top of page

సిద్దేశ్వరయానం - 18 Siddeshwarayanam - 18

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Mar 21, 2024
  • 2 min read

🌹 సిద్దేశ్వరయానం - 18 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 భైరవనాథుడు 🏵


యువకుడు: గురుదేవా! ఈ కధ నేను వినలేదు. తెలుసుకోవాలని అతృతగా ఉంది చెప్పండి!


వామదేవ : నాగశాపం వల్ల అతనికి దారుణమైన చర్మవ్యాధి వచ్చింది.


పుండు, మంటలు, దురదలు చూడలేని అసహ్యస్థితి, వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు హోమములు చేయించి ఆ రోగమును పోగొట్టాడు. కానీ కర్మప్రేరణవల్ల బుద్ధి సరిగా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఒకరోజు వ్యాసమహర్షి అతని దగ్గరకు వచ్చాడు. కౌరవ పాండవయుద్ధం గురించి జనమేజయుడు కొన్ని సందేహాలడిగాడు.


జనమేజయుడు : తాతగారూ! మీరు మహనీయులు, శ్రీకృష్ణులవారు సాక్షాత్తు నారాయణుడు. మీరు తలచుకొంటే యుద్ధాన్ని ఆపగలిగేవారు. లక్షలమంది వధ తప్పిపోయేది.


వ్యాసుడు : లేదునాయనా! మేము చెప్పగలిగినంత చెప్పాము. చేయగలిగినంత చేశాము. కానీ దుర్యోధనుడు వినలేదు. అతనిది రాక్షస ప్రవృత్తి. యుద్ధం తప్పలేదు, అది విధి నిర్ణయం.


జన : మహాత్మా ! నేనిది నమ్మలేకుండా ఉన్నాను. మీరు గట్టిగా చెపితే ఎవరు కాదనగలరు?


వ్యాస : కర్మప్రేరణను అర్థం చేసుకోలేకుండా ఉన్నావు. దుర్యోధనుడు వినలేదు. దానిని అటుంచు.అతడు అహంకారి. నీవు వినయశీలుడవు. కర్మ ప్రభావం ఎంతటిదంటే నీవు కూడా నేను చెప్పిన దానిని వినని పరిస్థితి వస్తుంది.


జన : నేనా ! అసంభవం. అనూహ్యం. సాక్షాత్ నారాయణ స్వరూపులైన మీరు ఒక మాట చెపితే అది నాకు అనుల్లంఘనీయమైన ఆజ్ఞ. నేను మీ మాట వినకపోవటమేమిటి? అది ఎప్పుడూ జరగదు.


వ్యాస : మంచిదే! విను. నేను వెళ్ళిన కొద్దిరొజులకు ఒక అశ్వ వర్తకుడు వస్తాడు. ఉత్తమజాతి అశ్వాన్ని తెచ్చి కొనమని బలవంతం చేస్తాడు. దానిని కొనవద్దు.


జన - అలానే మీ ఆజ్ఞ.


వ్యాస :ఒక వేళ కొనవలసి వస్తే.


జన : ఎందుకు వస్తుంది? మీరు చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితులలోను దానిని కొనను.


వ్యాస : ఒకవేళ వస్తే ఆ గుర్రంతో యజ్ఞం చేయవద్దు. ఒకవేళ యజ్ఞం చేయవలసివస్తే దానిలో తరుణులను ఋత్విక్కులుగా నియమించవద్దు.


జన భగవన్! అంతదాకా రానీయను. మొదటిలోనే ఆపగలను. సరి! మంచిది! - చూద్దామని వ్యాసులవారు వెళ్ళిపోయినారు. మహర్షి చెప్పినట్లే కొన్నాళ్ళకు అశ్వ వర్తకుడు వచ్చి "మహారాజా! ఇది ఉత్తమలక్షణాలుగల అశ్వం. భూమి మీద ఇటువంటిది లేదు. దీని విలువ ఇచ్చి కొనగలవారెవరూ దొరకలేదు. చక్రవర్తులు మీరే దీనిని కొనాలి!” అని ప్రార్థించాడు. మహారాజు "నాకు అక్కరలేదు. నేను కొనను నీవు వెళ్ళు" అన్నాడు. ఆ వర్తకుడు “మీరుకొనకపోతే ఇంకెవరికీ నేను అమ్మను. దీనిని ఇక్కడే నరికి చంపుతాను" అన్నాడు. అశ్వ హత్య పాతకం తనకంటుతుందేమో అన్న భయంతో జనమేజయుడు దానిని కొని ఆశ్వశాలకు పంపించాడు. కొన్నాళ్ళ తర్వాత విహారానికి వెళ్తూ రథానికి ఆ గుర్రాన్ని కట్టి తెమ్మని అశ్వశాలాధికారికి ఆజ్ఞ పంపాడు. అతడు వచ్చి "మహాప్రభూ! అది ఉత్తమ లక్షణాలుగల యజ్ఞాశ్వము. దానిని రథమునకు కట్టడంగాని, దాని పై స్వారి చేయటంగాని శాస్త్ర విరుద్ధము అని విన్నవించాడు. దాని సత్యాసత్యములు పరిశీలించమని మహారాజు పురోహితులను పంపాడు. వారు వెళ్ళి చూచి వచ్చి మహారాజుతో "ప్రభూ! ఇది సులక్షణ సంపన్నమైన యజ్ఞాశ్వము. ఇది లభించినప్పుడు అశ్వమేధయాగం చేసితీరాలి. చేయకపోతే వంశ నాశనమవుతుంది" అని తెలిపారు. ధర్మ సంకట స్థితిలో తప్పక అశ్వమేధయాగం ప్రారంభించాడు జనమేజయుడు. వ్యాసులవారు చెప్పినది గుర్తున్నది. అందుకని వృద్ధులైన యాజ్ఞికులనే నియమించాడు. యజ్ఞం జరుగుతున్నది.


విధి బలీయమైనది. ఒకరోజు వృద్ధ యాజ్ఞికులందరికి జ్వరములు, విరేచనములు పట్టుకొన్నవి. వారు రాలేక - క్రతుకలాపము ఆగకూడదు గనుక యువకులైన తమపుత్రులను పంపారు. ఆ రోజు యజ్ఞంలో భాగంగా మహారాణి అశ్వము దగ్గర శయనించాలి. అందులో జరిగే ఘట్టాన్ని చూచి యువ యాజ్ఞికులు వికృతహాసములు చేశారు. వారిని చూచిన జనమేజయునకు కోపం వచ్చి కత్తిదూసి ఆ తరుణబ్రాహ్మణులను నరికి వేశాడు. యజ్ఞశాలలో హాహాకారములు పుట్టినవి. బ్రాహ్మణ్యమంతా యజ్ఞశాల విడిచి పెట్టి వెళ్ళి పోయినారు. యాగం ఆగిపోయింది. అంతటితో ఆగలేదు. బ్రాహ్మణ సంఘం మహారాజు చర్యను ఖండించింది. రాజు భవనానికి ఆ రోజునుండి బ్రాహ్మణులెవరూ రాలేదు. నిత్యపూజలు, దేవతార్చనలు ఆగిపోయినవి. ఎన్నాళ్ళు గడిచినా బ్రాహ్మణులు సమ్మె ఆపలేదు. పట్టు విడిచిపెట్టలేదు. గత్యంతరం లేక జనమేజయుడు రాజ్యాధికారం విడిచిపెట్టి తన కుమారుడు శతానీకునకు పట్టం కట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయినాడు. అయినా బ్రాహ్మణులు సమ్మెవీడలేదు. నిస్సహాయుడైన శతానీకుడు హస్తినాపురం విడిచిపెట్టి రాజధానిని కౌశాంబికి మార్చుకొన్నాడు. ఆ వంశీయులిప్పుడంత బలవంతులుగారు. వారికి దుష్టశిక్షణ శక్తి లేదు.


యువ: గురుదేవా! ఈ పరిణామం చిత్రంగా ఉంది. విధి బలీయం. తప్పదు. కాని నా కనిపిస్తున్నది. జనమేజయుడు మహారాజు. ఒక వర్తకుడు వచ్చి గుర్రాన్ని కొనకపోతే దానిని చంపుతాననగానే ఎందుకు కొనాలి. హత్య చేయబోతున్న నేరంపై వానిని కారాగాంలో పెట్టి ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకొని వర్తకుని వారసులను పిలిపించి అప్పగించవచ్చు. అంతదాకా గుర్రాన్ని కాపాడవచ్చు. కొనలేదు గనుక ఆ అశ్వంరాజుది కాదు. కాదుగనుక యజ్ఞం చేయవలసిన అవసరంలేదు. ఇలా ఏ దశలోనైనా నివారించే ఉపాయాలుంటవని అనుకొంటున్నాను.


వామ: కుశాగ్ర బుద్ధివి. కానీ కర్మ సిద్ధాంతం ఉన్నది. ఏదిఎలా జరగాలో అలానే జరుగుతుంది. జరిగింది.


యువ: చిత్తము. మిగతా రాజవంశీయుల పరిస్థితి ఏమిటో తెలియ జేయాలని అభ్యర్థిస్తున్నాను.


( సశేషం )


🌹🌹🌹🌹🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page