🌹 సిద్దేశ్వరయానం - 15 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
సాధన ప్రారంభమైంది. గంగ ఒడ్డున కూచొని జపం చేసుకొనే వారు చాలామంది పగలు చేసేవారు. రాత్రిపూట కొద్దిమంది ఉండేవారు. ఆరునెలలు గడిచేసరికి రాత్రిపూట కంటిముందు వెలుగులు కనిపించటం మొదలైంది. కాని భైరవ సాక్షాత్కారంలేదు. వ్యాసులవారు పన్నెండు వందల సంవత్సరాల క్రింద పురాణాలు వ్రాశారట! అందులో స్కాందపురాణంలోని కాశీఖండంలో భైరవుని గూర్చి కాశీలో ఆరునెలలు తపస్సు చేస్తే ప్రత్యక్షమై కోరిన వరాలిస్తాడని ఉన్నదని పెద్దలు చెప్పగా విన్నాడు. ఆరునెలలు తపస్సంటే ఏమిటి? ఆహార నిద్రాదులకు కొంత సమయం తప్పుడు గదా! అవి లేకుండా పూర్తి సమయం జపధ్యానములు సాధ్యము కాదు గదా! ఉన్నంతలో భూశయనము, ఏకభుక్తము, వీలైనంత మౌనము పాటిస్తున్నాడు. ఎంతకాలమైనా సరే! భైరవ సాక్షాత్కారము పొంది తీరాలి.
ఒక రోజక్కడి కెవరో యోగి వచ్చాడు. ఇతనిని చూసి పిలిచాడు. "నాయనా! నిన్ను చూస్తే ముచ్చట వేస్తున్నది. ఇంత చిన్న వయస్సులో కష్టపడి తపస్సు చేస్తున్నావు. నీకు త్వరలో భైరవానుగ్రహం కలుగుతుంది. ఇక్కడకు కొద్దిదూరంలో కాశీలో ఒక అంచున జైగీషవ్యుని గుహఉన్నది. ఆ మహాయోగి పూర్వయుగం నాటివాడు. కైలాసం నుండి దిగి వచ్చిన ప్రమధుడంటారు. ఆ గుహలో తపస్సు చేస్తే నీకు వేగంగా విశ్వనాధుని అనుగ్రహము, భైరవ సాక్షాత్కారము కలుగుతుందని అనిపిస్తున్నది".
ఆ యోగి చెప్పింది బాగానే ఉంది. చేసి చూద్దాము అని అక్కడికి వెళ్ళి సాధన ప్రారంభించాడు. ఆ ప్రదేశంలో గుహకు కొంచెము ముందు శివాలయము నిర్మించబడి ఉంది. దానికి జైగీషవ్యేశ్వర ఆలయమని పేరు. ఉదయం, సాయంత్రం కొద్దిమంది జనం వచ్చి దర్శించి పూజ చేసుకొని వెళుతుంటారు. చీకటిపడితే నిర్మానుష్యం. గుడిలో మాత్రం ఒక ఆముదపు దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ గుడిలో ఒక సౌకర్యం ఏర్పడింది. మధ్యాహ్నం ఎక్కడికి భోజనానికి వెళ్ళవలసిన పనిలేదు. సంపన్నుడొకడు ఒక బండిలో పెద్ద పాత్రలలో రొట్టెలు, కూర తెచ్చి విస్తళ్ళలో పెట్టి యాచకులకు పంచి వెళుతుంటారు. బైరాగులు, సన్యాసులు, పేదవారు ప్రతిరోజు ఆ బండి కోసం ఎదురు చూస్తుంటారు. ఈదాత వంటివారు క్షేత్రాలలో అక్కడక్కడ ఉంటారు. సత్రాలకు వచ్చి అందరూ తినలేకపోవచ్చు.కొందరు సాధకులు ఆశ్రమాలలో కుటీరాలలో ఉంటారు. వారి కోసం ఈ దాతలు ఒక పద్ధతి పెట్టుకొన్నారు. రొట్టెల బండ్లు బయలుదేరి ఈ కుటీరాల ముందు విస్తరిలో పదార్థాలు పెట్టి పైన మరొక విస్తరి కప్పి వెళ్ళిపోతుంటారు.
ఇది చాలా సౌకర్యంగా ఉంది.
ఈ పద్ధతిలో ఆరునెలలు గడిచింది. సాధన సాగుతున్నది. ఈ మధ్యకాలంలో ఒకటి రెండుసార్లు స్వగ్రామానికి వెళ్ళివచ్చాడు. అందరినీ పలకరించి "ఇక నేను ఇదివరకటి వలె రాలేకపోవచ్చు. తపస్సు చేస్తున్నప్పుడు ప్రయాణాలు చేయకూడదని పెద్దలంటున్నారు. కనుక ఎప్పుడిక్కడికి వస్తానో చెప్పలేను" అని చెప్పి పెద్దవారందరికి నమస్కరించి కాశీ వచ్చేశాడు. ఇప్పుడిక అనుబంధాలేవీ లేనట్లే. అప్పుడప్పుడు విశ్వనాధాలయానికి కాలభైరవ మందిరానికి మాత్రమే వెళ్ళి వస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా ఆహారావసరం తగ్గిపోయింది. అంతరిక్షం నుండి అలలుఅలలుగా శక్తి తన శరీరంలోకి అవతరిస్తున్నది. జపం తగ్గింది. మంత్రాక్షరాలు కాంతిమంతంగా మూసిన కన్నుల ముందు కనిపిస్తున్నవి. స్థిరంగా తపస్సు జరుగుతున్నది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments