయమై అభ్యర్థించాను. వారు సంతోషంగా అంగీకరించి పీఠ ఉత్తరాధికారిగా మీరు తగిన వారు అంగీకరించండి అన్నారు"స్వామి ! నేను సన్యాసం తీసుకొని గుంటూరు లోని కాళీదేవి దగ్గర కొంతకాలం, బృందావనం వెళ్ళి రాధాసాధనలో ఎక్కువ కాలం ఉందామన్న ఆలోచనలో ఉన్నాను" అన్నాను. వారు మీ ఇష్టదేవతను నేను చెప్పిన విషయమై అడగండి ఆమె ఆజ్ఞను మీరు పాటింతురు గాని అన్నారు. ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నాను. సిద్ధేశ్వరీదేవి సాక్షాత్కరించి “బృందావనంలో గుంటూరులో ఉన్నది నేనే. కుర్తాళానికి రా” అని మధురమైన పాయాసాన్ని స్వయంగా అనుగ్రహించింది. ఈ విషయాన్ని శివచిదానందస్వామివారికి చెప్పగా వారు సంతోషంతో సన్యాసదీక్ష ఇచ్చి యువరాజ పదవీ పట్టాభిషేకం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి అంతకు ముందే గుప్తంగా వారి శరీరంలో ఉన్న బ్లడ్ కాన్సర్ బైటపడటం, మూడు నెలలకే వారు సిద్ధిపొందటం జరిగింది.
నేను 2002, డిసెంబరు 19వ తేదీ దత్తజయంతి నాడు పీఠాధిపత్యం స్వీకరించడం జరిగింది. దానితో పాటు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలోని పీఠాలకు అధిపతి కావడం సంభవించింది. ఇవి కాక అనేక అనుబంధ దేవాలయాలకు పాలక పదవి స్వీకరించవలసి వచ్చింది. వీనిలో కొన్ని చోట్ల స్థానికులయిన బలవంతులతో సంఘర్షణ ఏర్పడింది. కొన్ని చోట్ల దేవాలయాలను, కొన్ని చోట్ల ఆస్తులను, స్థలాలను, భవనాలను ఆక్రమించుకొన్న వ్యక్తులతో వివాదాలు బహు ముఖాలుగా వచ్చినవి. గూండాగిరి, బెదిరింపులు కోర్టు వివాదాలు ఎక్కువ అయినాయి. అన్నీవదలి తపస్సు చేసుకుంటూ ఉందామన్న నాకు ఈ వ్యవహరాలు తలనొప్పిని కలిగించినవి. సిద్ధేశ్వరీ, సిద్ధమాత అయిన లలితాదేవికి నా వేదనను విన్నవించాను. ఆమె వాత్సల్యంతో ఎటువంటి శత్రువులనైన జయించ గల్గిన ఒక అద్భుత మంత్రాన్ని స్వయంగా ఉపదేశించింది. కొద్దిపాటి జపసాధన చేయగానే చాలా పరిమిత సమయంలో సమస్యలన్నీ పరిష్కారమైనవి. ఆ తరువాత బ్రహ్మాండ పురాణాంతర్గత మైన ఆ దేవి యొక్క చరిత్రను సామాన్యజనులకు అందుబాటు లోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సరళంగా, సుబోధకంగా లలితమైన శైలిలో రచించాను, ఆ సందర్భంగా ఆమెను స్తుతిస్తూ ఇలా పలికాను.
సీ॥ ఉపదేశమొనరించె కృపతోడ నేదేవి శత్రుంజయంబైన శాక్త విద్య అరుణారుణంబైన తరుణ సుందరమూర్తి దర్శనంబిచ్చె నే ధర్మవీర పిలిచి స్వయమ్ముగా పీఠత్రయాధీశు చేసె నే మహనీయ సిద్ధమాత రచియింపజేసి నే రసమహాసమ్రాజ్ఞి ఘనరహస్యంబైన తన చరిత్ర
గీ॥ సుకవిగా దీర్చి దివ్యమౌస్ఫురణ నిచ్చి యోగిగా మార్చె నన్ను నే రాగమూర్తి
ఆ సకల నేత్రి సిద్ధేశ్వరీ సవిత్రి లలిత నా గుండెగుడిలోన నిలుచుగాక !
లలితా సంప్రదాయంలోని సిద్ధులతో ఉన్న కొన్ని పూర్వానుబంధాలు అప్పుడప్పుడు ప్రకాశిస్తున్నవి. కాశీలో గంగాతీరంలోని అక్కడి లలితాదేవిలో లలిత కోమల లక్షణాల కంటె తీవ్ర లక్షణాలే ఎక్కువగా కనిపించి పరశంభుదేవుడు దైత్యసంహారానికి ఆమెను పిలిచిన పిలుపుగుర్తుకు వచ్చింది.
శ్లో॥ లోకసంహార రసికే కాళికే భద్రకాళికే లలితాపరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ (బ్రహ్మాండపురాణము)
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments