🌹 సిద్దేశ్వరయానం - 122 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 జలభైరవుడు 🏵
హిమాలయాల నుండి కుర్తాళం
ఒకనాటి ప్రాతస్సంధ్యా సమయంలో సిద్ధేశ్వరానంద స్వామివారు కుర్తాళ జలపాతాలలో స్నానం చేయటానికి వెళ్ళారు. అందులోని నీళ్ళు వ్యాధి నివారకమైనవని ప్రసిద్ధి. వేల లక్షలమంది అక్కడ స్నానం చేయటానికి వస్తుంటారు. స్నాన ఘట్టాలు చాలా ఉన్నా ఊరికి దగ్గరగా ఉన్న చోట్ల ఎక్కువ జనం వస్తుంటారు. కొంచెం దూరంగా ప్రశాంతంగా ఉండే స్థలం దగ్గరకు పీఠ అధికారులు స్వామివారిని తీసుకెళ్ళారు. స్నానం పూర్తి అయిన తర్వాత వస్త్రాలు ధరించి సూర్యదేవుని వైపు చూస్తూ నమస్కారం చేశారు.
అలంకారప్రియోవిష్ణుః అభిషేకప్రియశ్శివః నమస్కారప్రియస్సూర్యః గణేశస్తర్పణప్రియః దీపప్రియః కార్తవీర్యః దత్తస్తు స్మరణప్రియః హోమప్రియో మహేంద్రస్తు జగన్మాతార్చనప్రియా||
చక్కగా తులసిదళాలతో అలంకరిస్తే నారాయణుడు సంతోషిస్తాడు. అభిషేకం చేస్తే పరమేశ్వరునకిష్టం. నమస్కారాలు చేస్తే సూర్యుడికిష్టం. అందుకే సూర్య నమస్కారాలంటారు. తర్పణములు చేస్తే వినాయకుడు సంతృప్తిచెంది వరాలిస్తాడు. దీపం వెలిగించి కార్తవీర్యార్జునా! అంటే ఆ యింటికి చోరాది ఉపద్రవములు లేకుండా చూసుకొంటాడా సహస్ర బాహువు. స్మరిస్తే చాలు దత్తా! అనగానే దత్తాత్రేయస్వామి దిగివస్తాడు. ఇంద్రుడు యజ్ఞములంటే ఇష్టపడతాడు. జగన్మాత పరమేశ్వరి పూలతో కుంకుమతో పూజిస్తే సంతోషించి వరాలిస్తుంది.
అందుకని స్వామివారు సూర్యునకు నమస్కరించారు. అలా ప్రణతులు, ప్రణుతులు అర్పిస్తున్నవారి నోటినుండి కమనీయ కవిత ప్రవహించింది.
గీ॥ ప్రకృతిదేవీ పరిష్వంగ పారవశ్య మధురకల్పాంత రతిరసోన్మత్తుడైన విశ్వపురుషుడు కన్నులు విచ్చువేళ విరియు తొలిసంజమము నడిపించుగాక!
వింటున్న భక్తులు సువర్ణ సుందరమైన కవిత్వాన్ని వినే అదృష్టం ఇవాళ మాకు లభించిందని పొంగిపోయినారు. అక్కడి భక్తుడొకడు “స్వామివారూ! మీరు క్రిందటి జన్మలో యోగులయితే ఈ జన్మలో యోగీశ్వరులు” అని నమస్కరించాడు. స్వామివారు చిరునవ్వుతో “సరి! దానికేమి! ఆశ్రమానికి పోదాం పదండి" అని కదిలారు.
పీఠానికి వెళ్ళిన తరువాత కాసేపటికి మౌనస్వామి సమాధి దగ్గరకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. మనోభూమికలో ఒక దృశ్యం కన్పిస్తున్నది. మౌనస్వామి, వారి గురువుగారు అచ్యుతానందసరస్వతీ స్వామి, చౌరంగీనాధ్ జలపాతాలపైన ఆకాశంలో కనిపిస్తున్నారు. అచ్యుతానందస్వామి ఇలా పలికారు. "సిద్ధేశ్వరా! ఈ జలపాతం భైరవస్వరూపం. ఇన్నాళ్ళు నీవు భైరవుని జప ధ్యానములలో కాళీవల్లభునిగా, కాశీ క్షేత్ర పాలకునిగా, హోమములో అగ్నిస్వరూపునిగా భావిస్తున్నావు. ఇకమీద జలభైరవునిగా కూడా అర్చించు. ఈ జలరూపుడైన మహాభైరవుడు సర్వప్రయోగములను, ఉపద్రవములను తొలగించి రక్షిస్తాడు. దీని మంత్ర తంత్ర విధానాలు నీకు తెలియజేయ బడుతున్నవి. మౌనస్వామి, చౌరంగీనాధుడు ఆశీర్వదించారు. వారదృశ్యులైనారు.
