🌹 సిద్దేశ్వరయానం - 23 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
నాగభైరవుడు ఆశ్చర్యంతో చూస్తూ ఆ ప్రస్తుతి పూర్తియై మహర్షి పూజ చేసిన తరువాత ఆ దేవత గురించి తానెప్పుడూ వినలేదని ఆమె మహత్వాన్ని గురించి తెలియ జేయమని అభ్యర్థించాడు. మహర్షి కూడా సంతోషంతో పలికాడు. “నాగభైరవా! ఈ దేవతది విచిత్రమైన చరిత్ర. ఆమె కోయపిల్ల. జమదగ్ని మహర్షి ఆమె నిరాడంబర సౌందర్యాన్ని చూచి ఇష్టపడి పెండ్లి చేసుకొన్నాడు. యువకుడుగా ఆయన విలువిద్య అభ్యాసం చేసేవాడు. అతడు వింటిలో నుండి నారిలాగి బాణాలు వేస్తుంటే ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి బాణాలు తెచ్చి యిచ్చేది. ఎండాకాలంలో ఈ అభ్యాస వేళ కాళ్ళు బొబ్బలెక్కుతూ, తలమాడుతూ భార్య బాధపడుతుంటే చూడలేక ఆమె కోసం చెప్పులు గొడుగు సృష్టించాడు. అంతకుముందు అవి లోకంలో లేవు.
ఆ దంపతుల సంసారం చక్కగా సాగుతున్నది. సంతానం కలిగింది. మగపిల్లలు. వారిలో రాముడనే కుమారుడు యుద్ధవిద్యలు నేర్చాడు. గండ్రగొడ్డలి అతని ప్రధానాయుధం. అతనిని పరశురాముడనే వారు. ఒకనాడు ఆ ప్రాంత పరిపాలకుడైన కార్తవీర్యార్జునుడనే రాజు సైనికులతో వేటకు వచ్చి అలసిపోయి వీరి ఆశ్రమానికి వచ్చాడు. చక్రవర్తి వచ్చాడని మర్యాదలు చేసి ఆతిథ్యం ఇచ్చారు. వాడు రేణుకాదేవిని చూచి మోహించి బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఆమె వానిని తిరస్కరించింది. కారగారంలో పెట్టాడు. ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చిన పరశురాముడు ఈ వార్త విని ఆగ్రహంతో ఆ రాజు రాజధాని మాహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జుని ఎదిరించాడు. ఆ చక్రవర్తి సామాన్యుడు కాదు. దత్తాత్రేయస్వామిని సేవించి దివ్యశక్తులు పొందిన మహావీరుడు. యుద్ధ సమయంలో అతనికి వేయి చేతులు వచ్చేవి. అన్నింటిలో ఆయుధాలు ధరించి శత్రు సంహారం చేసేవాడు. యోగశక్తి వల్ల ఎవరైనా ప్రమాదంలో ఉన్నవారు తలచుకొంటే ప్రత్యక్షమై వారి కష్టం తీర్చేవాడు.
అంతటివాడు కూడా విష్ణుమూర్తి అంశతో పుట్టిన పరశురాముని ముందు నిలువలేక సంహరించబడ్డాడు. తల్లిని తీసుకొని భార్గవరాముడు ఇంటికి వెళ్ళి తండ్రి ముందు నిలబడి ఆమెను అప్పగించాడు. "ఇతరుల గృహంలో ఉన్నది. అందులో రాజు దగ్గరకు చేర్చబడినప్పుడు కళంకం తప్పదు. కళంకితను నేను స్వీకరించను. తోటి మహర్షులలో తల యెత్తుకోలేను. కనుక ఈమె తలను నరికివేయండి అన్నాడు జమదగ్ని, కుమారులు తల్లిని చంపలేమని తప్పుకొన్నారు. ఒక్క పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను ధిక్కరించకుండా తల్లి శిరస్సును ఖండించాడు. మహర్షి సంతృప్తి చెంది నీకేం వరం కావాలో కోరుకోమని పరశురామునితో అన్నాడు. రాముడు తన తల్లిని బ్రతికించమని ప్రార్థించాడు. ఇచ్చిన మాట ప్రకారం మహర్షి రేణుకను బ్రతికించాడు. తరువాత మరొక దారుణం జరిగింది. పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు కార్తవీర్యార్జున పుత్రులు వచ్చి జమదగ్నిని పొడిచి చంపి వెళ్ళారు. రేణుకాదేవి గుండె బాదుకొని ఏడుస్తున్నది. వార్త విని పరుగెత్తుకుంటూ వచ్చిన పరశురాముడు తల్లిని ఓదార్చాడు. ఆమె దుఃఖం ఆగలేదు. అతనికి బాధలో నుండి క్రోధం పుట్టింది.
తల్లీ! నా ప్రతిజ్ఞ విను. నిన్ను అవమానించి, నా తండ్రిని చంపిన ఈ క్షత్రియులను సర్వనాశనం చేస్తాను. కార్తవీర్యుని కుమారులనే కాదు. సమస్త క్షత్రియ సంహారం చేస్తాను. రేణుకాదేవి ఆ శపధం విని కొంత శాంతించింది. ఆ పూటే బయలుదేరి పరశురాముడు కార్తవీర్యార్జున కుమారులను సంహరించి వచ్చాడు. వస్తూ ఆ రాజకుమారుల పండ్లు రాలగొట్టి మాలగా చేసి తల్లికి సమర్పించాడు.
రేణుకాదేవి "నాయనా ! మీ తండ్రికి దహనసంస్కారం చేయాలి. అది ఈ ఆశ్రమంలో కాదు. ఒక కావడి తీసుకురా ! దానిలో ఒక వైపు మీ తండ్రి శవాన్ని ఉంచు. రెండో వైపు నేను కూర్చుంటాను. ఎక్కడ ఎంతదూరం అన్నది నేను చెపుతాను" అన్నది. ప్రయాణం కొనసాగుతున్నది. సహ్య పర్వత ప్రాంతానికి చేరుకొన్న తర్వాత రేణుకాదేవి “రామా! ఇక్కడ దగ్గరలో దత్తాత్రేయ మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆయన దగ్గరకు వెళ్ళి మీ తండ్రి అంత్య సంస్కారాలు చేయించమని అభ్యర్థించు" అన్నది. పరశురాముడు వెళ్ళేసరికి నాగభైరవా! మొన్న నీవు వెళ్ళినప్పుడున్న పరిస్థితే. మద్యము, మదవతి - ఈయన ఋషి యేమిటి ఇలా వ్యసనపరుడా! అనుకొని కూడా తల్లి ఆజ్ఞ గనుక "అయ్యా!మీరు వేదశాస్త్రవేత్త అని విన్నాను. మా తండ్రి మరణించాడు. వారికి శవసంస్కారాలు చేయాలి. మీరు వచ్చి కర్మ చేయించండి” అని ప్రార్థించాడు. దత్తాత్రేయుడు తల యెత్తి చూచి "నీ కంటికి నేను శ్మశానాలలో శవాలు తగులబెట్టించి కర్మలు చేయించేవాడిలాగా కనిపిస్తున్నానా? పోరాపో!" అని తిట్టాడు.
పరశురాముడు అయ్యా! మా తల్లి రేణుకాదేవి పంపిస్తే వచ్చాను. మీరేమో తిరస్కరించారు. ఈ విషయం ఆమెకు చెపుతాను” అన్నాడు దత్తాత్రేయుడు ఒక్క ఉదుటన లేచాడు "జగన్మాత పరమేశ్వరి రేణుకా దేవి పంపించిందా? ముందే చెప్పవేమిటయ్యా!” అని క్షణంలో ఋషిగా మారిపోయి రేణుకాదేవి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి శాస్త్రోక్తంగా కర్మకాండ భక్తిశ్రద్ధలతో చేయించాడు. జమదగ్నిశరీరంతో రేణుకాదేవి సహగమనం చేసింది. పరశురాముడు దత్తాత్రేయమహర్షిని పూజించి "స్వామీ! నాకొక విషయం అర్థం కాలేదు. మా తల్లి జగన్మాత అన్నారు. ఆమె పేరు చెప్పగానే వచ్చి మీ యంతటి మహానుభావులు ఆమెకు పాద నమస్కారం చేశారు. ఆమె దేవత ఎప్పుడయింది? ఎలా అయింది? దయచేసి సంశయము తీర్చండి” అని ప్రార్థించాడు. దత్తస్వామి ఇలా వివరించారు. “రామా! నీవు పరశువుతో నీ తల్లి శిరస్సు ఖండించావు. ఛిన్నమస్త ఆమెలోకి ప్రవేశించింది. ఆమె వజ్రవైరోచనిగా మారిపోయింది. ఆ విషయం ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ మహాశక్తి అనుగ్రహం వల్ల నీవు సర్వక్షత్రియ సంహారం చేయగలుగుతావు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments