🌹 సిద్దేశ్వరయానం - 103 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 కాళీసాధన 🏵
ఇప్పుడు గుంటూరులోని స్వయంసిద్ధకాళీ వీఠంలో అర్చిస్తున్న కాళీవిగ్రహం విషయం నాకు తెలియటానికి కొంత సమయం పట్టింది. ఒకరోజు ధ్యానంలో విశిష్టమైన అనుభూతి కల్గింది. నేను ఎక్కడో అడవిలో వెడుతున్నాను. నాతో మరికొందరు ప్రయాణీకులు ఉన్నారు. ఆ రాత్రి విశ్రమించి ప్రొద్దున లేచేసరికి ఎవ్వరూ లేరు. ఒక్కడినే ముందుకు వెడుతున్నాను అడవిలో కన్పించిన దోవలో ముందుకు పోతున్నాను. ఒక ఆశ్రమం వచ్చింది. చామనచాయతో బలంగా ఉన్న ఒక దీర్ఘదేహుడు విరబోసిన జుట్టు గడ్డము కలవాడు నాకు స్వాగతం చెప్పాడు. కఠిన తపస్సు చేత ఆయువును పెంపొందించుకొన్న ఆ మధ్య వయస్కుడు "ఆర్యా ! నేను మీ శిష్యపరంపరలోని వాడిని. ఈ కాళీదేవతను చాలా సంవత్సరాల నుండి నేను పూజిస్తున్నాను. నా వయస్సు ఇప్పుడు 160 సంవత్సరములు. హిమాలయాలకు వెళ్ళాలని అనిపిస్తున్నది. మీ ఆజ్ఞకోసం వేచిఉన్నాను అన్నాడు. అతని తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. కొంచెం పొట్టిగా బంగారురంగుతో ఉన్న ఆ వృద్ధుని వయస్సు 300 సంవత్సరాలు. అతడు ఇలా అన్నాడు.
“సిద్దేశ్శరా ! జన్మ మారటం వల్ల ఈ విషయాలన్నీ మీ స్మృతికి రావటానికి కొంత సమయం పడుతున్నది. మా కుమారుడు మీకు ఇక్కడి విషయాలు చెప్పాడు. నేనూ మీ పూర్వపరచితుడనే గురుకృప వల్ల నాకు దివ్యత్వం లభించింది. నా శరీరం కూడా సువర్ణచ్ఛాయకు మారిపోయింది. నా కుమారుడుకూడా అలా కావాలని నా వాంఛ. వాడు ఈ సాధన పూర్తిచేయడం కోసం హిమాలయాలకు వెళ్ళవలసి ఉన్నది. అందువల్ల ఈ కాళీవిగ్రహాన్ని మీకు మళ్ళీ అప్పగిస్తున్నాము”.
ఆ దర్శనం జరిగిన కొద్ది రోజులకు వారు సంకల్పించిన సిద్ధసహకారం వల్ల కాళీ విగ్రహం గుంటూరులోని మా ఆశ్రమంలో ప్రత్యక్షమయింది. దానికి ఆలయం కట్టించి పూజలు చేయటం జరుగుతున్నది. అక్కడ ఒక హోమకుండాన్ని అమ్మవారి ఎదురుగా ఏర్పాటు చేసి దానిలో నిత్యమూ హోమములు జరిగేటట్లుగా ఏర్పాటు చేశాను. అందలి అగ్ని ఆరదు. దానిలో ఏ హోమం చేసినా సిద్ధిస్తుంది. కొద్దికాలం క్రింద ఒక భక్తుడు వచ్చి "అయ్యా ! నేను చాలా సంవత్సరాలుగా కాళీమంత్ర సాధన చేస్తున్నాను. ఆమె దర్శనం కోసం పరితపిస్తున్నాను. రెండు రోజుల క్రింద కాళీదేవి కలలో కనిపించి నేను గుంటూరులో అవతరించి ఉన్నాను. సిద్ధేశ్వరానందస్వామికోసం దిగివచ్చాను. అక్కడకు వచ్చి నా దర్శనం చేసుకో, అంటే వందలమైళ్ళదూరం నుంచి వెతుక్కుంటూ వచ్చాను" అన్నాడు. అదేవిధంగా మరొకసారి భద్రాచలం నుండి ఒక సాధకుడు వచ్చి "స్వామీ! రకరకాల సమస్యలతో బాధపడుతూ వాటి పరిష్కారం తెలియక ఇటీవల నాడీజాతకం తీయించుకొన్నాను. దానిలో కుర్తాళపీఠాధిపతి గుంటూరులోని కాళీపీఠంలో ఉన్నారు. ఆయనను ఆశ్రయించు నీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని అందులో వ్రాయబడి ఉన్నది. మీరు నన్ను రక్షించాలి" అని ప్రార్థించాడు. దానికి తగిన ఏర్పాటు చేయటం జరిగింది.
ఇంకొకసారి హైదరాబాదు నుండి ఒక జిల్లా జడ్జి వచ్చాడు. అతడు పూర్వ జన్మలో ఉజ్జయినిలో తనభక్తుడని కాళీదేవి తెలియచేసింది. ఆ విషయం ఆయనకు చెప్పాను. అతడు “స్వామీజీ ! చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. అయితే ఆ సంగతి నాకు స్వయంగా తెలుసుకోవాలని ఉన్నది. దానికి మార్గమేదయినా చెప్పండి" అని అర్థించాడు. కాళీమంత్రం తీసుకొని ఒక మండలం జపం చేయండి అన్నాను. ఉపదేశం పొంది వెళ్ళిపట్టుదలతో సాధన చేశాడు. 41వ రోజు ఫోను చేసి "స్వామీజీ! రాత్రి కాళీదేవి దర్శనమిచ్చింది. మీరు చెప్పిందే ఆమె తెలియపరచింది. ఎమర్జన్సీ కోటాలో రైలు టిక్కెట్ తీసుకొని ఉజ్జయిని వెడుతున్నాను. మీకు ఎంతో కృతజ్ఞుడిని. ఆశీర్వదించండి" అన్నాడు.
పూర్వజన్మలో ఉజ్జయిని మహాకాళిభక్తునిగా ఉన్న మరొకవ్యక్తి నాకు బాల్యమిత్రుడు. ఆనాడు విద్యాతీర్థ అనే పేరుతో ఉన్న సన్యాసి. ఇప్పుడు గృహస్థుడు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్. ప్రసిద్ధపత్రికా సంపాదకుడు. అతడు నాతో ఉజ్జయినికి వచ్చాడు. మంచి ధ్యానసాధకుడు కూడా కావడం వల్ల నేను చెప్పిన విషయాలను రూఢి చేసుకోవడం మాత్రమే కాక గత రెండు శతాబ్దాలలో ఆ ఆలయంలో జరిగిన మార్పులను అతడు గుర్తించగలిగాడు. కాళీదేవి గుంటూరులో అవతరించినపుడు వచ్చి చూచి ఇంత భయంకరమూర్తిని మీరు ఎట్లా భరిస్తున్నారు ? అన్నాడు. మళ్ళీ ఒక నెల తరువాత వచ్చినపుడు, ఉగ్రరూపిణి ఇంత శాంతరూపిణిగా ఎలా మార్చగలిగారు? అని ప్రశ్నించాడు. "బిడ్డల దగ్గరకు వచ్చినపుడు ఎంతటి భీషణమూర్తులయినా ప్రేమమూర్తులుగా మారటం సహజమే కదా!" అన్నాను నేను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments