🌹 సిద్దేశ్వరయానం - 17 🌹
💐 శ్రీసిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
యువకుడు : ఉషఃకాలము, ఋషివాక్యము కలిసి వచ్చినవని అనుకొని మహర్షితో కలిసి బయలుదేరాడు. ఎండెక్కిన తరువాత నడక ఎక్కువ అలవాటు లేకపోవటం వల్ల, సూర్యతాపం వల్ల అలసిపోయినాడు. ఆకలి, నీరసం తట్టుకోలేక పోతున్నాడు. కండ్లు మూసుకొని జపధ్యానములు చేయటం వేరు. ఈ శరీర శ్రమవేరు. ఇతని పరిస్థితి చూచి మహర్షి ఒక చెట్టు నీడన ఆగుదామన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత శిష్యులను చూచి అదుగో! అటువైపు చెట్లు గుబురుగా ఉన్నచోట ఒక కొలను ఉన్నది. దానిలోని నీళ్ళు తాగండి. ఆ చెట్ల పండ్లు తిని ఆకలి తీర్చుకోండి అన్నాడు. శిష్యులు బయలుదేరారు. యువకునితో నీవిక్కడే ఉండు అన్నాడు ఋషి, నాలుగు నిమిషాలు ఆగి గాలిలోకి చేయి చాచాడు. చేతిలోకి ఒక పాత్ర వచ్చింది. దానిలో ఒక ఆకుపచ్చని పసరు వంటిది ఉన్నది. యువకుని కిచ్చి త్రాగమన్నాడు. ఆయన ఆజ్ఞప్రకారం దానిని తాగగానే అలసట, ఆకలి పోయి అద్భుతబలం వచ్చింది. ఈ ప్రయాణంలో నీకిక ప్రయాణశ్రమ ఉండదు. ఆకలి దప్పికల బాధ, నడకలో నొప్పులు ఏవీ ఉండవు. నీవు త్రాగినది ఒక దివ్య వృక్ష ఫలరసము. ఇక ఈ ప్రయాణంలో నీవు తెలుసుకోవలసిన అంశాలు కొన్ని ఉన్నవి. నేను చెపుతుంటాను. వింటూ సందేహాలేవైనా వస్తే అడుగుతూ ఉండు. నీ పేరు నాగేశ్వరుడు. భైరవదర్శనం కలిగింది గనుక ఇక మీద నిన్ను నాగభైరవా! అని పిలుస్తుంటాను.
యువకుడు : తమ అనుగ్రహము. నాయందు ఇంత కరుణ ఎందుకు చూపిస్తున్నారో ఊహించలేకున్నాను. అకారణజాయమాన కరుణా పయోనిధులుగా మీరు భాసిస్తున్నారు.
వామదేవ : నాగభైరవా! ఇది అకారణము కాదు. కొన్నిసార్లు కారణము తెలియనప్పుడు ఈ మాటవాడుతుంటారు. నీ దగ్గరకు నేను రావటం, ఈ ప్రయాణం- ఇవేవీ యాదృచ్ఛికములు కావు. హిమాలయములలోని మా ఋషుల ప్రణాళిక యిది. నిన్నొక దేవకార్యము కోసం ఎన్నుకొన్నాము.
యువకుడు : దేవకార్యం నిర్వహించగలవాడనా? నేను సామాన్యుడను. మీ పేరు నేను పురాణాలలో చదివాను. కృతయుగం నాటి వామదేవఋషి మీరేనా అని అడగటానికి జంకుగా ఉంది.
వామదేవ : అప్పటివాడనే. మేము కొందరు ఋషులము నిర్మాణకాయులము. యుగమును బట్టి శరీరమును మార్చుకొంటాము.శక్తిస్ఫురణలు మారవు. నీవూ సామాన్యుడవు కావు. మహాఋషివే. ఈశ్వరేచ్ఛ వలన ద్వాపరాంతమున నాగభూమిలో పుట్టి తపస్సుచేసి సిద్ధనాగుడవైనావు. కలియుగములో వెయ్యేండ్లు గడచిన తర్వాత దక్షిణ భారతములో అగస్త్యుడు నివసించే కుర్తాళానికి సిద్ధ సమావేశానికి వెళ్ళి ఆ కుంభసంభవుని ఆజ్ఞ వల్ల లోకకళ్యాణం కోసం ధర్మరక్షణ కోసం జన్మలెత్తవలసి వచ్చింది. అయినా ఎప్పటికప్పుడు మేము వచ్చి సాధనలు చేయించి శక్తులను, దివ్యస్ఫురణను ఇస్తూ ఉంటాము. నీవు రాధా పరివారము నుండి వచ్చిన శాంత సాత్విక మూర్తివి. నీలోకి శివపరశుశక్తి ప్రవేశించింది. దానివలన ధర్మరక్షణ, దుష్టశిక్షణ చేయగలశక్తులకు నీవు కేంద్రమైనావు. భైరవుడు కృష్ణభూమి రక్షణకు నిన్ను ఆజ్ఞాపించాడు గదా! దానికోసం నిన్ను సిద్ధం చేయటానికి నిన్ను తీసుకు వెళుతున్నాను.
యువకుడు: కృష్ణభూమి అంటే నా అల్పబుద్ధికి తోచినంతవరకు ఇంద్రప్రస్థము దగ్గరి బృందావనం- మధుర- మరొకటి ద్వారక. అది సముద్రంలో మునిగిపోయింది. గనుక ప్రస్తుతం బృందావనం రాధాకృష్ణ ధామం. ఆ ప్రదేశానికేదైనా ఇబ్బందులు వస్తున్నవా?
వామదేవ : వస్తున్నవి. అధర్మం విజృంభిస్తున్నప్పుడు ధర్మం కోసం నిలబడవలసిన వారు బలహీనులైనప్పుడు దేశానికి కష్టనష్టములు వస్తవి. ప్రసిద్ధ ధర్మరక్షకులైన సూర్యచంద్ర వంశీయ క్షత్రియులు బలం కోల్పోయినారు. భారతకాలం నాటికే రఘువంశీయులు నామమాత్ర ప్రభువులు. భారత యుద్ధం తరువాత పాండవ వంశ వైభవం నెమ్మదిగా పడిపోయింది. యుధిష్ఠిరుని పాలన తర్వాత రాజైన పరీక్షిత్తు మునిశాపగ్రస్తుడై సర్పదష్టుడై మరణించాడు. అతని కుమారుడు జనమేజయుడు తన తండ్రిని చంపారన్న పగతో సర్పయాగం చేశాడు. కొన్ని లక్షల మంది సర్పవంశీయులు బ్రహ్మదండ ప్రభావం వల్ల హోమాగ్ని దగ్ధులై మరణించారు. అంతమందిని చంపిన పాపం అనుభవించక తప్పలేదు. అతడు ఉద్రేకంతో కొన్ని పరిస్థితులలో బ్రహ్మహత్య చేశాడు. అది భయంకర దుష్ఫలితాలకు దారితీసింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Opmerkingen