(చౌరంగీనాధ్ సారంగనాధుడు. తెలుగు భాషలో ఇతనిని గూర్చిన కథ నాటకంగా వచ్చింది. రాజమహేంద్రపురపాలకుడైన రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి భార్యలు. పెద్ద భార్య రత్నాంగి కుమారుడు సారంగధరుడు. చిన్న భార్య చిత్రాంగి యువకుడైన సారంగధరుని తన కామవాంఛ తీర్చమని కోరింది. ధర్మవిరుద్ధమని అతడు తిరస్కరించాడు. చిత్రాంగి మహారాజుతో సారంగధరుడు తనను బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. ఆ రాజు నమ్మి తన కుమారుని కాళ్ళు చేతులు నరికించాడు. వధ్యశాలలో జరిగిన ఈ దృశ్యాన్ని ఆకాశంలో వెళుతున్న మత్స్యేంద్రనాధుడనే సిద్ధుడు చూచి సారంగధరుని రక్షించి తనతో తీసుకొనివెళ్ళి సిద్ధుని చేశాడు. అయితే ఈ కథను చరిత్ర పరిశోధకులు కొట్టిపారేశారు. రాజరాజ నరేంద్రునకు రత్నాంగి, చిత్రాంగి అనే భార్యలుకాని సారంగధరుడనే కుమారుడుగాని లేరు. ఈ కథ తెలుగు దేశపు కథ కాదు. మహారాష్ట్రలో ఈ కథ జరిగింది. ఆ సారంగధరుడే చౌరంగీ నాధుడు. సిద్ధమార్గంలో నాధ సంప్రదాయం ప్రసిద్ధమైనది. మత్స్యేంద్రనాథ్ కథ సినిమాగా కూడా వచ్చింది. స్వామివారు యాత్రలకు వెళ్ళినప్పుడు ఉజ్జయినిలో మత్స్యేంద్రనాధునిదని చెప్పబడే సమాధిని, గోరఖ్నాధుని గుహను చూచారు. ఉజ్జయినిలో మహకాళి ఉన్నది. గోరఖ్నాధుడు చేసిన కాళీమంత్రం వేగనిద్ధిదాయకమైనది. కుర్తాళవీరానికి అచ్యుతానందసరస్వతీస్వామి నుండి సాధనలో నాధసంప్రదాయం ప్రవేశించింది)
ఈ మధ్య గడ్డాలు జడలు పెరిగిన ఒక యువకుడు వచ్చి అలఖ్ నిరంజన్ అంటూ పాదనమస్కారం చేశాడు. ఎవరు నీవు అంటే అతడు "స్వామివారు! నేను కాలేజీలో మీ దగ్గర చదువుకొన్నాను. ఉత్తరాదికి వెళ్ళి నాధయోగులలో చేరాను. ఇటీవల ఒక పెద్దాయన నీవు చదువుకొనేప్పుడు నీకు పాఠాలు చెప్పిన గురువుగారు ఇప్పుడు గొప్ప పీఠాథిపతి. సిద్ధపురుషుడు. వారిదగ్గరకు వెళ్ళి మంత్రోపదేశం పొందిరా! అని పంపించాడు. నన్ను ఆనుగ్రహించండి" అని ప్రార్ధించాడు. స్వామివారా యువకునిపై దయ చూపించారు. కొన్నాళ్ళు గుంటూరు కాళీ పీఠంలో ఉండి సేవచేసిన అతనిని పూర్వ మిత్రులు పలకరించి అతడు తిరుగుతున్న కొండలలో గుహలలో ఉండే విశేషాలను ఆసక్తితో తెలుసుకొన్నారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments