top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 28 Siddeshwarayanam - 28

Updated: Apr 3, 2024


🌹 సిద్దేశ్వరయానం - 28 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 భైరవనాథుడు 🏵


ఒకరోజు వారి కుమారుడు ప్రస్తుత మహారాజు తల్లిదండ్రులను దర్శించటానికి వచ్చాడు. తండ్రి దేవతామందిరంలో ధ్యానంలో ఉన్నాడు. తల్లిదగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు. ఇతడు "అమ్మా! మీరు శరీరాలు విడిచి వెళ్ళే సమయమైందని అప్పుడప్పుడు మీరన్న మాటల ద్వారా తెలుసుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను దిక్కులేని వాణ్ణి అవుతాను. మీరు ఎప్పుడూ నాతో ఉండాలి. ఆ కోరిక తీరాలంటే నాన్న నాకు కుమారుడుగా పుట్టే వరం నాకు ప్రసాదించాలి. నీవు కూడా జన్మించి మళ్ళీ మీరు దంపతులుగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి" అని బ్రతిమలాడాడు. నాగావళి "నాన్నా! మా తరువాత ఏమిటి? మేము తరువాత ఏమి కావాలి? అన్నది మీ నాన్నగారు నిర్ణయిస్తారు. వారిని అడుగుదువు గాని" అన్నది. కుమారుడు అమ్మా! నాన్నగారిని నేను అడుగలేను. వారంటే నాకు భయం. నీవే ఎలానైనా వారిని ఒప్పించాలి" అని కాళ్ళు పట్టుకొని విడిచిపెట్టలేదు. ఆమె ప్రియపుత్రుని మాట కాదనలేక పోయింది. "అలానే! నాన్నగారిని ఒప్పిస్తాను" అన్నది. కొద్దిసేపటికి ప్రవరసేనుడు వచ్చాడు.


జరిగింది ఆమె తెలియచేసింది. కుమారుడు చేతులు జోడించి తండ్రిని వేడుకొన్నాడు. ప్రవరసేనుడు ఒక్క క్షణం మాట్లాడలేక పోయినాడు, కండ్లు మూసుకొని పదినిమిషాల తర్వాత నెమ్మదిగా కండ్లు తెరచి అన్నాడు "మీ అమ్మ ఇష్టపడి మాట యిచ్చిందంటే అది రాధాదేవి ఇచ్చ. నీవు కోరింది. జరుగుతుంది". నాగావళి పూర్వనామం ఇందులేఖ గనుక ప్రవరసేనుడు కుమారునికి ఇందుసేనుడని పేరు పెట్టాడు. ఆ ఇందుసేనుడు తల్లిదండ్రులకు మ్రొక్కి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయినాడు. అనంతరం దంపతులు కూచుని మాట్లాడుకొన్నారు. ప్రవరసేనుడు “నాగా! విధి ఈ రూపంగా మన భవిష్యత్తు నిర్ణయించింది. మనం జన్మయెత్తామంటే గర్భనరకం అనుభవించక తప్పదు. మనం మనను మరిచిపోతాము. ఇప్పుడు మనమెవరమో ఎక్కడ నుండి వచ్చామో అన్నీ మనకు తెలుసు. జన్మ మారగానే పూర్వస్మృతి ఉండదు. ఇప్పుడున్న సిద్ధశక్తులు వెంటరావు. మనం చేసిన పుణ్యఫలం మాత్రమే వస్తుంది.


సిద్ధాశ్రమ గురువుల అనుమతి లేకుండా ఈ నిర్ణయం తీసుకొన్నాము. అయినా మనం వారిని ప్రార్ధిద్దాము. ఆ మహాత్ములు కరుణామయులు. ఈ మొదలయ్యే జన్మపరంపరలో మన చేత సాధన చేయించి తపస్సు చేయించి పూర్వజన్మ స్మృతులు వచ్చేలా చేస్తూ సిద్ధశక్తులు ప్రసాదిస్తారన్న నమ్మకం నాకున్నది. ప్రేమమూర్తులైన రాధాకృష్ణులు మనలను విడిచి పెట్టరు". ఆమె కంటి వెంట కన్నీరు కారుతున్నది. "స్వామీ! పుత్రమమకారంతో తప్పుచేశాను. మన్నించండి. పరిణామాలు ఇలా ఉంటవని ఊహించలేకపోయాను" అని భర్త పాదముల మీద వ్రాలింది. ఆమెను లేవదీసి పొదివి పట్టుకొని తన ప్రక్కన కూర్చోబెట్టుకొని "నాగా! ఇందులో నీ తప్పేమీ లేదు. అనుల్లంఘనీయమైన విధి ప్రభావమిది. రాబోయే జన్మలో మళ్ళీ మనమిద్దరమూ భార్యాభర్తలుగా ఉండగలము. తరువాత జన్మలలో అన్నింటిలోను నీవు నాతో ఉండకపోవచ్చు. రాధాప్రియ సఖివి గనుక జన్మకు జన్మకు మధ్య నీవు రాసేశ్వరి పరివారంలో ఉంటూ కొన్ని నిర్దిష్ట జన్మలలో నాతో ఉండటానికి జగన్మాత అనుమతిస్తుంది. ఇక నా జన్మలు కాశీమజిలీ కథలు, సరి! వానికేమి? పద మందిరంలోకి వెళ్ళి రాధాకృష్ణులకు నమస్కరించి ప్రసాదం తీసుకొందాము అని ప్రవరసేనుడు భార్యను పట్టుకొని నడిపిస్తూ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు, అంతే ఇక లేవలేదు. ఈ అధ్యాయం ముగిసింది.


ప్రవరసేనుడు ఇందుసేనుని కుమారునిగా జన్మించాడు. గుణసేనుడన్న పేరు పెట్టబడింది. నాగావళి మరో రాజవంశంలో పుట్టి అతనికి భార్య అయింది. రాధాకృష్ణుల సేవ చేస్తూ ప్రజలను జాగ్రత్తగా రెండువందల సంవత్సరాలు పరిపాలించి కాలగర్భంలోకి వెళ్ళిపోయినాడు.


శ్లో॥ సారమ్యానగరీ మహాన్ సనృపతిః సామంత చక్రంచ తత్ పార్శ్వేతస్యచ సా విదగ్ధపరిషత్ తాశ్చంద్రబింబాననాః ఉద్వృత్తస్సచ రాజపుత్ర నివహః తేవందినస్తాః కధాః


సర్వం యస్య వశాదగాత్ స్మృతిపథం కాలాయ తస్మై నమః - (భర్తృహరి)


మహానగరము - మహరాజు- రాజపుత్రులు- సామంతులు - సౌందర్యవతులైన స్త్రీలు- వందిమాగధులు- సర్వము దేని ప్రభావము వల్ల స్మృతి పథంలోకి వెళ్ళిపోయిందో ఆ కాలమునకు నమస్కారము.


( సశేషం )


🌹🌹🌹🌹🌹




3 views0 comments

Comments


bottom of page