🌹 సిద్దేశ్వరయానం - 128 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵️ లంకాయాత్ర - 2 🏵️
కులపతి గారు (స్వామి వారు ) తమ కాలేజీలో జరిగిన ఒక 'క్లాస్' రూమ్' కథను తెలియచేశారు. ఒక విద్యార్థి ఇలా ప్రశ్నవేశాడు "మాస్టారూ! సీతను రావణాసురుడు ఎత్తుకు పోవటం తప్పేననుకోండి, అయినా దానికోసం రాముడు సైన్యాలతో వెళ్ళి, రావణాసురుని, అక్కడి ప్రజలను కొన్ని లక్షలమందిని చంపినట్లుగా రామాయణం ద్వారా తెలుస్తున్నది కదా! ఒక స్త్రీ కోసం ఇంతమంది అసంఖ్యాకులను చంపటం, గాంధీగారు మనకు చెప్పిన అహింసా సిద్ధాంతానికి, విరుద్ధం కదా! రాముడు, ఇంకో పెళ్ళి చేసుకొంటానంటే ఎవరో ఒకరు పిల్లనివ్వరా? ఇంత దారుణ మారణ కాండ జరుగకుండా ఉండేది కదా?" అని ప్రశ్నించాడు. దానికి కులపతిగారు జవాబు ఇలా చెప్పారు "మహాత్మాగాంధీగారి పేరు ప్రస్తావించావు గనుక, వారు డైరీలో వ్రాసుకొన్న ఒక సంఘటన చెపుతాను. వారి డైరీ తెలుగులో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు అనువాదం చేశారు. లైబ్రరీలో తీసుకొని చదువు. అందులో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో బెంగాలులో 'నవఖాళి' దురంతాలు జరిగినపుడు బాధితులయిన హిందువులను పరామర్శించటానికి ఓదార్చటానికి, మహాత్ముడు, స్వయంగా వెళ్ళారు. ఒక గ్రామంలో, ప్రజలను ఆయన ఇలా ప్రశ్నించాడు 'చాలా దుర్మార్గం జరిగిన సంగతి చూచాను. మహమ్మదీయులు వచ్చి, మీ ఇండ్లు కొల్లగొట్టి, మీ స్త్రీలను చెరిచి, ఊరంతా నాశనం చేస్తూ ఉంటే, మీరంతా ఏం చేస్తున్నారు. వాళ్ళను ఎదిరించలేదా? అడ్డుకోలేదా?' అని ప్రశ్నించాడు. దానికి వారు ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ "బాపూజీ! మీరు బోధించిన అహింసా సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళము మేము. అందుకే ముస్లింలు ఏమి చేసినా ప్రతిఘటించకుండా ఊరుకొన్నాము” అన్నారు. గాంధీజీ, చాలా బాధపడి, “మీరు ఇలా అకర్మణ్యులుగా ఉండేకంటే వారితో పోరాడి చచ్చిపోతే బాగుండేది", అని కోప్పడినాడు. తరువాత తనడైరీలో ఈ విషయం గూర్చి రాసుకొంటూ ఇలా ఉద్ఘాటించారు "నేను జీవించి ఉండగానే నా అహింసా సిద్ధాంతము ఇంతగా అపార్ధం చేసుకోబడునని భావించలేదు". కాశ్మీరులో పాకిస్తాన్ సైన్యం ప్రవేశించినపుడు, భారతదేశం వెంటనే వారి మీదకు సైన్యాన్నిపంపించి, అదుపు చేయాలని చెప్పినవాడు, మహాత్మాగాంధి. అహింసా సిద్ధాంత ప్రయోగం ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండాలని ఆయన అభిప్రాయం".
ఈ దేశంలో ఇటువంటి ఆలోచనలు యువతరంలో అక్కడక్కడా కన్పిస్తునే ఉన్నవి. ఒక దేశానికి యువరాజైన వ్యక్తి భవిష్యత్తులో రాజు కాబోయేటువంటివాడు శ్రీరాముడు. దేశ ప్రభువు భార్యనే మరో దేశం వాడు ఎత్తుకుపోతే, సహించి అహింసామంత్రం వల్లెవేస్తూ కూర్చుంటే ఆ జాతి ఉంటే ఏమి? లేక పోతే ఏమి?. "పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అన్నట్లే. అధర్మాన్ని శిక్షించటానికి ధర్మాన్ని రక్షించటానికి ఎంతమందిని చంపవలసి వస్తుందన్నది ప్రధానం కాదు. ధర్మం జయించాలి. దానికోసం ఎంత సాహసమైనా చేయాలి. ఆనాడయినా, ఈనాడయినా దేశానికి కావలసినది పిరికిపందలు కాదు. ధర్మవీరులు కావాలి. ఆనాడు విద్యార్థులకు సందేశం ఆ విధంగా సాగింది.
ఇంక అక్కడ గాయత్రీ యజ్ఞం జరుగుతున్న సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగినాయి. యజ్ఞప్రారంభానికి కులపతిగారు తమ గదిలో నుండి బయలు దేరుతూ ఉంటే, రాధాదేవియొక్క ప్రేమరస భావవీచిక హృదయాన్ని స్పందింపచేసింది. రాధాదేవి మహ భావస్వరూపిణి, ఆ భావ స్పర్శకు శరీరం పులకరించి కంటి వెంట అశ్రువులు రాలటం మొదలుపెట్టినవి. ఈ లంకాయాత్రకు రాధాదేవి అనుగ్రహమే ప్రధానకారణం. గాయత్రీ పీఠాధిపతి 'స్వామీ మురుగేష్' బృందవనానికి వెళ్ళి రాధాకృష్ణ మందిరాలను దర్శించి రసయోగి రాధికాప్రసాద్ మహరాజ్ గారి దర్శనం చేసుకొన్నారు. దాని ఫలితంగా, రెండు అందమైన రాధాకృష్ణ విగ్రహాలు, స్వామీ మురుగేష్కు అందచేయబడినవి. ఆ రెండు విగ్రహాలు గాయత్రీ పీఠంలో సముచిత స్థానంలో ఉంచబడి పూజలు అందుకుంటున్నవి. ఆ సందర్భంగా ఏర్పడిన పరిచయాలవల్ల, అనుబంధం వల్ల కులపతిగారి శ్రీలంకయాత్ర రూపొందింది.
( సశేషం )
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios