💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 6 🏵
హైదరాబాదులో ఒకసారి భాగవతసప్తాహం చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక భద్రమహిళ వచ్చి తన విషయాన్ని ఇలా విన్నవించుకొన్నది. "స్వామీ! పదవి, ఐశ్వర్యం, సేవకులు, క్రింద ఉద్యోగులు - అన్నీ ఉన్న జీవితం నాది. ఎందరో అసూయపడుతున్న వైభవం నాది. ఇతరులకు తెలియని చెప్పలేని కష్టం నన్ను పీడిస్తున్నది. సాంసారిక బంధం విచ్ఛిన్న మయింది. నేను మానసికంగా ఏకాకిని. నిరాశా నిస్పృహలతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం ఏదయినా అనుగ్రహించండి". ధ్యానంలో ఆమె సంగతి చూచి ఈ విధంగా చెప్పాను. “అమ్మా! నిన్ను ఇంతకుముందు 300 సంవత్సరాల నుండి ఎరుగుదును, ఒకప్పుడు నీవు కాళీ భక్తురాలివి, నా శిష్యురాలివి. ఆనాడు తెలిసో తెలియకో ఒక తప్పు చేశావు. దాని ఫలితంగా సర్ప జన్మ వచ్చింది. అయితే పూర్వస్మృతి ఉండడం వల్ల ఆ శరీరంలో ఉండలేక బాధపడుతూ ఒకరోజు మా కాళీ ఆశ్రమానికి వచ్చి పడగ ఎత్తి నిల్చొని దీనంగా నీ బాధను తెలియచేశావు. మనుష్యజన్మ వచ్చేటట్లు చేయమని ప్రార్థించావు.
"అమ్మా! ఈ శరీరంలో మరికొంతకాలం, ఉంటే కర్మానుభవం పూర్తవుతుంది. అప్పుడు మనిషి జన్మ వస్తుంది" అన్నాను. "స్వామీ! ఈ శరీరం భరించలేకుండా ఉన్నాను. మానవశరీరం కావాలి. ఎంతటి కష్టాన్నయినా ఆ దేహంతో అనుభవిస్తాను" అని మరీ మరీ ప్రార్థించావు. ఆనాడు నాకు ఉన్న సిద్ధశక్తుల వల్ల నీకు మనుష్య జన్మ వచ్చేలా చేశాను. అదే నీ విప్పుడు ఉన్న జన్మ. అనుభవించవలసిన ఉన్న పాపం ఇంకా కొంత మిగిలి ఉంది. దానివలన ఈ జన్మలో ఇక సుఖములు పొందలేవు. వచ్చే జన్మలో పురుష శరీరం వస్తుంది. మంచిసాధన చేసి యోగివవుతావు. ఇక ఈ జన్మలో సుఖము లేకపోయినా మానసికంగా శాంతిని పొందే పద్ధతులు చెపుతాను. నేనుపదేశించిన మార్గంలో కాళీదేవి యొక్క ధ్యాన సాధన చేయవలసింది, అన్నాను. ఇప్పుడు ఆమె ఆ సాధనలో ఉంది.
మంత్రశాస్త్రంలో సంతానకాళి మంత్రం ఒకటి అద్భుతంగా ఉపయోగిస్తున్నది. సంతానం లేని వ్యక్తులు ఎందరో ఈ మంత్రోపదేశం పొంది, సాధన చేసి సంతానవంతులు అయినారు. భూతప్రేత బాధా నివారణలో కాళీదేవి అసామాన్యమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నది. గుంటూరు కాళీపీఠంలో కాళీమంత్రసాధన చేసినవారిలో దాదాపు పదిమంది కాళీదేవి యొక్క దర్శనాన్ని పొందారు. అందులో ఒక సాధకురాలు పూర్వజన్మలో ఈ సిద్ధకాళికి అర్చకురాలుగా ఉండేది.
ఇలా కాళీదేవి ఎన్నో అద్భుత లీలలను చూపిస్తున్నది. ఆమె భీషణ సౌందర్యం నన్ను క్షణక్షణమూ ఆకర్షిస్తుంటే ఇలా స్తుతించాను.
శ్లో॥ ఆరక్తజిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం
కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.
ఎర్రని నాలుకతో వికటమైన దంష్ట్రలతో, చేతిలో శూలము, మెడలో పుర్రెల మాల అలరుతూ ఉండగా దిగంబరయై భయంకరంగా ప్రకాశించే భీషణ సౌందర్య మూర్తియైన కాళీదేవిని భజిస్తున్నాను.
ఉ॥ కంటకులైన శాత్రవుల గర్వము ఖర్వము సేయ అల్ల ము క్కంటి గృహంబు నుండి అజకల్పిత లోకము లెన్నొ దాటి నా యింటికి వచ్చి హోమగృహ మెర్రని నవ్వుల నింపి కుండపున్ మంటల మధ్య నిల్చు అతిమానుష కేళిని కాళినెంచెదన్.
నా శత్రువుల గర్వాన్ని అణచి వేయటానికి, నన్ను రక్షించటానికి కైలాసం నుండి బయలుదేరి ఎన్నో లోకాలు దాటి నా యింటిలోని హోమగృహంలో ఎర్రగా నవ్వుతూ కుండంలోని అగ్నిజ్వాలల మధ్య నిల్చున్న మానవాతీత క్రీడా స్వరూపిణియైన కాళీదేవిని స్మరిస్తున్నాను.
ఉ॥ అంటిన ప్రేమ వచ్చెను స్వయంభువుగా హిమశైలమందు, నే డుంట కళింగ భూముల నహో ! శతషట్క సువర్షమూర్తియై గుంటురిలోని నన్ మరల గోరి వియత్తలి నుండి దేవతల్ ఘంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళి గొల్చెదన్.
ఆరువందల యేండ్లు హిమాలయాలలో చేసిన నా తపస్సుకు సంతోషించి అవతరించి చిన్న విగ్రహంగా రూపుదాల్చింది. అది వయస్సును బట్టి పెరుగుతున్నది. పెద్ద విగ్రహమయ్యే సరికి నేను ఒరిస్సాలోని అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాను. నే నిప్పుడు జన్మమారినా నా మీద దయవల్ల గుంటూరు లోని మా పీఠంలో దిగి వచ్చిన ఆ కాళిని భజిస్తున్నాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments