top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 27 Siddeshwarayanam - 27


🌹 సిద్దేశ్వరయానం - 27 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 భైరవనాథుడు 🏵


ఆదిదంపతులు చెప్పినట్లే అంతా జరిగింది. బృందావన ప్రాంత రాజ్యానికి అధిపతియై ప్రజారంజకంగా పరిపాలించాడు. ఇందులేఖ నాగావళి అన్న పేరుతో అతనికి భార్య అయినది. ఆ రోజులలో నూటయాభై సంవత్సరాల వరకు ఎక్కువమంది బ్రతికేవారు. అరుదుగా రెండు వందల యేండ్లు కొద్ది మంది జీవించేవారు. దీర్ఘాయుష్కులైన ఈ దంపతులను మహాయోగులుగా ప్రజలు పూజించేవారు. దంపతులిద్దరూ కొంతకాలం గడిచిన తర్వాత కుమారునకు పట్టం గట్టి యమునాతీరంలోనే ఒక ఆశ్రమం నిర్మించుకొని ప్రశాంతంగా భక్తిమార్గములో రాధాదేవిని ప్రధానంగా ఆరాధించారు. కృష్ణదేవుని మీద కంటె రాధాదేవిపై ఎక్కువ భక్తినిలిచేది. ప్రవరసేనుడు రాధాదేవి పరివారంలోని గోపకునిగా, నాగావళి రాధాసఖిగా భావిస్తూ నిరంతరం భజనచేస్తూ కాలం గడుపుతున్నారు. కృష్ణుని మనుమడైన అనిరుద్ధుని కుమారుడు వజ్రుడు మధురాధిపతిగా నిర్మించిన కృష్ణ దేవాలయాలకు వెళ్ళి దర్శిస్తూ రాధాదేవి అష్టసఖీమందిరం మొదలైన వానిలో సేవలు చేస్తూ కాలం గడిపేవారు.


సేవాకుంజ్ అంటే ఇద్దరికీ చాలా ఇష్టం. అక్కడ కృష్ణుడు రాధాదేవి పాదముల చెంగట ఉంటాడు. బృందావనధామంలో రెండు సిద్ధాంతాలున్నవి. ఒకటి కృష్ణుడు సర్వేశ్వరుడు. రాధాదేవి ఆయన ప్రేయసి. మిగతా గోపికలకంటే కొంచెం అధికురాలు. కొందరు గోపికలలో ఆమె కూడా ఒకరని ప్రత్యేకత ఏమీ లేదని అందుకే శ్రీమద్భాగవతంలో రాధాదేవి పేరు ఎక్కడా లేదని అంటారు. మరి కొందరు సృష్టి మొదట రాధాదేవి అవ్యక్తంలో నుండి వ్యక్తమయిందని తన సంతోషం కోసం ఆమె కృష్ణుని సృష్టించి ఆయన ప్రేయసి అయిందని చెపుతారు.


శ్లో॥ అవ్యక్తాత్ సముదీరితాం ప్రథమతో గోలోక విస్ఫూర్జితాం ఇచ్ఛా సృష్టపరేశ కృష్ణహృదయ ప్రీత్యర్థ రాధాకృతిం వంశీవాదన తత్పరాం మకుటికా మాయూర పింఛోజ్వలాం గాంధర్వీం రసదేవతాం హృదిభజే బృందావనాధీశ్వరీం


అంతేకాదు. కృష్ణ సాక్షాత్కారం కావాలంటే రాధాదేవి అడుగుపెట్టిన చోట ఉన్న మట్టి శిరస్సున ధరిస్తే వెంటనే గోవిందుడు వశీకృతుడవుతాడట!


శ్లో॥యోబ్రహ్మరుద్ర శుకనారదభీష్మముఖ్యై లక్షితో న సహసా పురుషస్య తస్య సద్యోవశీకరణ చూర్ణమనంత శక్తిం తాం రాధికా చరణరేణు మనుస్మరామి.


(హితహరివంశ మహారాజ్)


ఏదైనా ఇంటింటా బృందావనంలో రాధానామం ఎక్కువగా వినిపిస్తుంది. పొద్దుననే పాలవాడు రాధే రాధే అని తలుపు తట్టుతాడు. వీధిలో నడుస్తూ ముందువాణ్ణి తప్పుకోమని చెప్పాలంటే రాధే రాధే అంటారు. ఇలా పట్టణంలో నిరంతరం రాధాస్మరణ. కొన్ని వందల రాధాకృష్ణ మందిరాలున్నవి. నిధివనంలో రాధాకృష్ణులు రాత్రివేళ విహరిస్తారు. అందుకే చీకటిపడితే తోటలోకి ఎవరూ వెళ్ళరు. ఇటువంటి పవిత్ర ప్రదేశాలెన్నో, కృష్ణుడు కాళీరూపాన్ని ధరించిన ప్రదేశంలో కృష్ణకాళీ మందిరమున్నది. ఇలా వర్ణిస్తే అసంఖ్యాకమైన దివ్యాలయాలెన్నో, నాగావళీ ప్రవరసేనులు రాధాకృష్ణసేవ చేస్తూ ఉండగానే పన్నెండు సంవత్సరాలు గడచిపోయినవి.


( సశేషం )


🌹🌹🌹🌹🌹


4 views0 comments

Comments


bottom of page