top of page

సిద్దేశ్వరయానం - 19 Siddeshwarayanam - 19

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

🌹 సిద్దేశ్వరయానం - 19 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 భైరవనాథుడు 🏵


వామదేవ : అయోధ్యా ప్రభువులిప్పుడు చిన్నరాజులు. విదేహ - మిధిలా ప్రభువులు జనకనాములు రామాయణ కాలంనుండి భారతకాలం వరకు వారు జ్ఞానయోగులే కాని చక్రవర్తులు కారు. నరకాసుర వంశీయులెప్పుడూ కృష్ణ విరోధులే. నరక పుత్రుడు భగదత్తుడు భారతయుద్ధంలో అర్జునుని చేతిలో మరణించాడు. బాణాసుర వంశంవారు కూడా కృష్ణవ్యతిరేకులే. ప్రస్తుతం చక్రవర్తులుగా భారతదేశంలో ప్రకాశిస్తున్నది మగధ ప్రభువులు. జరాసంధుని కాలం నుండి వారు కృష్ణ శత్రువులే. జరాసంధుడు భైరవోపాసకుడు. ఎందరు రాజులనో గెలిచి వారిని భైరవునకు బలియిచ్చి తీవ్ర శక్తులు పొందాడు. నరకుడు, కంసుడు, జరాసంధుడు మొదలైనవారు పూర్వ జన్మలనుండి రాక్షసులు. వీరు రుద్రుని, రుద్రస్వరూపుడైన భైరవుని ఉపాసిస్తారు. వారిదృష్టిలో ఆయన పూర్వదేవుడు “పూర్వ దేవాస్సురద్విషః" అని నిఘంటూక్తి, సురభయహరునిగా, దేవతలవల్ల కలిగే భయాన్ని పోగొట్టే స్వామిగ వారు పూజిస్తారు. జంతు బలులు నరబలులు సమర్పించి ఆ స్వామి అనుగ్రహాన్ని శీఘ్రంగా సాధిస్తారు. అటువంటి వారంతా ఇప్పుడు కృష్ణ భూమి పై దృష్టిపెట్టారు.


యువ : గురువర్యా! ఈ మార్గము పాపము కదా!


వామ : పాపపుణ్యముల నిర్ణయము సులభము కాదు. లోకములో మాంసా హారులు తొంభై శాతము. సత్వగుణ ప్రధానులైనవారు మాంసాహారము తీసుకోరాదని ధర్మశాస్త్రములు నిషేధించినవి. మాంసాహారులు జంతువులను చంపుతారు. ఇంటిలో చంపినట్లే తీవ్రదేవతల ముందు బలిగా సమర్పించి తరువాత వండుకొని తింటారు. నరబలులు మాత్రం నిషిద్ధం.పంచమకారణ సాధన చేస్తారు ఈ మార్గంలో దీనికి వామాచారమని పేరు.


యువ: ఈ హింసా మార్గం నాకెందుకో నచ్చలేదు. వామాచారమన్న పేరే చిత్రంగా ఉంది.


వామ: నిజమే. అది నా పేరుతో వచ్చింది. ఉపవాసాదులు సుదీర్ఘకాలం చేస్తూ జపధ్యానములు చేస్తూ ఎండనూ చలిని తట్టుకుంటూ సాధన చేయలేని వారికోసం రుద్రుడైన మహాదేవుడు ఈ మార్గాన్ని నాకు తెలియజేశాడు. అందుకేనాకు వామదేవుడన్న పేరు వచ్చింది. అయితే నేను చెప్పి చేయించింది ఒకటైతే దీనికి అతి వ్యాప్తి దోషం పట్టి కొందరు జంతు హింసామార్గాన్ని అవలంబించారు. నేను ప్రధానంగా బోధించింది శీఘ్ర సిద్ధికోసం ఆత్మహింసా మార్గం.


యువ: గురుదేవా! ఆ మార్గం నాకు బోధించండి.


వామ: దానిని తెలిపేముందు దేశ కాలగమనంలో వస్తున్న పరిస్థితులు ఇంకా కొన్ని తెలుసుకోవాలి. భాగవతంలో కాలయవనుని కథ ఉన్నది. వాడు వేదవేత్త, యాదవ పురోహితుడైన గర్గుని కుమారుడు. ఆయన మహా తపస్వి. వివాహం చేసుకోలేదు. ఒకనాడు యాదవయువకు లాయనను నపుంసకుడని అపహాస్యం చేసారు. తనను అవమానించిన యాదవ వంశాన్ని నాశనం చేయాలని సంకల్పించి తపస్సు చేశాడు. ఆ తపస్సమయంలో ఒక స్త్రీ యందామహర్షికి పుత్రుడు పుట్టాడు. సంతానం లేని యవన చక్రవర్తి ప్రార్థిస్తే గర్గుడా బాలుని అతనికిచ్చాడు. వాడు పెద్దవాడై కాలయవనుడన్న పేరుతో కోటి సైన్యాన్ని తీసుకొని ద్వారక మీదకు వచ్చాడు. శ్రీకృష్ణదేవుడు వానిని ముచికుందుని చేత చంపించాడు. యవనులందరూ వేదధర్మ విరోధులు. ఇప్పుడు కృష్ణ విరోధులు కూడా. గాంధారులు దుర్యోధనుని తల్లి గాంధారి వంశంవారు. అలానే పారసీకులు అసుర జాతివారు. వీరంతా ఇప్పుడు కృష్ణ శత్రువులు.


వీనిని మించి మరొక విశేషమున్నది. దుర్యోధనుడు పూర్వజన్మలో కలి అనే పాతాళ రాక్షస చక్రవర్తి. ఆదిశేషుడైన అనంతుడు బలరామునిగా పుట్టటానికి నిశ్చయించుకొన్నప్పుడు ఆ స్వామికి భక్తుడు, అనుచరుడు అయిన కలి దుర్యోధనునిగా పుట్టాడు. అతని రాక్షస శరీరం అస్త్ర శస్త్ర భేద్యముకాని వజ్రదేహం. తమ మంత్రశక్తితో రాక్షసులు దానిని చెడిపోకుండా కాపాడి ఉంచారు. దుర్యోధనుడు వనవాసంలో ఉన్న పాండవులచేత విడిపించ బడినప్పుడు ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు నిశ్చయించు కున్నాడు. అప్పుడు రాక్షసలోకం కృత్యనుపంపి దుర్యోధనుని పాతాళానికి పిలిపించి వివరాలన్నీ చెప్పి అతని పూర్వదేహాన్ని చూపించి రాబోయే మహాయుద్ధంలో తమ శక్తులతో అతన్ని గెలిపిస్తామని, ఇష్టమైనంతకాలం పరిపాలించి భౌమ శరీరాన్ని విడిచి పెట్టినప్పుడు మళ్ళీ యీ పూర్వదేహంలో ప్రవేశించేలా చేస్తామని నమ్మబలికారు. దుర్యోధనుడు విశ్వసించాడు. కానీ భారత యుద్ధంలో జరిగింది వేరు. కృష్ణ ప్రభావం వల్ల అతడోడిపోయి భీముని చేతిలో మరణించాడు. రాక్షసులాతని జీవుని ఆకర్షించి పాతాళానికి తీసుకువెళ్ళి పూర్వ శరీరంలో ప్రవేశపెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దుర్యోధనుడు నరకంలో ఉన్నాడు. తమ ప్రభువుకు వచ్చిన యీ దుర్గతికి కారణమైన కృష్ణుడంటే వారికి పరమద్వేషం. వారి మార్గాలలో వారు విజృంభిస్తున్నారు.


ఇక నీవు పూర్వం నాగజాతీయుడవు. నాగజాతికి అసుర జాతికి బద్ధవైరం. వారిద్దరి మధ్య ఎన్నో యుద్ధాలు జరిగినవి.


( సశేషం )


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page