🌹 సిద్దేశ్వరయానం - 113 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 9 🏵
అమెరికా సంచారములో కూడా చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగినవి. అట్లాంటాలో యజ్ఞం చేస్తుంటే దేవతతో పాటు ఒక సిద్ధుడు కూడా రావటం గమనించి ఫలానా సిద్ధుడు వచ్చాడని ఆయన ఆకృతి, పేరు, చెప్పినపుడు ప్రేక్షకులలో నుండి ఒక వ్యక్తి లేచి "నేను ఆయోగి శిష్యుడను. ఆయన పేరు గాని ఆకృతిగాని ఇక్కడ ఎవరికి తెలియదు. దానిని మేము రహస్యంగా ఉంచుతాము. మీరు వివరాలు చెప్పటం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది” అన్నారు. న్యూజెర్సీలో దేవీభాగవత ప్రవచనం జరుగుతుంటే ఒక ప్రేక్షకుడు మామూలు కెమెరాతో నా ఫోటో తీయగా శిరస్సు చుట్టూ ఒక కాంతివలయం పడిందట ! అతడు వెంటనే తన కెమారాను ఆ ఫోటోను ప్రేక్షకులకు చూపించి సంభ్రమానందాలను ప్రకటించాడు. కాలిఫోర్నియా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో రాధాదేవి పూజ చేసినపుడు వాతావరణంలో ఏదో ప్రసన్నమైన మార్పు వచ్చిందన్న అనుభూతి అందరికీ కలిగింది. దానికి కారణమైన బృందావనేశ్వరిని ఇలా వర్ణించాను.
ప్రేమరసాధిదేవియయి పెన్నిధియై అల కాలిఫోర్నియా వ్యోమమునందు కాంచన మయోజ్వల దివ్యరధంబు నెక్కి భవ్యామృత వీక్షణంబుల దయన్ కురిపించుచు వచ్చినట్టి కృ ష్ణామర వృక్ష పుష్పమధు వద్భుతసుందరి రాధ గొల్చెదన్.
ఆ పూజకు కారకుడైన గృహస్థు పూర్వజన్మలో బృందావన భక్తుడు కావటం. దానిని గుర్తింప చేయటానికి రాధాదేవి చేసిన లీల ఇది. ఇటువంటివి మరికొన్ని విశేషాలు కూడా. ఒక బగళాముఖి ఉపాసకుడు, ఒక యక్షుడు, ఒక గంధర్వకాంత, ఒక రెడ్ ఇండియన్ సూక్ష్మదేహి, మొదలైనవారు వివిధ ప్రదేశాలలో కనిపించి తమ తమ విశేషాలను తెలియచేసి సౌహార్దభావం ప్రదర్శించారు. గణపతి మంత్రాన్ని ఉపదేశం పొందిన ఒక మహిళ తను పూజ చేస్తూ పాలు నైవేద్యం పెడితే ఆ విగ్రహం పాలు త్రాగిందని ఆనందంతో చెప్పింది. చాలా సంవత్సరాల క్రింద ప్రపంచంలో అనేక దేశాలలో ఇటువంటి సంఘటనలు జరగటం పత్రికలు చదివిన వారికి గుర్తు ఉండి ఉంటుంది. ఈ అమెరికా వాసినికి ఇది ఆమెకు మాత్రమే పరిమితమైన అనుభవం. ఒక ఆప్తుని కుమారుడు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటరులో పనిచేస్తున్నాడు. అతని ప్రార్ధన మీద రాధామంత్రాన్ని ఉపదేశించాను. శ్రద్ధగా జపం చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరగానే కదలలేనంత జ్వరం వచ్చింది. పై అధికారికి ఫోను చేసి సెలవు మంజూరు చేయమని కోరి ఇంటిలోనే ఉండిపోయాడు. కాసేపటికి అతని ఆఫీసు భవనంలోకి విమానం దూసుకు వెళ్ళి కొన్ని వేలమంది మరణించారు. ఇతడు ఆఫీసుకు వెళ్ళి ఉంటే మిగతావాళ్ళ గతే పట్టేది. ఇతనికి జ్వరం వచ్చేటట్లు చేసి ఆఫీసుకు వెళ్ళకుండా చేసింది మంత్ర దేవత. దేవతల పద్ధతులు చిత్రంగా ఉంటవి.
అమెరికా సంచారంలో దాదాపు 20 మంది యొక్క పూర్వజన్మ రహస్యాలను దేవతలు తెలియచేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికి అధ్యాత్మికాభివృద్ధికి ఇవి ఎంతో దోహదం చేసినవి.
ఇటీవల కొద్ది సంవత్సరాలుగా ఇన్నీ అని లెక్కపెట్టటానికి వీలులేనంతగా ఎందరో వ్యక్తుల పూర్వపరజన్మ విశేషాలను పరమేశ్వరి తెలియచేస్తూ ఉన్నది. వారిలో ఎక్కువ భాగం నాతో జన్మాంతర అనుబంధం కలవారే. కొద్ది మంది ఏ సంబంధం లేనివారు కూడా ఉన్నారు. మా పీఠంలోని సన్యాసులు దాదాపు అందరి జన్మరహస్యాలను దేవి తెలిపింది. మౌనస్వామితో అయిదువేల ఏండ్ల నుండి ఉన్న జన్మనుబంధాల విశేషాలను జగన్మాత చూపించింది. ఒక సన్యాసి పూర్వజన్మలో బ్రహ్మపుత్రాతీరంలోని నాగసాధువు. ఇంకొకరు కాశీలో ఒక వేదపండితుని కుమారుడు. వేరొకరు హరిద్వారంలో తపస్వి, అలానే మా పీఠంలో అర్చకుడు పూర్వజన్మలో ఒక మళయాళ మంత్రసిద్ధుని శిష్యుడు. గుంటూరులోని కాళీమందిర నిర్మాణానికి సహాయపడిన ఒక ధనవంతుడు పూర్వం నాగాలాండ్లో దైవభక్తుడు. ఒక భక్తురాలు రెండువేల అయిదువందల సంవత్సరాల క్రింద బుద్ధుడు సాధన దశలో ఉన్నపుడు బోధివృక్షం దగ్గర ఆయనకు అన్నం పెట్టిన సుజాత. ఇప్పుడు ఒక గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి పూర్వం ఒక కొండమీద కాళీసాధన చేసి అది సిద్ధించక దత్తాత్రేయ సాధనలోకి మారి ఆస్వామి అనుగ్రహాన్ని కొంత పొందాడు. ఇప్పుడు జన్మమారి బ్రహ్మచారియై తీవ్రసాధన చేసి యోగివర్యునిగా కీర్తించబడుతున్నాడు. యజ్ఞప్రియుడైన ఒకరాజు జన్మమారి ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి వాసనా బలం వల్ల కొన్ని వందల యజ్ఞాలను చేయించి పురాణప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తున్నాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments