top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 14 Siddeshwarayanam - 14


🌹 సిద్దేశ్వరయానం - 14 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🌹సిద్దేశ్వరయానం 🌹


Part-14


🏵 భైరవనాథుడు 🏵


శ్లో॥ గంగాతరంగ కమనీయజటాకలాపం


గౌరీనిరంతర విభూషిత వామభాగం


నారాయణప్రియ మనంగమదాపహారం


వారాణసీ పురపతిం భజ విశ్వనాథమ్


శ్లోకాలు చదువుతూ గంగాస్నానం చేసి తాము తెచ్చుకొన్న పాత్రలలో గంగోదకాన్ని నింపుకొని విశ్వనాథుని మందిరానికి వెళ్ళి ఆ పరమశివుని లింగం మీద హరహర మహాదేవ శంభో అంటూ అభిషేకం చేస్తున్నారు.


దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు. వారిలో ఒక యువకుడు అలానే వచ్చి విశ్వేశ్వరుని దర్శించుకొని అన్నపూర్ణకు నమస్కరించి అక్కడ నుండి కాలభైరవుని ఆలయానికి వెళ్ళాడు. ఆ గుడిలో భైరవుని ముందు నిల్చొని ఒక భక్తుడు మధుర కంఠంతో స్వామిని స్తుతిస్తున్నాడు.


శ్లో॥ దేవరాజ సేవ్యమాన పావనాంఫ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్ర మిందుశేఖరం కృపాకరం


నారదాది యోగిబృంద వందితం దిగంబరం


కాశికాపురాధినాథ కాలభైరవం భజే.


ఆ స్తోత్రం వింటూ పరవశించిపోయి యువకుడు కండ్లు మూసుకొని ఒక ప్రక్కన అలానే కూర్చుండిపోయినాడు. కాసేపయిన తర్వాత అచటి భక్తులు సత్రంలో భోజనాలు పెడుతున్నారు పదండి! అంటూ అరుస్తుంటే కండ్లు తెరిచి వారితో పాటు తానూ వెళ్ళి ప్రక్కన ఉన్న ధర్మశాలలో భోజనం చేసి దానికి కొంత దూరంలో ఉన్న తన గ్రామానికి వెళ్ళాడు. సాయంకాలం తమ యింటి దగ్గర తనకు చదువు చెప్పిన గురువు గారి యింటికి వెళ్ళాడు. తాను కాశీ వెళ్ళి చూచినవన్నీ మనవి చేశాడు. ఆయన విని చాలా సంతోషించాడు. ఆ గురువుగారు మంచి శివభక్తుడు. నిరంతర పంచాక్షరీ జప పరాయణుడు రోజూ సాయంకాలం పూట వారి యింటికి చాలామంది వస్తుంటారు. ఆయన కాసేపు పురాణ ప్రవచనం చేసి తరువాత భజన చేయిస్తాడు. అనంతరం ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువసేపుండి ధ్యానం చేస్తారు. సాధకుల అభిరుచిని బట్టి, తగిన పద్ధతిలో మంత్రోపదేశం చేస్తాడు. తనకాయన హంసమంత్రాన్ని ఉపదేశించాడు. ఉచ్ఛ్వాసనిశ్వాసములతో అనుసంధానం చేసి ధ్యానం చేసే ప్రక్రియను నేర్పాడు. ఈ సాధన మార్గంపట్ల వారికి దివ్యచక్షువు తొందరగా వికసించిందట!


ఆ రోజు ధ్యానం ముగించే ముందు ఆ గురువుగారు తనతో అన్నాడు “ఈవేళ చిత్రమైన విషయాలు కొన్నిగోచరించినవి. నీవు కాశీ వెళ్ళి దేవతా దర్శనం చేసి వచ్చావు. దీని ప్రభావం నీ మీద చాలా ఉన్నట్లు అనిపిస్తున్నది. జటాధారియైన ఒక ఋషి నీలో కనిపిస్తున్నాడు.


త్రిధావిభక్తం తవ దీర్ఘ సంస్కృతిః


జపస్తపః కర్మసు వీర్యముగ్రం


అని వినిపిస్తున్నది. పూర్వజన్మలో నీవెవరో ఋషివి. జన్మ మారింది. గనుక నీకు గుర్తు లేదు. ఇప్పుడు తపస్సు చేసి పూర్వస్మృతి తెచ్చుకోవచ్చు. ఈ జన్మలో కర్తవ్యమేమిటో తెలుసుకోవచ్చు."


యువకుడు :


గురువుగారూ! నన్నిప్పుడేమి చేయమంటారు ?


గురువు :


బాబూ ! నాకు స్ఫురిస్తున్నంత వరకు భవిష్యత్తులో నీవొక సిద్ధుడవవుతావు. అసామాన్య శక్తులు సాధిస్తావు. అయితే దాని కోసం ఎంతో కష్టపడి తపస్సు చేయాలి. ఆ చేసే లక్షణము, పట్టుదల నీకున్నవి. ప్రస్తుతం మీ తల్లిదండ్రులను ఒప్పించి కాశీ వెళ్ళి జపధ్యానములు చెయ్యి. కాశి మహా శ్మశానం. అందులోని శ్మశానంలో మణికర్ణికా ఘాట్ దగ్గరనో, హరిశ్చంద్ర ఘాట్లోనో రాత్రింబగళ్ళు భైరవమంత్ర జపం చెయ్యి. వారణాసిలో సత్రాలలో భోజనానికే ఇబ్బంది ఉండదు. అప్పుడప్పుడు వచ్చి యింట్లో పెద్దవాళ్ళను చూచి వెళుతూ ఉండు. తీవ్రసాధన మొదలు పెడితే కొంతకాలం అయిన తర్వాత ఉపాసిత దేవతలు విఘ్నాలు తొలగించి మంత్రసిద్ధి కలిగిస్తారు.


యువకుడు :


కర్తవ్యోపదేశం చేసి మార్గదర్శనం చేశారు, ధన్యుణ్ణి. అతడింటికి వెళ్ళి కొద్దిరోజుల తర్వాత తన కోర్కె యింట్లో వాళ్ళకు తెలియజేశాడు. తల్లిదండ్రులు వృద్ధులు - పెద్ద కుటుంబం. తినగుడువ లోటు లేనివాళ్ళు. సుమారైన ఆస్తిపాస్తులున్నవి. ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయటం తక్కువ. రాజోద్యోగాలు కొద్దిమందికే లభిస్తవి. పొలాలు చూచుకొంటూ కాలక్షేపం చేయటమే ఎక్కువ. చిన్నవాడివి, నీకిప్పుడే జపతపములేమిటి అని చెప్పి చూచారు. కాని అతడు పట్టుపట్టడం వల్ల కాదనలేదు. ఆ రోజుల్లో చాలామంది కాశీ వెళ్ళి కొన్నాళ్ళుండి జపతపములు చేసి రావటం మామూలే. ప్రక్కనే గనుక, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటానంటున్నాడు గనుక ఇంట్లో వాళ్ళు సరేనన్నారు. సోదరీ సోదరులున్నారు- పెద్దలను చూచుకొంటారు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹




Comments


bottom of page