🌹 సిద్దేశ్వరయానం - 121 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవసాధన -3 🏵
ఆంధ్రదేశంలో చాలా చోట్ల భైరవాలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలో, ఢిల్లీలో ఇంకా అనేక క్షేత్రాలలో ప్రసిద్ధమయిన భైరవాలయాలు ప్రకాశిస్తున్నాయి. దాదాపు ప్రతిచోట మద్యాన్ని నైవేద్యం పెట్టటం ఆచారంగా ఉంది. ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని పులివెందుల దగ్గర మోపూరు గ్రామంలో కొండమీద బాలభైరవుని ఆలయమున్నది. ఆ దేవుని వర్ణన క్రీడాభిరామంలో వల్లభరాయడనే కవి ఇలా వర్ణించాడు.
సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహములవాని
పవడంపు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిలకోమల జటాచ్ఛటల వాని
ఇంద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహకాంతి వాని
ఉడురాజు రుచులతో నొరవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసముల వాని
గీ॥ సిగ్గుమాలిన మొలవాని చిరుతవాని ఎల్లకాలంబు ములికినా డేలువాని
అర్థి మోపూర నవతారమైన వాని భైరవుని గొల్వవచ్చిరి భక్తవరులు.
అతడు భైరవుని ప్రత్యక్షం చేసుకొని సిద్ధసారస్వతశ్రీని పొందానని వ్రాసుకొన్నాడు. ఆ మోపూరి భైరవుని భక్తుడయిన ఒకరు ఇప్పుడు గోదావరి జిల్లాలో పుట్టి నా దగ్గరకువచ్చి కుర్తాళంలో భైరవసాధన మొదలు పెట్టాడు. అతడి జన్మరహస్యం కుర్తాళనాడీగణపతి సన్నిధిలో తెలియచేయబడింది. కుర్తాళంలో కుర్తాళ నాథేశ్వరుని ఆలయంలో సుందరమైన భైరవ విగ్రహం ఉన్నది. అక్కడే మౌనస్వామి చాలా కాలం తపస్సు చేశాడు. దక్షిణదేశంలో చాలా చోట్ల శివాలయాలలో, కుమారస్వామి ఆలయాలలో భైరవ విగ్రహాలున్నవి. ప్రాచీనులు ఎప్పుడో ఆ ఆలయాలను నిర్మించారు. కానీ భైరవునికి పూజలు జరగటం అంతగా కన్పించటం లేదు. కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠంలోను, గుంటూరులో సిద్ధేశ్వరీ వీఠమందిరంలోను, విశాఖపట్టణంలోని లలితాపీఠంలోనూ కాలభైరవునకు ఆలయాలు కట్టించాను. అక్కడ నిత్యపూజలు జరుగుతున్నవి. మందార వారుణీ మద ఘూర్ణితాత్ముడు, డమరు, ఖట్వాంగ కపాలపాణి, కుర్కుర పరివార కోటిసేవితుడైన ఆ భైరవుని స్తుతిస్తూ నేను చెప్పిన పద్యాలను చూడండి.
శ్లో॥ నమో భూతనాధం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమోరుండమాలం
నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం
సీ ॥ హాలామదాలోల లీలా విలాసాయ భవ నమస్తే కాలభైరవాయ
కాళికా సురత శృంగార సంప్రీతాయ వర నమస్తే కాలభైరవాయ
డమరు కృపాణ దండ కపాలహస్తాయ భర్గ నమః కాలభైరవాయ
అట్టహాస పలాయితాంతకాయ హరాయ వందనం తే కాలభైరవాయ
లోకములో కొందరు ప్రేమోన్మాదులు. కొందరు దివ్యోన్మాదులు. నేను మంత్రోన్మాదిని. వ్యాసుని రచనలు చూచి కాశీకి వెళ్ళాలి. గంగలో స్నానం చేయాలని చాలా సార్లు అనుకొనేవాడిని. నీ అనుమతి వస్తేనే గదా ఎవడైనా ఆ పంచక్రోశపరీత క్షేత్రంలో అడుగు పెట్టేది. ఎలానో వచ్చాను. నీ వెలుగు కోసం వెదుకుతున్నాను. అన్నట్లు మొన్న నీ ద్వీపానికి వెళ్ళి వచ్చాను. అక్కడ నీ దర్శనమైన తర్వాత అది నీ నివాసమైన భైరవ ద్వీపమని తెలుసుకొన్నాను. నా అనుచరుడు కూడా స్వామీజీ! ఇక్కడి కిదివర కెప్పుడో వచ్చినట్లు అనిపిస్తున్నది అన్నాడు. నిజమే ! ఇక్కడ నీవు కాళీదేవితో విహరించావు. ఎన్ని జన్మల నుంచో అప్పుడప్పుడు వచ్చి నిన్ను సేవిస్తూనే ఉన్నాము.
పూర్వం ఒక జన్మలో జాతకరీత్యా మారక సమయం వచ్చింది. గ్రహముల శక్తిని ఎదిరించే ఆశ పోయింది. అయినా నిన్ను నమ్మి భజించాను. మృత్యువు దూరంగా వెళ్ళిపోయింది. నా భక్తి భరిత సాధనకు సంతోషించి నన్ను మహాసిద్ధుని చేశావు. నాధ సంప్రదాయంలో తపస్సు చేసినందువల్ల అందరూ నన్ను భైరవనాధుడన్నారు. ఆనాడు నన్ను ఎలా ఉద్ధరించావో ఓ ప్రభూ ! ఈనాడు కూడా ఆవిధంగానే రక్షించు.
కాశీలో భూగుహలున్నవని చెప్పబడే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆది యుగాలలో జైగీషవ్యుడనే మునిగా నే నక్కడ ఉన్నట్లు స్ఫురించింది. అలానే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నివసిస్తూ అనూరాధ అనే ఒక దేవకన్యను పెండ్లి చేసుకొని సంతానాన్ని కన్న తరువాత విశ్వామిత్రుని కథలో మేనకవలె ఆమె విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. క్షేత్రంలో రకరకాల అనుభూతులు. నావే కాక నాతో పాటున్న ఎందరివో జన్మ రహస్యాలు, దేవతలు, సిద్ధులు తెలియచేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు బృందావనము, కాశీ, కుర్తాళము ఈ మూడూ ప్రధాన కేంద్రాలుగా నా తపస్సాధన సాగుతున్నది.
వేల సంవత్సరాలనుండి అనేక దివ్యక్షేత్రముల వలె కుర్తాళం కూడా ఒక అద్భుత సిద్ధక్షేత్రం. అగస్త్య మహర్షి దీనిని మహనీయ యోగకేంద్రంగా తీర్చిదిద్దాడు. ఎందరో మహాయోగులు తపస్సు చేసిన స్థలమిది. ఇప్పటికి గుర్తువచ్చినంత వరకు నాలుగు వేల ఏండ్ల క్రింద నేను ఇక్కడకు మొదటిసారి వచ్చాను. మహనీయుడైన మౌనస్వామి కూడా వచ్చారు. అప్పటినుండి ఈ స్థలంతో ఈ క్షేత్రంతో ఇక్కడ యోగులతో అనుబంధం. ఇక్కడి యోగులు మరెక్కడ పుట్టినా, మరెక్కడ నివసిస్తున్నా వారితో పరిచయం పునరావృతమౌతూనే ఉన్నది. అందుకే ఇది సిద్ధిస్థానం. ఇక్కడకు వచ్చి తపస్సు చేయండి. శీఘ్రంగా ఫలిస్తుంది అని యెలుగెత్తి ఉద్బోదిస్తున్నాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments