🌹 సిద్దేశ్వరయానం - 123 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శ్రీశైల గుహ -శిష్యానుభూతి 🏵
స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రింద శ్రీశైలంలో తపస్సుచేశారు. వారి ధ్యానగుహ అరణ్యంలో చాలా దూర ప్రదేశంలో ఉంది. ఒకసారి భక్తులతో మాట్లాడుతూ ప్రసంగ వశాన అది ఎక్కడ ఉన్నదో అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ విషయం తెలుసుకొన్న ఒక భక్తురాలు - తీవ్ర సాధకురాలు. ఆ గుహకు వెళ్ళి తానుకూడా ధ్యానం చేయాలని సంకల్పించింది. ప్రొద్దుననే లేచి అల్పాహారం తీసుకొని మధ్యాహ్నమునకు కావలసినది పొట్లం కట్టుకొని ఒక సీసా మంచినీళ్ళు తీసుకొని బయలుదేరింది. ఆ కొండమీద అడవిలో వెదుకుతూ సరిగా దోవలేని చోట ఏకాంతంగా ఒక్కతే వెళ్ళటం చాలా సాహసం. సుమారు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సు. బయలుదేరిన మొదట అక్కడక్కడ మనుషులు కనిపించారు. తరువాత లోపలకు పోయినకొద్దీ నిర్మానుష్య ప్రదేశాలు. మధ్యాహ్నానికి కష్టం మీద ఆ గుహకు చేరుకొంది ఆమె. దానికి కొద్ది దూరంలో ఒక కొలను ఉంది. ఆకలిగా ఉంది, ఆహారం తీసుకుందామని అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహమూ చన్నీళ్ళతో కడుక్కొని ఒక చెట్టుక్రింద కూర్చొని పొట్లం విప్పింది. ఉన్నట్లుండి చెట్లమీద ఉన్న కోతులు దూకి వచ్చి ఆ ఆహారం పొట్లం లాక్కుపోయినవి. వాటి దాడికి భయభ్రాంతురాలైంది. నోట మాటరాలేదు. ఏడుపు వచ్చింది. అయినా ధైర్యం తెచ్చుకొని గుహలోకి వెళ్ళింది. లోపల ఒక పెద్ద పీట, ఒక యోగదండము, కమండలము ఇంకా కొన్ని పాత వస్తువులు కనిపించినవి. గురువుగారు ఒకప్పుడు తపస్సు చేసినచోటు ఇదన్నమాట!
కష్టపడి వచ్చినందుకు ఫలితం లభించింది అన్న సంతృప్తి కలిగింది. కొంతసేపు ధ్యానం చేసి చీకటి పడకముందే వసతికి చేరుకోవచ్చులే అని ఆమె మంత్ర జపం మొదలుపెట్టింది. ఒకవైపు పెద్ద బండను ఆనుకొని కండ్లుమూసుకొన్న ఆమె అలసటవల్ల నిద్రలోకి వెళ్ళిందో లేక భావసమాధిలోకి వెళ్ళిందో కండ్లు తెరిచేసరికి సాయంకాల మవుతున్నది. వెలుతురుండగా శ్రీశైలగ్రామంలోకి ప్రవేశించగలనా అని అనుమానం కలిగింది. అయినా ధైర్యం తెచ్చుకొని నడవటం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద పాములు అడ్డంగా వెళుతున్నవి. ఒకటి రెండు పడగవిప్పి చూస్తున్నవి. నడుస్తున్నది. నలుగురు నడిచే దోవ కాక పోవటంవల్ల వచ్చిన దోవ కనుక్కోలేకపోయింది. దారి తప్పింది. ఎటుపోవాలో తెలియదు. ఎటు పోతున్నదో తెలియదు. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నవి. ఎంత దూరం నడిచినా గమ్యం ఎలాచేరుకోవాలో తెలియలేదు. భయం ఎక్కువైంది. ఏడుపువస్తున్నది. చెట్లమధ్య గాడాంధకారం అలముకొన్నది. గురువుగారికి చెపితే అనుమతించరని చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని తనకు తాను నిందించుకొంది.
తప్పు చేశాను స్వామీ! కాపాడు - ఆర్తురాలిని - దీనురాలిని - దిక్కులేని దానిలాగ ఇక్కడ చావకుండా రక్షించు అని ప్రార్ధించటం మొదలు పెట్టింది.
"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప యితః పరంబెరుగ మన్నింప దగున్" ప్రేమతో రావో సద్గురు యోగి రాజ! కరుణన్ రక్షింపు సిద్ధేశ్వరా!
ఎంత వేడుకొన్నా ఎవరూ ఆదుకోటానికి రాలేదు. "స్వామికి నా పిలుపు వినిపించిందో లేదో! లేక విన్నా రక్షించాలని కరుణ కలుగ లేదో!" ఆమెకు దః ఖం పొరలుకొని వస్తున్నది. అశ్రువులు రాలుతున్నవి. ఆవేదన పొంగుతున్నది. ఇంతలో ఎవరో చెయ్యిపట్టుకొని నడిపిస్తున్నట్లు అనిపించింది. ఇంతకు ముందులాగా శ్రమలేదు. గాలిలో తేలిపోతున్నట్లున్నది. సిద్ధగురు కరస్పర్శ తెలుస్తున్నది.
శరణం భవశరణం భవ కరుణామృత సింధో గురు శేఖర సిద్ధేశ్వర చరణాశ్రిత బంధో!
ఉదయం నాలుగు గంటలు పట్టిన ప్రయాణం పదిహేను నిమిషాలకంటే పట్టలేదు. ఊరికి దగ్గరపడిన తరువాత అక్కడక్కడ త్రోవలో మనుషులు కనిపించారు. తనను వాళ్ళెవరూ పలకరించలేదు. తను వాళ్ళకు కనిపిస్తున్నానా అని అనుమానం కలిగింది. తను ఉన్న ఆశ్రమ ద్వారాలు మూయకముందే చేరుకొంది. దయామయుడైన గురుదేవుని కరుణ అప్పటికి అర్థమైంది. ఆ రోజు రాత్రి స్వప్నంలో దీర్ఘాన్నత దేహంతో బంగారురంగుతో నల్లని గడ్డంతో స్వామి పూర్వరూపం దర్శనమిచ్చింది. ఎన్నో వందల సంవత్సరాల క్రిందనించి ఉన్న దివ్య శరీరమది. ఆ గుహలో తపస్సు చేసినప్పుడున్న ఆకారమది. తను చేసిన సాహసం నిష్ఫలం కాలేదు. ఈనాడు నిత్యప్రసన్నుడు పరమ ప్రశాంతుడు అయిన గురుదేవులు వృద్ధునిగా కనిపిస్తున్నా ఆ స్వామి అసలు శరీరము సువర్ణ సుందర ఋషిమూర్తి. ఆ మహాపురుషున కాయోగిని అంజలి ఘటించింది.
త్వమేవ మాతాచ పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ
త్వమేవ సర్వం మమదేవ దేవ!
స్వామివారు అభయమిచ్చి ఆశీర్వదించారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentários