top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 107 Siddeshwarayanam - 107

🌹 సిద్దేశ్వరయానం - 107 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 3 🏵


ఒకసారి కర్నూలులో మరొకసారి తెనాలిలో బౌద్ధ ధ్యానయోగ సంప్రదాయానికి చెందిన సాధకులు తమ ధ్యాన సమావేశానికి నన్ను ఆహ్వానించి బుద్ధుని ఆవాహన చేయవలసినదిగా నన్నర్థించారు. "ఆప్తులారా ! నామీది గౌరవంతో ఈ సమావేశానికి నన్ను పిలిచారు. మీది నిర్గుణ ధ్యానయోగ పద్ధతి. మంత్ర మార్గం మీద మీకు నమ్మకం లేదు. నేను దేవతలను పిలవడానికి మంత్ర పద్దతిని ఉపయోగిస్తాను. ఉన్న విషయం ఇది. మీ ఇష్టం” అన్నాను. “మీరు ఏమి చేసినాసరే, బుద్ధుని ఆవాహన చేయటం మాకు కావాలి” అన్నారు వారు. "బుద్ధుడు వచ్చినది, లేనిది తెలుసుకోగలవారు మీలో ఎవరైనా ఉన్నారా ?” అన్నాను. 'మేము గుర్తించగలము" అన్నారు. ఇద్దరు ధ్యానయోగులు. రెండు చోట్ల బుద్ధుడు అవతరించాడు. ఒక చోట ఎదురుగా వాయు మండలంలో నిల్చున్నాడు. మరొక చోట నా శరీరంలోకి ప్రవేశించాడు. అక్కడి సాధకులు ఈ విషయాన్ని గుర్తించటం జరిగింది. అయోధ్యలో కూడా అదే విధంగా భద్రకాళి దిగివచ్చి అనుగ్రహాన్ని చూపించింది.


కాశీ దగ్గర సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చునార్ కొండలమీది కాళీ ఆలయానికి వెళ్ళాము. కాళీ దర్శనం చేసి, ఇవతల అందరమూ మాట్లాడుతూ ఉండగా వృద్ధుడైన ఒక యోగి అక్కడకు వచ్చిన నా వైపు చూచి ఇలా అన్నాడు. "నేను ఇక్కడకు కొద్ది మైళ్ళదూరంలో ఒక అడవిలో ఉంటూ ముప్పై ఏండ్ల నుంచి తపస్సు చేసుకొంటున్నాను. నిన్న రాత్రి కాళీదేవి నాకు ధ్యానంలో కనిపించి 'దక్షిణాపథం నుండి నా భక్తుడొకడు వస్తున్నాడు. ఆ సిద్ధేశ్వరుని దర్శనం చేసుకో' అని ఆదేశించింది, ఆమె అనుగ్రహం వల్ల మిమ్ము గుర్తుపట్టగలిగాను. అమ్మ దయకు పాత్రులైన మహాత్ములు మీరు” అని ప్రేమ గౌరవములతో తన సాధన గురించి చెప్పాడు. ఎక్కడి గుంటూరు! ఎక్కడి చునార్ కొండలు ! ఎక్కడెక్కడి వ్యక్తులు వీరంతా !


ఆ కొండల దగ్గర క్రింద భాగంలో వల్లభాచార్యుడు స్థాపించిన రాధాకృష్ణ మందిరం ఉంది. ఆ మందిరం చూద్దామని నాతో వచ్చిన వారంతా అంటే సరే ! అని వెళ్ళాము. గర్భగుడి తలుపు పూజానంతరం తెరిచినపుడు సింహాసనం మీద అందమైన రాధాకృష్ణ విగ్రహాలను చూచి నమస్కరించి, " విగ్రహాలు చాలా అందంగా ఉన్నవి, శిల్ప నిర్మాణం అద్భుతమైనది" అన్నాను. అక్కడ వారు ఆశ్చర్యంతో “స్వామీజీ! ఇక్కడ విగ్రహాలు ఏమీ లేవు. ఆ సింహాసనమును 'రాధాకృష్ణుల గద్దె' అంటాము. ఇక్కడి సంప్రదాయంలో విగ్రహాలు పెట్టరు. రాధాకృష్ణులు అక్కడ ఉన్నారని భావించి పూజ చేస్తాము. మీకు విగ్రహాలు ఎలా కనిపించినవో మాకు అర్థం కావటం లేదు" అన్నారు. ఇవతలకు వచ్చిన వాణ్ణి మళ్ళీ వెళ్ళి చూశాను. నిజమే ! అక్కడ విగ్రహాలు ఏమీ లేవు. కానీ ఇంతకు ముందు నాకు కనిపించటం కూడా నిజమే. అది రాధాకృష్ణుల దయ.


కాశీలో కీనారామ్ అఘోరీ ఆశ్రమం ఉన్నది. షాజహాన్, ఔరంగజేబుల కాలంలో జీవించిన కాళీసిద్ధుడు అతడు. బెలూచిస్థాన్ లోని హింగుళాకాళీని శ్మశాన సాధనలతో ఆరాధించి సిద్ధుడై ఆమెను కాశీకి తీసుకు వచ్చాడు. పుర్రెల తోరణాల మాలతో ఉన్న ముఖద్వారం ఇప్పుడు కూడా అందరికి స్వాగతం చెపుతుంది. ఆనాడు అతడు 170 సంవత్సరాలు జీవించి సజీవసమాధిలోకి ప్రవేశించాడు. మణికర్ణికా ఘట్టం నుండి శ్మశాన అగ్నిని తెచ్చి అతడు వెలిగించిన హోమకుండం ఇప్పటికీ ఆరకుండా కొనసాగుతూనే ఉంది. ఆ ఆశ్రమంలో ప్రవేశించినపుడు పురా స్మృతులెన్నో మనసులో మెదిలినవి. అతని సంప్రదాయంలో సాధన చేసిన ఒక యోగి తన సాధన పరిపూర్ణత కోసం నూట యాభై సంవత్సరాల క్రింద కాశీలో నా దగ్గరకు వచ్చి నా శిష్యుడైనాడు.ఈనాడు అతడు జన్మమారి గుంటూరు హిందూకాలేజీలో లెక్చరర్గా ఉంటూ మళ్ళీ నా శిష్యుడై తీవ్రసాధన చేస్తున్నాడు.



( సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page