🌹 సిద్దేశ్వరయానం - 25 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
యక్షిని భైరవనాధునితో ఇలా పలికింది.ఇప్పుడు నీకొక ఉపకారం చేస్తాను. నా ప్రభావం వల్ల నీకు గాంధర్వ విద్యను ప్రసాదిస్తున్నాను. నీ తపస్సు పరిపక్వమైంది. భైరవస్వామిని సంకీర్తనంతో మెప్పించు. ఆ దేవదేవుడు తప్పక దిగివస్తాడు" ఆ దివ్యాంగన అదృశ్యమైంది ఆమె వరం వల్ల అతని కంఠంలో నుండి అద్భుతమైన కవితా గానవాహిని ప్రవహిస్తున్నది. భైరవదేవుడు సాక్షాత్కరించాడు. కోటి సూర్యప్రభాభాసమానుడై, కాళీ సమేతుడై నాగభైరవుని కన్నుల ముందు గోచరించాడు. ఆనంద బాష్పాలతో ఆ దంపతుల పాదములకు దండప్రణామం చేశాడు. యువకుడు. భీషణ సౌందర్యంతో కరుణార్ద్ర వీక్షణాలతో ప్రకాశిస్తున్న ఆ మహాస్వామి పలికాడు.
నాయనా ! నీ తపస్సుకు సంతృప్తి చెందాను. నీ గానానికి ఆనందించాను. నాతో కాళీదేవిని కూడా తీసుకువచ్చాను. అపారమైన శక్తులను నీకు ప్రసాదిస్తున్నాను. భూత, బేతాళ పిశాచ నాగ గణం నీ వశమవుతుంది. నీవు ఆవాహనం చేస్తే ఏ దేవతైనా వచ్చి అనుగ్రహిస్తుంది. అజేయము, అప్రతిహతము అయిన నీ ప్రభావం వల్ల భారతభూమి రక్షించబడుతుంది. అనంతర కాలంలో కాళీకృప కూడా నీకు కలుగుతుంది. ఆమె కూడా నిన్ను ఆశీర్వదిస్తుంది. అని పలికి కాళీసహితుడై భైరవస్వామి అదృశ్యమైనాడు. మరునాడుదయం నాగభైరవుడు పల్లెకోయలను పిలిచి తనకు ఇన్నాళ్ళూ సేవ చేసినందుకు కృతజ్ఞత తెలిపి వారికి అపారమైన ధనాన్ని బహూకరించి సిద్ధాశ్రమానికి ఆకాశమార్గంలో చేరుకొన్నాడు.
వామదేవ మహర్షి సన్నిధికి చేరుకొని వారి కాళ్ళకు మొక్కాడు. ఆయన వాత్సల్యంతో దీవించి మరునాడు సిద్ధాశ్రమంలోని కొందరు ముఖ్యులను ఆహ్వానించి చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ యువకుడింక భైరవనాధుడన్న పేరుతో ప్రకాశిస్తాడని ధర్మరక్షణ చేస్తాడని ఇలా పలికారు - "ధర్మవీరా! ఇప్పుడు నీ కర్తవ్యం మొదలైంది. ముందు హిమాలయ పర్వత శ్రేణులలోని దుష్ట మాంత్రికులను అదుపుచేసి ప్రజలను దైవభక్తి మార్గంలోకి మళ్ళించు. అసురశక్తులను అరికట్టి భూమి మీద దైవ సామ్రాజ్యం నిర్మించబడాలి. త్వరలో యవన, శక, హూణ దండయాత్రలు రాబోతున్నవి. నీ వాయా దేశాలకు వెళ్ళి ఆ రాజులను ప్రభావితులను చేసి ఈ వేదభూమి మీద రక్తం ప్రవహించకుండా చెయ్యి. భైరవుని వరశక్తి, రాధాకృష్ణుల అనుగ్రహం నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. ఒక వెయ్యి సంవత్సరాల పాటు నీ ప్రభకొనసాగుతుంది. ఆ తర్వాత యేమిటో నీకే తెలుస్తుంది. శుభమస్తు!".
భైరవనాథుడు ఆ మహాత్ములకు నమస్కరించి గురువు గారి దగ్గర సెలవు. తీసుకొని బయలుదేరాడు.
శ్లో॥ య ఉజ్వలో భైరవనాథ సిద్ధ మహాద్భుత స్తాంత్రిక సార్వభౌమః పురావసద్భారతదేశ శీర్షే సఏవ ధీరో ధ్య కులాధినాధః
భారతదేశమునకు శిరస్సైన హిమాలయాలలో తాంత్రిక సార్వభౌముడై భైరవనాథుడన్న నామంతో ప్రకాశించిన సిద్ధుడే ఇప్పుడు కులపతియై, సిద్ధేశ్వరానందుడై విరాజిల్లుతున్నాడు.)
దాదాపు వెయ్యి సంవత్సరాలు గడచినవి. సిద్ధగురువులు తనకు నిర్దేశించిన కర్తవ్యాన్ని యథాశక్తి నెరవేర్చాడు. అస్ఖలిత బ్రహ్మచర్యంతో కఠోర దీక్షతో భారతదేశానికి చేయగలిగినంత సేవ చేశాడు. శ్రీకృష్ణభూమి మీదకు అసురులెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఈ శరీరానికి భైరవుడిచ్చిన సమయం పూర్తి కావస్తున్నది. కింకర్తవ్యం ? కైలాస పర్వతంలోని రాధాగుహకు వెళ్ళాలనిపించింది. ఆకాశగమనంలో వెళ్ళి రాధాదేవి దర్శనం చేసుకొన్నాడు. అక్కడ అఖండదీపం వెలుగుతున్నది. ఎవరూ ప్రమిదలో నూనె పోయరు. అయినా అది అరదు. రాధేశ్యాం అని భక్తితో నమస్కరించాడు. ఆ మాట అనగానే దీపం పెద్ద వెలుగుతో ప్రకాశించింది. ఆ శబ్దం - ఆ నామం యొక్క శక్తి అటువంటిది. సతీదేవి శరీరంలోని ఖండాలు పడిన చోట్ల శక్తి పీఠాలైనవి. అందులో ముఖ్యమైనవి పదునెనిమిది. వాటిలో జ్వాలాముఖి క్షేత్రంలోని వైష్ణవీ దేవి ఒకటి. అక్కడ భూమిలో నుండి అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. రాధేశ్యాం అని అంటే చాలు దీపం వెలుగు పెద్దదవుతుంది. భైరవనాధుడీ క్షేత్రాలన్నీ దర్శించి ఆ యాదేవతలను పూజించాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Kommentare