top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 29 Siddeshwarayanam - 29



🌹 సిద్దేశ్వరయానం - 29 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 5వ శతాబ్దం నుండి 🏵


ఆంధ్రదేశం నుండి యాత్రికుల బృందమొకటి కాశీపట్టణానికి వచ్చింది. కాశీలో గంగాస్నానము, దేవతా దర్శనము మొదలైనవన్నీ పూర్తి చేసుకొని చుట్టుప్రక్కల చూడవలసినవన్నీ చూచిన తర్వాత కైలాస మానస సరోవరయాత్రకు వెళుతున్నవారు కొందరు పరిచయమైనారు. తెలుగువారిలో కొంతమంది దాని యందు ఆసక్తి కలిగి దానికి సిద్ధమైనారు. అటువంటి జనంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది. వారు భార్య, భర్త, కుమారుడు.


యాత్ర మొదలైంది. యాత్రికులు దాదాపు వందమంది ఉన్నారు. అప్పుడున్న కాశీరాజు మంచి శివభక్తుడు. కైలాస పర్వతానికి వెళ్ళేవారికి సౌకర్యాలు కలిగించటం కోసం కొన్ని ఏర్పాట్లు చేశాడు. అరణ్యమార్గంలో రెండు మూడు నెలలు ప్రయాణాలు చేయాలి. త్రోవలో క్రూరజంతువుల వల్ల ఇబ్బందులు రాకుండా క్షేమంకరమైన ప్రమాదరహితమైన మార్గంలో సైనికుల సహాయంతో వెళ్తూ మధ్య మధ్య కొన్ని మజిలీలు ఏర్పాటు చేసి అక్కడ భోజన వసతి సహాయాలుండేలా చేశాడు. మార్గంలో చిన్న చిన్న క్షేత్రాలు దేవాలయాలు చూచుకుంటూ వీరి ప్రయాణం కొనసాగింది.


ఈ పథంలో నేపాల్ వెళ్ళటం ఉండదు. ఖట్మాండూ వెళ్ళి పశుపతి నాధుని దర్శించే అవకాశం లేదు. సరాసరి త్రివిష్టప (టిబెట్) భూములలో ప్రవేశించటమే. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్ళేప్పుడు ప్రాణవాయువు ప్రసారం తగ్గుతుంది. అందుకని అలవాటు పడటం కోసం ఒక్కోచోట మూడు నాలుగు రోజులుంటూ ప్రయాణం సాగింది. మానస సరస్సు చేరుకొన్న తర్వాత అక్కడ పూర్ణిమ వచ్చినదాకా ఉండి ఆ చల్లని నీళ్ళలో స్నానాలు చేస్తూ జప హోమాలు చేస్తూ కొద్దిరోజులున్నారు. పున్నమి రోజు చాలామంది మేలుకొని దేవతలు వచ్చి స్నానం చేసిపోతారంటే జాగారం చేశారు. ఆకాశం నుండి చుక్కలు సరస్సులో రాలిపడుతున్న దృశ్యం ఎక్కువమందికి కనిపించింది. ప్రతిరోజు జడదారులు కొందరు వచ్చి స్నానం చేస్తుండేవారు. వారెవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. నమస్కరిస్తే ఆశీర్వదించి వెళ్ళిపోయేవారు. స్థానిక షేర్పాలు యాత్రికుల దగ్గర ధనం తీసుకొని అన్ని సహాయాలు చేసేవారు.


ఆ సరస్సునే కొందరు నిత్యయౌవనాన్ని ప్రసాదించే స్పటిక సరస్సనీ కలియుగ ప్రభావం వల్ల ఆ మహిమ తగ్గిందని అంటారు. ఏదైనా సర్వపాపహారిణిగా, పుణ్యప్రదాయినిగా ఆ సరోవరం సర్వజనులకు పుణ్యమైనది. అక్కడ నుండి యాత్రికులు కైలాస పర్వత భూమికి చేరుకొన్నారు. ఆ పర్వతమే శివస్వరూపం. శివనివాసం. అది సాక్షాత్తు పరమేశ్వరుని దేహం గనుక ఎవరూ దానిని ఎక్కరు. ప్రదక్షిణం చేస్తారు. దానికి పరిక్రమ అని పేరు. కైలాసగిరి పరిక్రమ చేస్తే శివానుగ్రహం లభిస్తుందని, సర్వపాపములు నశిస్తవని యుగయుగాల నుండి భారతీయుల విశ్వాసం. బాలురు, వృద్ధులు తప్ప దాదాపు అందరూ పరిక్రమ చేసి వచ్చారు. కొన్ని రోజులు గడచిన తర్వాత చాలామంది తిరుగు ప్రయాణానికి సిద్ధమైనారు.


ఆంధ్రదంపతులు మాత్రం తమ ఆప్తులతో “మనం మన ఊళ్ళకు వెళ్ళి చేసే మహా కార్యాలేమున్నవి. ఉద్యోగాలు చేయాలా? ఊళ్ళేలాలా? ఆషాఢమాసం వచ్చింది. సన్యాసులు చాతుర్మాస్యదీక్ష చేస్తారు. పూర్ణిమతో మొదలుపెట్టి నాలుగు నెలలు ఒక చోటనే ఉండి తపస్సు చేస్తూ పురాణాలు చదువుతూ, చెప్పుతూ సమయమంతా దైవభావంతో గడపాలి. గృహస్థులు కూడా దీక్ష చేయవచ్చునని ధర్మశాస్త్రాలు చెప్పినవి. మేమిక్కడే ఉండి ఆ వ్రతం చేద్దామని అనుకొంటున్నాము. స్థానికుల సహకారంతో ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవచ్చు అన్నారు. యాత్రికులలో కొందరు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చాము. జీవితంలో మళ్ళీ ఈ పవిత్ర ప్రదేశానికి రాగలమో లేదో మనమూ దీక్ష తీసుకుందాము" అన్నారు. మూడువంతుల మంది తిరుగు ప్రయాణం నిశ్చయించుకొని వెళ్ళారు. ఒకవంతు మంది ఉన్నారు. ఉన్నవారిలో తెలుగువారే కాక ఇతర భాషలవారు కూడా ఉన్నారు. ఇలా ప్రోత్సహించిన తెలుగు భక్తుడు వృద్ధత్వంలో అడుగుపెడుతున్న శివానందశర్మ. ఇతడు తెలుగు, సంస్కృతములే కాక హిందీ కూడా అభ్యాసం చేసి ఈ మూడు భాషలలో ప్రతిరోజు సాయంకాలం పురాణ ప్రవచనం చేసేవారు. ఉదయం పూట జపములు, హోమములు చేసేవారు. రాత్రిళ్ళు భజనలు చేసి నిద్రకు ఉపక్రమించేవారు. శివానంద కుమారుడు - హరసిద్ధశర్మ, ఎనిమిదవయేటనే ఉపనయనం జరిగింది. ఇప్పుడు పన్నెండు సంవత్సరాల వయస్సు. శ్రీ సూక్త పురుష సూక్తములు, నమక చమకములు, మంత్ర పుష్పము నేర్చుకొన్నాడు. కమ్మని కంఠం. పాటలు బాగా పాడేవాడు. తండ్రి పురాణ ప్రవచనం చేస్తుంటే ప్రారంభంలో ఇతడు శ్లోకాలు, అప్పుడప్పుడు తెలుగు పద్యాలు పాడేవాడు. భాష అర్థంకాకపోయినా ఆంధ్రభాషా మాధుర్యానికి ఇతని మధుర మంజుల గళానికి శ్రోతలు ముగ్ధులయ్యేవారు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹



5 views0 comments

Comments


bottom of page