🌹 సిద్దేశ్వరయానం - 26 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
భైరవనాధుడీ క్షేత్రాలన్నీ దర్శించి ఆ యాదేవతలను పూజించాడు.గుహలో నుండి బయటకు రాగానే కొద్ది దూరం నుండి రాధాకృష్ణ భజన వినిపిస్తున్నది. ఎవరా అని అక్కడకు వెళ్ళాడు. కైలాస పర్వత ప్రాంతాలలో సిద్ధాశ్రమ ప్రదేశాలలో వివిధ నియమాలతో తపస్సు చేసేవాళ్ళు ఎందరినో చూచాడు. కాని భజన వినటం ఇదే మొదటిసారి. ఒక పెద్దాయన వేదిక మీద ఉండి రాధాకృష్ణ నామం చెపుతున్నాడు. అందరూ లయబద్ధంగా భజన చేస్తున్నారు. ఆభక్తుని చూస్తుంటే ఎందుకో గౌరవం కలిగింది. చేతులు జోడించి నమస్కరించి కూర్చున్నాడు. అంతఃప్రేరణ - తాను కూడా భజన చేస్తున్నాడు. కాసేపు అయ్యేసరికి కంటి వెంట కన్నీరు రావటం మొదలైంది. గొంతు గద్గదమైంది. భజనపూర్తి అయ్యేసరికి పరవశస్థితిలో ఉన్నాడు. ఇటువంటి అనుభూతి ఇంతవరకెప్పుడూ లేదు. భక్తులంతా లేచి వేదికమీద ప్రబోధకునకు నమస్కరించి అవతలికి వెళ్ళారు. ఇతనిని చూచారు గాని వాళ్ళెవరూ పలకరించలేదు.
బ్రహ్మస్థానంలోని ఆ మనీషి “భైరవనాథా! మహాసిద్ధుడవైన నీవిక్కడకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇది కృష్ణ తపోభూమి. గోవిందుని నిర్యాణానంతరం భక్తులు ప్రార్థిస్తే ఆ గోపాలుని తమ్ముడైన ఉద్ధవుడు ఈ సిద్ధాశ్రమ భూమిలోని ఈ ప్రదేశంలో తపస్సు చేస్తే శీఘ్రంగా కృష్ణ సాక్షాత్కారము రాధాదర్శనము కలుగుతుందని నిర్దేశించాడు. ఇక్కడ ఉపవాసాది కఠోర నియమాలక్కరలేదు. భజన చేస్తే చాలు. కొద్దిగా రాధామంత్రము గాని, కృష్ణ మంత్రము గాని చేస్తే సరిపోతుంది. కాసేపు నామ జపం చేస్తే చాలు. హృదయం ద్రవిస్తుంది. అశ్రుపాత, రోమాంచ, గాద్గద్యములు కలుగుతవి. కృష్ణ భూమి రక్షణకు సిద్ధగురువుల ఆదేశం వల్ల ఎంతో సేవ చేశావు. అందుకే ఇక్కడకు రాగలిగావు".
భైరవనాధుడు "మాహాత్మా! మిమ్ము దర్శించి ధన్యుడనైనాను. ఇంతకు ముందు భజన చేసిన వారంతా వందల సంవత్సరాల వయస్సున్న యోగులని తెలుసుకొన్నాను. శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించిన గీతలోని భక్తియోగానికి ఉదాహరణ ప్రాయులైన వారు వీరంతా. కేవలం భజన చేత దీర్ఘాయువు పొందిన భక్తవర్యులు మీరు. నేను కృతార్థుడను. సెలవిప్పించండి. వెళ్ళివస్తాను" అన్నాడు. ఆ భక్త గురువు "రాక రాక వచ్చావు. ఈ పూట ఇక్కడ ఉండి మా ఆతిథ్యం స్వీకరించి రాత్రి గడచిన తర్వాత రేపు ఉదయం వెళుదువు గాని" అన్న ఆయన మాట కాదనలేక ఆ రాత్రి అక్కడే శయనించాడు. తెల్లవారు జామున స్వప్నం వచ్చింది. దానిలో రాధాకృష్ణులు దర్శన మిచ్చారు. శ్రీకృష్ణుడు "కుమారా! నీవు ఈ దేశానికి చేసిన సేవవల్ల మాకు సంతృప్తి కలిగింది. భైరవుడిచ్చిన ఆయువు సమయం పూర్తి అయినదని నీకు తెలుసు. కాని నీ యందు వాత్సల్యముతో నీ ఆయువును పొడిగిస్తున్నాను. ఈ శరీరాన్ని వదలి ఇంకో శరీరంలో ప్రవేశిద్దువుగాని, మధుర రాజధానిగా ఈ బృందావన రాజ్యానికి ఇటీవలే మా వంశీయుడైన ప్రవరసేనుడనే యువకుడు పట్టాభిషిక్తుడైనాడు. వాడు అల్పాయువు. కాలసర్పదష్టుడై త్వరలో మరణిస్తాడు. అతనిని శ్మశానానికి తీసుకు వెళ్ళినప్పుడు నా మాయవల్ల త్రోవనపోయే వ్యక్తి ఒకడు వచ్చి "నేను సర్పమాంత్రికుడను, ఇతనిని బ్రతికిస్తానంటాడు. దహనకాండ ఆపబడుతుంది. నీవు పరకాయ ప్రవేశ విద్యతో ప్రవరసేనుని శరీరంలోకి ప్రవేశించు. అంతా రాజు బ్రతికాడని పొంగిపోతారు. ఆ యోగి వెళ్ళిపోతాడు. ఆ శరీరమునందు నీవు వెయ్యేండ్లకు పైగా ఉందువుగాని" అని పలికాడు.
రాధాదేవి కృష్ణునివైపొకసారి చిరునవ్వుతో చూచి "చిరంజీవీ! కృష్ణ చంద్రుడు కరుణావర్షం నీ మీద కురిపించాడు. వెయ్యేండ్లు బ్రహ్మచర్య దీక్షలో ధర్మవీరుడవై కష్టపడ్డావు. కొత్త శరీరంలో సుఖపడవలసిన కర్మ యోగిస్తుంది. పూర్వజన్మలో నాగవంశీయునిగా ఉన్నపుడు నా సఖి ఇందు లేఖతో సంసారం చేసి ప్రణయజీవితం గడిపావు. ఆమె ఆ భౌతిక శరీరం విడిచి దివ్యభూమికలో నా సఖిగా ఉంది. నీ మీద మమకారం వదులుకోలేదు. ఆమెకు మళ్ళీ పాంచభౌతిక శరీరాన్ని ప్రసాదించాను. పుట్టి పెరిగి యౌవనంలోకి వచ్చింది. ప్రవరసేనునిగా ఆమెను వివాహం చేసుకొని మధుర భక్తి మార్గంలో జీవన యానం కొనసాగించు, శరీరం మారినా గర్భనరకం లేదు గనుక సిద్ధశక్తులు వెంటనే ఉంటవి. ధర్మరక్షణ జీవితయజ్ఞంగా కొనసాగించు. ప్రేమభక్తితో బ్రతుకుమల్లెపూల బాటగా ముందుకు వెళ్ళు" బృందావనేశ్వరులిద్దరూ అదృశ్యమైనారు. మెలకువ వచ్చింది. ప్రక్కనే ఉంచిన ఉత్తరీయం అందుకొన్నాడు. రాధాకృష్ణుల పాదముద్రలు దానిమీద కనిపిస్తున్నవి. కండ్లకద్దుకొన్నాడు. లేచి స్నానం చేసి సిద్ధమై కృష్ణాశ్రమం అధిపతి దగ్గరకు వెళ్ళి నమస్కరించి సెలవిమ్మని అభ్యర్థించాడు. ఆయన ప్రేమదేవతల అనుగ్రహం పొందావు గదా! వెళ్ళిరా. అని ఆశీర్వదించి పంపించాడు.
( సశేషం )
Comments