🌹 సిద్దేశ్వరయానం - 116 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 12 🏵
నేను కుర్తాళ పీఠాధిపతినైన తరువాత సహజ పరిణామంగా సిద్ధేశ్వరీపీఠం కూడా జప, ధ్యాన, హోమ కేంద్రంగా మారిపోయింది. అక్కడ ప్రత్యేకంగా యజ్ఞశాల అంతకుముందే అనేక కుండాలతో నిర్మించబడి ఉండటం వల్ల ఒకే సమయంలో వివిధ సాధకులు తమ మంత్రములతో హోమాలు చేసుకోవటానికి ఏర్పాట్లు చేయబడినవి. జపపురశ్చరణలు చేసిన అనేకులు ఇప్పుడు దశాంశ హోమాలు చేసుకోవటానికి కుర్తాళానికి వస్తున్నారు. ఇప్పుడు వసతి గృహంలోని గదులన్నీ నిండిపోతున్నవి. నిరంతర హోమధూమములతో ఆకాశం మేఘావృతమైనదా అనిపిస్తున్నది. వైదిక సంప్రదాయములో వేదమంత్ర సాధనచేయటానికి ఉపనయనమైన వ్యక్తులు మాత్రమే అర్హులు. కానీ తంత్రోక్తమైన మంత్రములు చేయటానికి అందరికీ అర్హత ఉన్నది. స్త్రీలు, పురుషులు అన్ని కులముల వారు అన్ని జాతుల వారు అర్హులే.
మేరుతంత్రము, శారదాతిలకతంత్రము, మంత్రమహోదధి, శాక్త ప్రమోదము మొదలైన ప్రామాణిక గ్రంథాలు వేదాధికారము లేనివారు కూడా హోమములు చేసే ప్రక్రియ తెలియచేసినవి. ఆ గ్రంథముల నుండి వాటిని తీసి ఆ ప్రక్రియను ముద్రింప చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాను. కుర్తాళంలోను, గుంటూరులోను మా పీఠానికి సంబంధించిన అనేక ఆలయాలలోను హోమములు ఇప్పుడు నిరంతరాయముగా సాగుతున్నవి.
కాళీదేవి అవతరణ వల్ల గుంటూరులోని స్వయం సిద్ధకాళీపీఠం సిద్ధిస్థానమైతే, మహనీయుడైన మౌనస్వామి ప్రభావం వల్ల కుర్తాళం సిద్ధకేంద్రం అయింది. అద్భుతశక్తి సంపన్నమైన నాడీగణపతి ఆలయము, ప్రధాన పీఠదేవత అయిన సిద్ధేశ్వరీ మందిరము, మౌనస్వామి సమాధి మందిరము దివ్యశక్తి కేంద్రములై సాధకులకు చాలా వేగంగా మంత్రసిద్ధిని కలిగిస్తూ దివ్యానుభవాలను ప్రసాదిస్తున్నవి. అలానే పాతాళ ప్రత్యంగిరా భద్రకాళి మందిరంలో సమర్పిస్తున్న కూష్మాండాది బలుల వల్ల, చేస్తున్న పూజా నైవేద్యముల వల్ల, సాధకుల జపసమర్పణల వల్ల, మంగళవార రాహుకాల పూజల వల్ల, అమావాస్య హోమముల వల్ల ఆకర్షించబడి ఒక తీవ్రదేవత అక్కడకు చేరింది. భక్తులకు కామితములు ప్రసాదిస్తున్నది. అందువలన అక్కడి కార్యక్రమాలలో పాల్గొనే ప్రజల సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నది.
తమిళదేశంలో ప్రత్యంగిరా దేవత చండమార్తాండ స్ఫూర్తితో ఇవాళ ప్రకాశిస్తున్నది. రాజకీయరంగంలోని ప్రముఖులు కొందరు ప్రత్యంగిరాయజ్ఞాలవల్ల ఎన్నికలలో గెలిచి అధికారములోకి వచ్చారని ప్రజలలో వ్యాపించటంతో ఆ దేవతా మందిరాలు చాలా ఎక్కువగా నిర్మించబడినవి. అందుకే మా పూర్వస్వామి కుర్తాళపీఠంలో పాతాళ ప్రత్యంగిరా లయాన్ని నిర్మించారు. నేను పీఠాధిపతినయిన తరువాత విశాఖపట్టణంలో గుంటూరులో హైదరాబాదులో ప్రత్యంగిర ఆలయాలు నిర్మించి ఎంతటి కష్టాలనయినా పోగొట్టటం జరుగుతున్నది.
నలభై యేండ్ల నుండి అధర్వణవేదంలోని ప్రత్యంగిరా ఋక్కులు పారాయణ చేయటం నా దినచర్యలో భాగం. ప్రత్యంగిరా భద్రకాళీ హోమములు నేను చాలా ఇష్టంతో చేసిన క్రతువులు. కుర్తాళ పీఠానికి వచ్చిన తరువాత మౌనస్వామి అనుగ్రహం వల్ల ప్రజోపకార విషయంలో నాకు శ్రమ చాలా తగ్గింది. ఇంతకు ముందు ఎవరికయినా ఇబ్బంది తొలగించవలసి వస్తే అవసరమయిన మంత్ర ప్రయోగం జప, హోమ, ప్రక్రియలతో చేయవలసి వచ్చేది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యకర పరిణామాలను ఋజువు చేసినవి.
విశాఖపట్టణంలో ఓపెన్ హార్టు సర్జరీ కోసం ఒక భద్రమహిళ ఆపరేషన్ థియేటరులోకి తీసుకొని పోబడుతున్న సమయంలో ఆమె యందు అభిమానం కల ఇద్దర ప్రముఖులు మా లలితాపీఠానికి వచ్చి ఆపరేషను విజయవంతంగా జరిగేటట్లు ఆశీర్వదించమని అభ్యర్థించారు. నేను మౌనస్వామిని స్మరించి మంత్రాక్షతలు ఇచ్చాను. వాటిని తీసుకువెళ్ళి ఆమె శిరస్సున ఉంచారు. థియేటరులోకి తీసుకొని వెళ్ళినతరువాత శస్త్ర చికిత్స చేసే ముందు జాగ్రత్త కోసం ఫైనల్ చెకప్చేస్తే వ్యాధి లక్షణాలు కనపడలేదు. ఆపరేషన్ అవసరం లేదని నిర్ణయించి డాక్టర్లు ఆశ్చర్యంతో ఆమెను వెనక్కి పంపించారు. ఇటువంటి సంఘటనలు మరికొన్ని కూడా జరిగి మౌనస్వామి యొక్క ప్రభావాన్ని అడుగడుగునా తెలియచేసినవి. నేను ఎక్కింది విక్రమార్క సింహాసనం అనిగ్రహించాను.
ధ్యానయోగులనేకులు నాలో వివిధ దేవతలు ఉండటాన్ని చూచారు. కొందరు కాళిని, కొందరు రాధను కొందరు భద్రను, కొందరు హనుమంతుని చూస్తే, మరికొందరు మౌనస్వామిని చూడగలిగారు. పాదపూజ జరిగినప్పుడల్లా మౌనస్వామి అష్టోత్తర శతనామావళిని పఠించినపుడు ఆయన అవతరించటాన్ని చాలా మంది దార్శనికులు చూడగలిగారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments