🌹 సిద్దేశ్వరయానం - 117 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 13 🏵
కొద్ది కాలం క్రింద మదరాసులో ఒక ప్రముఖుని ఇంటిలో పాదపూజ జరిగింది. మౌనస్వామి నామావళితో పీఠపాదుకలకు ఆగమోక్త విధానంలో అర్చన చేయటం జరిగింది. ఆ సమయంలో పూజ చేసే దంపతులు నా పాదములను కడిగి ఆనీరు శిరస్సుపై చిలకరించుకొని ఆ నీటి పళ్ళాన్ని ప్రక్కన పెట్టారు. పూజ పూర్తయిన తరువాత నేను మరొక గదిలోకి విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాను. ఆ సమయంలో 'రేకీ' మార్గంలో సాధన చేసిన అతని మిత్రుడు యాదృచ్చికంగా వచ్చాడు. ఈ హడావుడి అంతా చూసి అడిగి విషయం తెలుకుకొన్నాడు.
"నీవు చదువుకొన్న వాడవు, వివేకమున్నవాడవు. దేవాలయానికి వెళ్ళటం దేవునికి పూజచేయటం అంటే నేను అర్థం చేసుకోగలను కానీ, మనుష్యులకు పూజ చేయటం ఏమిటి ? వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తిన చల్లుకోవటం ఏమిటి? ఈ పద్ధతులు, ఈ ఆచారాలు అర్థం లేనివి" అని అతడు ఆక్షేపించాడు. మాట్లాడుతూ జేబులో ఉన్న ఏదో ఒక వస్తువు తీయటం కోసం దానిలో పైన ఉన్న వస్తువు ఒకటి చేతిలో పట్టుకొన్నాడు. అది స్ఫటికంతో చేసిన ఒక పరికరం. ఒక వస్తువులో కాని, మనిషిలో కాని ఉన్న దివ్యశక్తిని కొలిచే సాధనం. అది అతడు చేతిలో పట్టుకోగానే తీగకు వ్రేళాడుతున్న ఆ స్పటికం కాళ్ళు కడిగిన నీళ్ళున్న పళ్ళెం వైపు కదలటం మొదలు పెట్టింది. అతడికి ఆశ్చర్యం కలిగి ఆ పరికరాన్ని కొంచెం దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదివర్తులాకారంలో గిరగిర తిరగటం మొదలు పెట్టింది.
“ఈ నీళ్ళలో ఏదో దివ్యశక్తి ప్రవేశించింది. ఆ చిహ్నాలను ఈ పరికరం చూపిస్తున్నది. స్వాముల వారి కాళ్ళు కడిగిన నీళ్ళలో ఇంత అద్భుత శక్తి ఉండటం విచిత్రంగా ఉన్నది" అన్నాడు అతడు. ఆ నీళ్ళలో అపూర్వమైన దైవచైతన్యమున్నట్లు గృహస్థు గ్రహించి ఒక గిన్నెలో ఆ నీళ్ళు పోసి ఫ్రిజ్లో పెట్టుకొని రోజూ తాను తన కుటుంబసభ్యులు శిరస్సున చల్లుకొంటున్నారు. అతడు కుర్తాళంలో ఉత్సవాలు జరిగినపుడు వచ్చి ఒక సమావేశంలో ఈ విషయాన్ని తెలియచేశాడు. భక్తులు సాధకులు అప్పుడప్పుడు ఇటువంటి అనుభవము లెన్నింటినో తెలియ చేస్తున్నారు.
నేను మొదటిసారి చాతుర్మాస్యం కుర్తాళంలో చేస్తున్నపుడు వచ్చిన భక్తులు ఇక్కడ కొంతకాలం మీతో పాటు ఉంటూ సాధన చేసుకొంటాము. అందరూ కలసి చేసే యజ్ఞమేదైన నిర్దేశించండి అన్నారు. “సర్వదేవతామంత్రముల సిద్ధికి కారకమైనది- గురుకృప - ఇక్కడ దత్తస్వరూపుడైన మౌనస్వామి గురువు. కనుక గురుమంత్రంతో యజ్ఞం చేయండి అన్నాను. యజ్ఞం ప్రారంభించి హోమాగ్నిలో ఆవాహన చేయంగానే మౌనస్వామి యొక్క అవతరణాన్ని మొదటిసారి గమనించిన వారు రామకృష్ణానంద భారతీస్వామి. “అడుగో! మౌనస్వామి వచ్చాడు. హోమకుండంలో నాకు కన్పిస్తున్నాడు” అన్నాడు ఆయన. అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో చేసిన ఆ గురు యజ్ఞం సిద్ధగురు కరుణను అందరిమీద ప్రసరింపచేసింది. యజ్ఞసమయంలో ప్రతిరోజూ పగలు యజ్ఞం రాత్రి పూట ధ్యానం జరుగుతూండటం కుర్తాళంలో అలవాటుగా మారిపోయింది. ఒకనాటి అర్థనిశా సమయంలో ధ్యానం చేస్తున్న వారిలో ఉన్న ఒక సన్యాసిని ఉన్నట్లుండి కిందపడిపోయింది. ఎవరూ గమనించలేదు.ఆమెకు స్పృహ తప్పిపోయే స్థితి వచ్చింది. నెమ్మదిగా పాకుతూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నది. ఒక్క క్షణం ఆమె వైపు చూచాను. ఒక భయంకరమైన పెద్ద కుక్క ఆమె గొంతు పట్టుకు కొరుకుతున్న దృశ్యం కన్పిస్తున్నది. నేను తీక్షణంగా చూడగానే ఆ కుక్క ఆమెను వదలి వెనక్కు వెళ్ళిపోయింది. చాలా కాలం క్రింద ఆమెను ప్రేమించిన ఒక యువకుడు ఆమె తిరస్కరించగా కోపం ద్వేషంగా మారి ఒక క్షుద్రమాంత్రికుని పట్టుకొని ప్రయోగం చేయించాడు. అది కాలభైరవ ప్రయోగం. ఆ ప్రయోగ పిశాచం శునక రూపంలో ఆమెను పీడిస్తున్నది. ఆ ప్రయోగ బాధా నివారణకు కావలసిన జప హోమములు చేయించి మౌనస్వామి అనుగ్రహం వల్ల ఆమెకు స్వస్థత చేకూర్చటం జరిగింది.
ఈ విధంగా ఇవాళ ఎందరో ఇక్కడకు వచ్చి, మౌనస్వామి అనుగ్రహం వల్ల తమ బాధల నుండి విముక్తులవుతున్నారు. తనకు సేవచేసిన ఒక వ్యక్తి ఇప్పుడొక తమిళునిగా జన్మించాడని, అతని పేరు చెప్పి అతడు వచ్చినపుడు మంత్రోపదేశం చేసి మంత్రసిద్ధి వేగంగా కలిగేలా ఆశీర్వదించమని చెప్పారు. ఆ తరువాత కొద్దిరోజులకే అతడు రావటం అతనికి చేయవలసిన ఉపదేశం చేయటం జరిగింది. దాని ఫలితంగా అతను తీవ్రసాధన చేసి ఎన్నో దివ్యానుభవాలను పొందుతున్నాడు. సిద్ధశరీరంతో మౌనస్వామి చేస్తున్న పనులు అసామాన్యమైనవి. ఆయన భౌతిక శరీరంతో ఉండగా తన పూర్వ పరజన్మల గురించి ఎవరితోనూ చెప్పినట్లు దాఖలాలు లేవు. నా మీద అభిమానం వల్ల, అనుగ్రహం వల్ల ఆయన సమాధి ముందు కూర్చొని ధ్యానం చేసినపుడు ఆయా విశేషాలను ఎన్నింటినో తెలియచేయటం వల్ల వాటిని ఉల్లేఖించే అవకాశం కలిగింది. వీటితో పాటు అక్కడకు అప్పుడప్పుడు వస్తున్న సిద్ధులు తోటలోని అయ్యప్ప గుడి దగ్గర కన్పిస్తున్న మళయాళ మాంత్రికుడు ఆశ్రమంలో అశరీరి అయి తిరుగుతున్న తంజావూరుస్వామి, వస్తూ పోతూ ఉన్న మహావతార్ బాబా, భాస్కరాచార్యుల వంటి మహనీయులు తెలిపిన విశేషాలెన్నో ఈ చరిత్ర కథనంలో చోటుచేసుకొన్నవి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
댓글