top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 108 Siddeshwarayanam - 108


🌹 సిద్దేశ్వరయానం - 108 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 4 🏵


ఢిల్లీలోని కల్కాజీ గుడి బహాయ్ మార్గీయుల లోటస్ టెంపులుకు దగ్గరగా ఉంది. ఆ కాళీ దేవి ఎంతో శక్తిగల దేవత. ఆమె తను అనుగ్రహాన్ని, దర్శనాన్ని ఎంతో వాత్సల్యంతో ప్రసాదించింది. కలకత్తాలోని ప్రాచీన కాళీదేవత నిత్యబలులతో రక్తపు మడుగుల మధ్య తీవ్రరూపిణిగా అలరారుతూ ఉంటే రామకృష్ణుడు పూజించిన దక్షిణేశ్వర కాళి ప్రసన్నశాంతరూపంగా భాసించింది. అర్చన పద్ధతులలో ఉండే తేడా అక్కడి చైతన్యమండలంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాశీలో రామకృష్ణ పరమహంస సాధన చేసిన ఆశ్రమంలో కూడా కాళీదేవత ప్రసన్నమూర్తిగానే ఉన్నది.


సిద్ధపురుషుడై మూడు వందల సంవత్సరాలు జీవించిన కాళీ భక్తుడు త్రైలింగస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు పరమహంస ఉన్న ఇల్లు అది. కాశీలోని త్రైలింగస్వామి ఆశ్రమంతోను ఆ మహానీయునితోను ఉన్న అనుబంధం ఇటీవల కొన్ని గుర్తుకు వచ్చినవి. రెండు వందల సంవత్సరాల క్రింద ఆయన శిష్యులుగా ఉన్న ఇద్దరు ఈనాడు నాకు శిష్యులు కావటమే కాక త్రైలింగ స్వామి కూడా నా కాళీ విగ్రహాన్ని పూజించిన వారిలో ఒకరు కావటం, అలానే రామకృష్ణ పరమహంస కూడా ఆ విగ్రహాన్ని పూజించిన వారిలో ఉండడం ఇటీవల స్మృతి పథంలోకి జగన్మాత తీసుకొని వచ్చింది.


అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తెలుగు దంపతుల కుమారుడు మంత్రసాధన యందు అభిరుచి కల్గి నా దగ్గరకు వచ్చాడు. కాళీసాధన చేయాలని తన ప్రబలమైన కాంక్షను వ్యక్తం చేయటంతో అతనికి మంత్రోపదేశం చేశాను. గుంటూరు లోను, కుర్తాళంలోను మా ఆశ్రమంలో తీవ్రంగా జపం చేశాడు. తనకు ధ్యానంలో కన్పించిన కాళీదేవి మూర్తులను అతడు చిత్రకారుడు కూడా కావడం వల్ల బొమ్మలు గీసి చూపించాడు. మంచి అనుభవాలు పొందుతున్నా డా యువకుడు. ఒక కార్తీకమాసంలో అండమాన్ దీవులలో దేవాలయ ప్రతిష్ఠల కోసం నేను వెళ్ళినపుడు స్వాతంత్య్ర సమరయోధుడు. 'సావర్కార్' ను ఉంచిన 'సెల్యులర్' జైలును చూచాను. దానిలో ఎందరో ఖైదీలను ఉంచిన గదులున్నాయి. ఒక గదిలో ఈ యువకుని పూర్వజన్మ స్వరూపం కన్పించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన ఈ వ్యక్తి ఆనాడు ఔత్తరాహుడు. జైలులో ఉన్న రోజులలో కాళీ మంత్రసాధన చేసేవాడు. అది ఈనాడు మళ్ళీ అతడికి ప్రాప్తించింది.


కాశీలో శవశివకాళీ మందిరం ఒకటి విచిత్రమయినది. అక్కడ ప్రవేశించి దేవీ దర్శనం చేసుకోగానే ఒక శిష్యుడు "స్వామీజీ ! నూట యాభై సంవత్సరాల క్రింద మనం ఇక్కడ ఉన్నట్లు ఈ మందిరంలో తపస్సు చేసినట్లు నాకు కన్పిస్తున్నది" అన్నాడు నిజమే, అతని అనుభూతి సత్యమైనదే. కాళిదాస మహాకవి కర్పూరాది స్తోత్రంలో ఈ దేవత నిలా స్తుతించి తన భక్తిని చాటుకొన్నాడు.


శ్లో॥ గతాసూనాం బాహు ప్రకరకృతి కాంచీపరిలస న్నితంబాం దిగ్వస్త్రాం త్రిభువన విధాత్రీం త్రిణయనాం శ్మశానస్థే తల్పే శవహృది మహాకాల సురత



ప్రసక్తాం త్వాం ధ్యాయన్ జపతి జడచేతా అపి కవిః


శ్మశానంలో చితాశయ్య - దానిపై శవం శవం మీద మహాకాలునితోన్నది కాళి. ఆమె దిగంబర. నడుముచుట్టూ నరికిన చేతుల దండతో మూడు కన్నులతో మూడు లోకాలను శాసించే మహాశక్తి అటువంటి నిన్ను జపం చేస్తే ఓ మహాకాళీ ! జడుడు కూడా మహాకవి అవుతాడు.


కాళీదేవి కాళిదాసుకు కవిత్వము నిచ్చింది. తెనాలి రామకృష్ణునకు కూడ కవితాశక్తి నిచ్చింది. తెనాలి రామలింగేశ్వరాలయ ధ్వజ స్తంభం క్రింద దొరికిన కాళీ విగ్రహం దీనికి నిదర్శనంగా నిలిచి ఉంది.



( సశేషం )


🌹🌹🌹🌹🌹


0 views0 comments

Comments


bottom of page