🌹 సిద్దేశ్వరయానం - 112 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 8 🏵
లలితా సహస్రనామ పారాయణం చేయటంలో మా పరమగురువులు త్రివిక్రమ రామానందభారతీస్వామి చాలా సమర్థులు. వారి కంఠం చాలా శ్రావ్యంగా ఉండి వారు శ్లోకంగాని పద్యంగాని చదివే బాణి చాలా ఆకర్షణీయంగా ఉండేది. ఆ నామావళిని ఆయన చేత చదివించి రికార్డు చేసి పీఠంలో ఉంచారు. ఆయన లలితాదేవి అర్చన చేసేటపుడు 1970 సంవత్సరం ప్రాంతంలో నేను స్వయంగా విన్నాను కూడా. 1960 ప్రాంతంలో మొదటిసారి సన్యాసదీక్ష తీసుకొందామన్న సంకల్పం కలిగి వారిని కోరటం, వారంగీకరించటం రెండూ జరిగినాయి. కానీ, మా తల్లిదండ్రులు ఇంటి పెద్దకొడుకు ఇంత చిన్నవయస్సులో సన్యాసం తీసుకోవటానికి వీలులేదని పట్టు పట్టటంతో అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ నలభైసంవత్సరాల తరువాత అది సమకూరింది. వైరాగ్య సంస్కార సంపద పెంపొందిన నా శ్రీమతి అంగీకరించడం వల్ల, సహకరించడం వల్ల ఆశ్రమ స్వీకారం సుగమము అయింది. ఆరువందల సంవత్సరాల క్రింద బృందావనధామంలో నివసించిన ఆ భక్తురాలు ఆ నాడు కాళీసిద్ధునిగా ఉన్న నాపై పెంచుకొన్న మమకారం తరువాత వచ్చిన రెండు జన్మల అనుబంధానికి కారణమయింది.
ఇటీవల ఉజ్జయినీలో కాళీదర్శనానికి వెళ్ళినపుడు, నగరదేవత మందిరాలను చూస్తూ ఊరి బయటున్న ఒక గణపతి ఆలయానికి వెళ్ళితే అక్కడ త్రివిక్రమరామానంద భారతీస్వామివారి సూక్ష్మదేహం కనిపించింది. వారు కాశీకి అప్పుడప్పుడు వెళ్ళినట్లు తెలుసుకానీ ఉజ్జయిని వచ్చిన సంగతి తెలియదు. ఆ స్థలంతో వారికి ఏ అనుబంధమున్నదో ! సిద్ధులకు వారికి సంబంధించిన ప్రదేశాల మీద మమకారం ఉండడం అక్కడికి తరచుగా వారు వస్తూ ఉండటం నేను గమనించాను. కుర్తాళంతో మౌనస్వామికే కాదు మరికొందరు సిద్ధులకు కూడా అనుబంధం ఉండటం ఇటీవల తెలియవచ్చింది. మహనీయులుగా పేరు చెందిన మహావతార్ బాబా ఇటీవల సిద్ధేశ్వరీ మందిరంలో దర్శనమిచ్చినపుడు ఆయన నన్ను అనుగ్రహించాడని అనుకొన్నాను. తరువాత కుర్తాళంతో ఆయనకు ఉన్న అనుబంధ విశేషాలు తెలిసినవి. క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో కుర్తాళం వచ్చి 48 రోజులు తపస్సు చేసి అగస్త్యమహర్షి దర్శనం సాధించి మహాసిద్ధునిగా పరిణామం చెందిన సంఘటన, మౌనస్వామితో ఆయనకు ఉన్న అనుబంధం తెలిసి ఆశ్చర్యపడ్డాను.
అలానే ఇటీవల అరుణాచలం వెళ్ళినపుడు రమణమహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు ధ్యానం చేసినపుడు అక్కడికి కావ్యకంఠగణపతి ముని, ఒక స్వాతంత్ర సమర యోధుడు సూక్ష్మదేహాలు రావటం గమనించాను. గణపతిముని, మహర్షిభక్తుడు కనుక ఆయన సూక్ష్మశరీరం అక్కడ సంచరించటంలో ఆశ్చర్యం లేదు కానీ, ఆ స్వాతంత్ర సమర యోధుడు సాక్ష్మశరీరం అక్కడకు ఎందుకు రావాలి ? అప్పుడు కావ్యకంఠుడు చెప్పిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. బానిసతనంలో మగ్గుతున్న భారతదేశాన్ని చైతన్యవంతం చేసి స్వాతంత్ర్యమును సముపార్జించటానికి సిద్ధమండలానికి చెందినవారు కొందరు దిగి వచ్చారని వారిలో ఒకరని తన ఉమాసహస్ర గ్రంథంలో ఆయన తెలియచేశారు. అదే విధంగా ఇటీవల అమెరికాలో బోస్టన్ నగరంలో ఉన్నప్పుడు పరమహంస యోగానంద దర్శన మివ్వటం జరిగింది. కాశీలో స్వామి విశుద్ధానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయన సాధన చేసిన నవముండి ఆసన సమీపంలో ధ్యానం చేసినపుడు ఆయన సిద్ధశరీరం గోచరించింది. ఈ సిద్ధులంతా నాతో జన్మాంతర అనుబంధం కలవారే కావటం విశేషం.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments