🌹 సిద్దేశ్వరయానం - 105 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు 🏵
ధ్యానసమయాలలో అప్పుడప్పుడు సూక్ష్మశరీరంతో వచ్చి కొందరు సందేశాలిచ్చే వారు. కొందరు మైత్రితో పలకరించి వెళ్ళిపోయేవారు. కొందరు మహనీయులు ఆశీర్వదించి, కర్తవ్యోపదేశం చేసేవారు. మరి కొందరు తమ సాధనలో ముందుకు వెళ్ళటానికి మార్గం చెప్పమనేవారు. మరి కొందరు మంత్రోపదేశం కోరేవారు. ఈ విధంగా ఎందరితోనో ఆశరీరులతో సంభాషించవలసి వచ్చేది. ఈ అనుభవాలలో కొన్నింటిని ఈ విధంగా పలికాను.నలభై సంవత్సరాల క్రింద రాధాసాధన మొదలు పెట్టినప్పుడు శ్యామానంద అన్న అశరీర సన్యాసి నా దగ్గరకు వచ్చాడు. దానిని ఆనాడు శ్రీరాధికాప్రసాద్ మహారాజాగారు కూడా గమనించారు. కాళీదేవి అవతరణ తర్వాత శ్రద్ధానందయోగి వచ్చి సన్యాసం తీసుకోవలసిన సమయం వచ్చిందని తెలియజేశాడు. పూర్వజన్మలో భైరవి యైన యోగిని ఒకరు సూక్ష్మదేహంతో కనిపించి ఆనాటి సంగతులు గుర్తుచేసింది. ఈ విధంగా మానవతీత ప్రపంచానికి మానవ ప్రపంచానికి ఉన్న చిత్రమైన సంబంధాలు - పరమేశ్వరి కరుణ వల్ల తెలుసుకొనే అవకాశం లభించింది.
ప్రకాశం జిల్లా అద్దంకిలో 'చెన్నూరు కృష్ణమూర్తి' అనే మంత్రసిద్ధుడు ఉండేవాడు. మహామంత్రవేత్త అయిన వారి తాతగారు, దగ్గర ఉండి 18 సంవత్సరములు సాధన చేయించి ఈయనను మంచి మాంత్రికునిగా తీర్చిదిద్దారు. మా ఇద్దరి మధ్య ఆత్మీయత పెరిగిన తరువాత కలిసి కొన్ని సాధనలు చేశాము. బృందావనంలో లీలానంద ఠాకూరు (పాగల్ బాబా) సమాధి దగ్గర ధ్యానం చేస్తూంటే దానిపైన స్థాపిత అయిన కాళీదేవి కొన్ని విశేషాలు తెలియచేసింది. నూట యాభై సంవత్సరముల క్రింద నేనూ, కృష్ణమూర్తి గారు కలిసి చేసిన సాధనలు కొన్నింటిని గుర్తు చేసింది. ఈ విషయం కృష్ణమూర్తి గారితో చెపితే ఆయన వచ్చి గుంటూరులో కాళీ విగ్రహం ముందు కూర్చుని ధ్యానం చేసి “మీరు చెప్పింది నిజమే. పూర్వజన్మలో నేను మీ సోదరుడను. భువనేశ్వర్ దగ్గర అడవిలో వందల కొద్ది ఉన్న సర్పాల మధ్య కాళీదేవిని గూర్చి పూజా జపహోమసాధనలు మీతో కలసి చేసినట్లు నాకు కన్పిస్తున్నది" అన్నాడు.
ప్రేమభక్తి నిలయమైన బృందావనంలో కూడా కాళీదేవికి ప్రత్యేకమైన స్థానమున్నది. సతీదేవి యొక్క శరీరభాగములు భూమిమీదపడి వివిధపీఠాలుగా వెలసినపుడు ఆమె కేశములు యమునా తీరంలో పడితే అక్కడ కేశకాళీ ఆలయాన్ని నిర్మించారు. ఇది కాక యమునా తీరంలో అక్కడక్కడ కాళీ ఆలయాలు నిర్మించబడి ఉన్నవి. గోపికలు కృష్ణుడు భర్త కావటం కోసం 'కాత్యాయనీ వ్రతం' చేసిన చోట నిర్మించబడిన ఆ దేవత ఆలయంలో ధ్యానంచేసినపుడల్లా కాళి కన్పించేది. కొన్నిసార్లు అక్కడకు వెడుతున్నపుడు, వస్తున్నపుడు, చీకటిలో కాళీదేవి పక్కనే నడుస్తుండేది. ఇటీవల అమెరికాలో సంచారం చేస్తున్నపుడు. ఆమె రక్షగా వచ్చిన సందర్భాలు ఉన్నవి. ఒక చోట, ఆకాశంలో, నెత్తురు బొట్లు రాలుతున్న ఆమె కత్తి నాముందు పోతూ చాలా
సేపు కన్పించింది. రాబోయే ఒక ఆపదను తప్పించటానికి కాళీదేవి అలా చేసిందని తరువాత తెలియవచ్చింది. ఆ ప్రయాణనంతరము జరిగిన ఒక సమావేశంలో కలిసిన ఒక ధ్యానసాధకుడు. “ఖడ్గధారిణియైన కాళి మీలో కన్పిస్తున్నది" అని తన అనుభూతిని తెలియచేశాడు.
అప్పుడు చెప్పిన పద్యం -
అద్గినవారికెల్లరకు అద్భుతరీతి ననుగ్రహించు మౌనీడ్గణ సేవ్యమాన మహనీయమహోగ్రకరాళ కాళికా ఖడ్గము రక్షగా అమెరికా గగనంబున నిల్వ - యోగి స మ్రా ద్గురుమౌళి నైతి అసమానవచోవిభవంబు వర్ధిలన్.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Commenti