top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 21 Siddeshwarayanam - 21


🌹 సిద్దేశ్వరయానం - 21 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 భైరవనాథుడు 🏵


వైరోచని పట్టుదలతో ఒక సంవత్సరం చేసింది. దర్శనం కలుగలేదు. దేవతను బ్రతిమలాడింది. ఏడ్చింది. దేవత పలకలేదు. ఆర్తితో ఆవేదనతో దేవత దగ్గర కత్తి తీసుకొని తలను నరుకుకొన్నది. నేను దిగ్భ్రాంతితో చూస్తూ దేవతను ఆవాహన చేశాను. ఆ దేవి అవతరించింది. వైరోచనీదేవి ఈ వైరోచని శిరస్సును మొండెమునకు తాకించింది. అది అంటుకొన్నది. ప్రాణం వచ్చింది. పరమేశ్వరి "బిడ్డా! చాలా సాహసం చేశావు. నీ గురుప్రార్ధన వల్ల - నీ సాహసానికి మెచ్చి వచ్చాను. నీలో ఉంటాను. ఇక నీవే నేను" అని అదృశ్యమైంది. ఆమె దేవతయైనది గనుకనే బలి చక్రవర్తి ఆమెను పూజించాడు. బలి వామనునకు చేసిన దానమునకు ఆమె హర్షించి ఆశర్వీదించింది.


ఛిన్నగ్రీవా ఛిన్నమస్తా ఛిన్నముండధరాక్షతా క్షోధక్షేమకరీస్వక్షా క్షోణీశాచ్ఛాదనక్షమా వైరోచనీవరారోహ బలిదాన ప్రహర్షితా బలిపూజితపాదాబ్జా వామదేవ ప్రయోజితా - (ఛిన్నమస్తాతంత్రము)


వైరోచని చేసినట్లు నీవు తల నరుకుకోవలసిన పని లేదు, మనం హిమాలయాలకు చేరిన తరువాత నీ సాధనా మార్గం నిర్దేశించబడుతుంది.


యువకుడు - మీ దయ.


వామదేవ మహర్షి వెంట నాగభైరవుడు హిమాలయాలకు వెళ్ళాడు. త్రోవలో పశుపతినాధుని దర్శించారు. ఆ మహేశ్వరునకు హరభైరవుడని, మానస సరస్సు దగ్గరి భైరవునకు అమర భైరవుడని పేరు. పశుపతినాధుని ఆలయానికి కొద్ది క్రోసుల దూరంలో ఒక కాళీ ఆలయమున్నది. శక్తి గల దేవతగా ఆమెకు పేరు. ఆమె దర్శనం చేసుకుందామని - వామదేవుడు యువకునితో కలసి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళే సరికి సంధ్యా సమయం దాటి చీకటి పడుతున్నది. జనం ఎక్కువ మంది లేరు. అయిదారుగురున్నారు. వారంతా మద్యపానం చేసి ఎరుపెక్కిన కళ్ళతో మత్తుగా తూగుతున్నారు. వారు బలియిచ్చిన జంతువుల శరీర ఖండాలక్కడే ఉన్నవి. నెత్తురు మడుగు అంతా. వాళ్ళీ యిద్దరు మనుషులను చూచారు. అరే! కాళికి ఇవాళ నరబలి యిద్దాము. ఈ గడ్డాల పెద్దాయనను ప్రక్కకు నెట్టి వేయండి. ఈ కుర్రాణ్ణి కట్టివేయండి అని యువకుని తాళ్ళతో కట్టివేశారు. మొహానికి పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి మెడలో పూలదండవేసి బలిపీఠం మీద తలపెట్టారు. యువకుడేమీ మాట్లాడలేదు. గురువుగారి వైపు చూస్తున్నాడు. వామదేవుడు నరబలి మహాపాపం. చెయ్యవద్దు అని చెప్పి చూచాడు. వారు వికృతంగా నవ్వి ఆయనను నెట్టివేశారు. వారిలో ఒకడు కత్తి యెత్తి యువకుని శిరస్సు ఖండించబోయినాడు. అతని చెయ్యి చచ్చుపడి కత్తి క్రిందపడింది. ఏమైందిరా అని ఇంకొకడు అలా అందరూ నరకబోవటం చేతులు పక్షవాతం రావటం, వాలిపోవటం జరిగింది. వామదేవుని కన్నులలో క్రోధం కనిపించింది. దుష్టులారా! చెప్పినా వినకుండా నరబలికి ఉపక్రమించారు. చచ్చుబడిన మీ చేతులు బ్రతికినన్నాళ్ళు ఇట్లనే ఉంటవి. దీనిని చూచైనా మిగతా మీవాళ్ళు గుణపాఠం నేర్చుకొంటారు. ఈ గుడిలో ఇక ఈ దుష్కార్యాలు జరగటానికి వీలు లేదు. అసలు కాళీదేవినే ఇక్కడ ఉండి మీ పూజలు స్వీకరించవద్దని కోరుతున్నాను. ఆమె ఇంక ఇక్కడ ఉండదు - అన్నాడు ఋషి, కాళీవిగ్రహం మాయమైంది.


వాళ్ళు దిగ్భ్రాంతితో చూస్తుండగా యువకునితో కలసి వామదేవుడు బయలుదేరాడు. గురుదేవా! మరి కాళీదేవీ గుడియింక లేనట్లేనా! అన్నాడు నాగభైరవుడు. మహర్షి "ప్రస్తుతానికింతే ! కొన్ని సంవత్సరాల తర్వాత నీవే సిద్ధుడవై వచ్చి ఇక్కడ కాళీదేవిని ప్రతిష్ఠింతువుగాని" పద! అన్నాడు. వారి ప్రయాణం కొనసాగుతున్నది. మహర్షి యువకునితో "రేపు భాద్రపదశుద్ధ అష్టమి. కృష్ణప్రియ - గోలోకనాయిక రాధాదేవి పుట్టినరోజు. ఆమె తపస్సు చేసిన గుహకు వెళ్ళి ఆ రాసేశ్వరికి పూజ చేయాలి. దాని కోసం ముందు మనం దత్తాత్రేయాశ్రమానికి వెళ్ళాలి. ఇవి కైలాస పర్వతంలో ఉన్నవి. ఇక్కడి నుండి చాలా యోజనాల దూరం. భూమార్గంలో ఇక కుదరదు. నా చేయిపట్టుకో, మనం ఆకాశమార్గంలో వెళుతున్నాము" అన్నాడు. ఇప్పుడు యువకునకు ఆశ్చర్యము, కష్టము అన్న పదాల భావనకు అతీతమైన స్థితి వచ్చినది. మహాపురుషుని అనుగ్రహ పాత్రుడనైనానని తెలుసుకొన్నాడు. కొద్ది గంటలలోనే మానస సరస్సుదగ్గర ఆగి దేవతలు దిగివచ్చి స్నానం చేసే ఆ పవిత్రజలాలలో స్నానం చేసి కైలాసపర్వతం దగ్గరకు చేరుకొన్నారు. అక్కడ ఒక చిన్న ఆశ్రమము, కొన్ని కుటీరములు, ఋషి కుటుంబాలు ఉన్నవి. వారు మహర్షిని భక్తితో స్వాగతించి మర్యాదలు చేసి కృష్ణ నిర్యాణం తర్వాత వచ్చిన దేశపరిస్థితుల గురించి అడుగుతున్నారు. చిరకాల పరిచితులైన వారితో సంభాషణ చేస్తూ “నాగభైరవా! ఆ కనిపించే కాలిబాటలో ఒక అర్థ గడియ నడిచి వెళ్ళు. కొండ దగ్గరకు వెళ్ళగానే ఉదుంబర వృక్షం కనిపిస్తుంది. దాని ముందున్నది దత్తాత్రేయ గుహ. నీవు వెళ్ళి స్వామి దర్శనం చేసుకో. ఇంతలో నేను వస్తాను” మహర్షి లేకుండా తానొక్కడూ వెళ్ళటం యువకునికి ఇష్టం లేదు. కాని గురువునకు ఎదురు చెప్పరాదు గనుక 'తమ ఆజ్ఞ' అని బయలుదేరి కైలాస పర్వత గుహకు చేరుకొన్నాడు.



( సశేషం )


🌹🌹🌹🌹🌹


Comments


bottom of page