🌹 సిద్దేశ్వరయానం - 102 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 హనుమదుపాసన 🏵
సన్యాసస్వీకారం తరువాత బృందావనంలో నేను ఏకాంతంగా గదిలో కూర్చుని ఉండగా ఉదయం 11 గంటలకు ఎదురుగా ఉన్న కుర్చీలో హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు. బృందావనంలో కోతులు బాగా ఉన్నమాట వాస్తవమే కాని లోపల తలుపు గడియవేసి ఉన్నది. కూర్చున్నది చాలా పెద్ద ఆకారము. వెంటనే హనుమంతుడు అన్న స్ఫురణకల్గి నమస్కరించాను. ఆ ఆకృతి కాసేపటికి అదృశ్యమయినది. ఆ అనుగ్రహ సూచన అందుకొని హనుమాన్ మంత్రసాధన మొదలు పెట్టాను. మరునాడు అదే సమయానికి మళ్లీ దర్శనం కలిగింది. ఆ కరుణ అలా ప్రసరిస్తూనేఉన్నది. కుర్తాళంలోని మా పీఠంలో ఆంజనేయస్వామి గుడి ఉంది. ఈ అనుగ్రహం ప్రారంభ మయినప్పటి నుండి అక్కడ నేనే స్వయంగా పూజ చేస్తున్నాను. పూజా సందర్భంలో కూడా అప్పుడప్పుడు వింతలు జరుగుతున్నాయి.
ఒకనాడు నా గదిలో భక్తులకు ఇవ్వగా అరటిపండ్లలో 10 పండ్లు మిగిలి ఉన్నవి. నేను గుడ్డలు మార్చుకోవడానికి లోపలకి వెడుతూ ఈ పండ్లలో ఒక అరడజనుస్వామి నివేదనకు సిద్ధం చేయండి అని చెప్పి లోపలకు వెళ్ళాను. ఈ లోపు ఒక పెద్దకోతి లోపలికి వచ్చి పళ్ళెంలో ఉన్నవాటిలో నుండి ఆరుపండ్లు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది. నేను లోపలి నుండి ఇవతలకు వచ్చేసరికి పళ్ళెంలో నాలుగు పండ్లు మాత్రమే ఉన్నవి. జరిగిన సంగతి విన్నాను. ఇస్తానన్నది అరడజనే కనుక అంతవరకు మాత్రమే తీసుకొని వెళ్ళాడు వానరేంద్రుడు. 'మిగతావి కూడా ఇవ్వండి' అన్నాను. అప్పుడు మిగతావి కూడా అందిస్తుంటే తీసుకొని వెళ్ళింది వానరం. అప్పుడప్పుడు పీఠంలో కూర్చున్నప్పుడు ఎదురుగా ఇతరులకు కనపడక నాకు మాత్రమే కనపడతూ ఒక వానరం వచ్చి కూర్చొనటం చాలాసార్లు జరిగింది. ఎన్నో ఆపదలను ఉపద్రవాలను తప్పిస్తున్నాడు. ఆ హనుమంతుడు. తిరుపతి నుండి ఒకసారి కారులో వస్తూ ఉంటే బయలుదేరగానే మనోనేత్రం ముందు హనుమంతుడు కన్పించాడు. ఎందుకా! అనుకొన్నాను. త్రోవలో ఒక పెద్ద ప్రమాదం ఒక్క క్షణంలో తప్పిపోయింది. హనుమంతుడు అక్కడ నిలబడి ఆ ఆపదను తప్పించటం ప్రత్యక్షంగా కన్పించింది.
హైదరాబాదులో ఉన్న ఒక సన్యాసిని తీవ్ర వ్యాధిగ్రస్తురాలయింది. తన బాధ తొలగించమని ఆమె అర్థించింది. ధ్యానంలో చూస్తే హనుమంతుడు కన్పించి ఈమె పూర్వజన్మలో నా భక్తురాలు. కర్మవశాన వచ్చిన ఈ వ్యాధిని పోగొట్టుకోవటానికి ఆమె శక్తిచాలదు. సహాయం చేయమని ఆదేశించాడు. ఆమె చేత హనుమాన్ మంత్రసాధన చేయించాను. ప్రయోజనం సిద్ధించింది. ఈ విధంగా అనుకోకుండా హనుమత్సాధన చిన్నతనం తరువాత మళ్ళీ ఇప్పుడు నా జీవితంలోకి ప్రవేశించింది. ఆంజనేయస్వామి నేడు నాకు నిత్యరక్షకుడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentários