🌹 సిద్దేశ్వరయానం - 100 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రాధాసాధన - 3 🏵
బృందావనధామంలో రాధాకృష్ణ సాధన మిగతాదేవతా సాధనా మార్గాలకంటే భిన్నమైనది. దీనిలో జపహోమములకు ప్రాధాన్యం లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో, దేవీభాగవతంలో హోమములు చేయమని ఉన్నది. కానీ యమునాతీర యోగులు భక్తికి రసభావానికి ప్రాధాన్యం ఇస్తారు. దీర్ఘకాల జీవియైన ఒక ఔత్తరాహయోగిని మీ దీర్ఘాయువు యొక్క రహస్యమేమిటి అని ప్రశ్నిస్తే “రోజూ ఆర్తితో భజన చేస్తాను. అదే నా రహస్యము” అన్నాడట ! అయితే ఆ భావుకస్థితి రావటం సులభంకాదు. ఈ సాధన ప్రారంభించిన రోజుల్లో పట్టుదలతో లక్షలకొద్దిజపము, హోమములు చేశాను. ఏవో అనుభూతులు కలిగినవి. కానీ నాకు సంతృప్తి కలగలేదు. తీవ్రమైన వేదన చెందాను.
దుఃఖంతో మంత్రం ఆగిపోతున్నది. వేదన అగ్నివలె అవుతున్నది. అంతరిక్షంలో నుండి ఒక యోగి దిగివచ్చాడు. "బృందావనానికి వచ్చి పన్నెండురోజుల ధ్యానసాధన చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తుంది” అని పలికి అదృశ్యమైనాడు. ఆ మాటను శిరసావహించి చెప్పిన ప్రకారం చేశాను. రాసేశ్వరి కరుణించింది.
ఆ తర్వాత రాధాదేవి అవతరించిన రావల్ గ్రామానికి వెళ్ళి రాధాష్టమినాడు తెల్లవారుజామున ధ్యానంలో ఉన్నాను.గొప్ప అనుభూతి కలిగింది.అప్పటినుండి భాద్రపదశుద్ధ అష్టమి తెల్లవారు జామున ఎక్కడ ఉన్నా ఆ తల్లి కరుణ చూపిస్తూనే ఉన్నది. దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నది.బృందావనధామంలో ధ్యానసమయాలలో అమ్మ ఇటువంటి దివ్యానుభవాల నెన్నింటినో ప్రసాదించినది.
ఒక రాత్రి జపం చేస్తుంటే ఆ సువర్ణసుందరి తన కోమలహస్తంతో నా చేయి పట్టుకొని జపం చాలులే! నాకు వెన్నకావాలి పెట్టు అన్నది. ఆమె ఆజ్ఞ నెరవేర్చాను. దేవతలకు నిజంగా అవసరముందా ? సేవించుకోటానికి మనకు అవకాశమివ్వటం తప్ప! ఇటువంటి అనుగ్రహాన్ని తర్వాత కూడా చాలాసార్లు పొందాను.
దయామయి అయిన ఆ జగన్మాత నన్నొక ఉపకరణంగా మార్చి నాచేత చాలామందికి మంత్రోపదేశం చేయించి వారికి అద్భుతమైన అనుభూతులను ప్రసాదించింది. ఒకసారి బృందావనంలో నా గదిలో భక్తులతో కూర్చొని ఏదో మాట్లాడు తున్నాము. ఇంతలో ఒక భక్తురాలు వచ్చి కాళ్ళమీదపడి పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఆపమన్నా ఆగదు. “ఎన్నో ఏండ్ల నుంచి భక్తితో సాధన చేస్తున్నాను రాధారాణి అనుగ్రహించలేదు. మీరు ఆమె దర్శనం ఇప్పించండి" అంటూ దుఃఖిస్తున్నది. ఆమె కోరింది ఇప్పించటానికి నేనెంత వాడివి? ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. కొంతసేపు గడిచేసరికి ఆమె ఏడుపు ఆగింది. తలయెత్తి ఆనందంతో "నాకు దర్శనమైంది. నాకు దర్శనమైంది" అంటూ పొంగిపోతూ లేచి నమస్కరించింది. అప్పుడప్పుడు ఇటువంటి విచిత్రాలు జరుగుతున్నవి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments