🌹 సిద్దేశ్వరయానం - 3 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🌹సిద్దేశ్వరయానం 🌹
🏵️ ద్వాపర యుగం 🏵️
Part-3
కపిలుడు :
ఆత్మీయుడా ! ఇది దేవరహస్యము. అయినా నీ మీది ప్రేమ వలన చెబుతున్నాను. నేను ఆదియుగముల నాటి సిద్ధుడను. అనేక యుగములలో అవసరమయినప్పుడల్లా శరీరాన్ని నిర్మించుకొంటూ ఉంటాను. నేను నిర్మాణకాయుడను. వసిష్ఠుడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు మొదలైనవారు ఇట్టివారే. మేము లాంఛనముగా ఎవరికో సంతానముగా పుట్టినట్లు కనపడవచ్చు. కానీ పూర్వస్మృతి పోవటం కానీ దివ్యశక్తులు నశించటం కానీ ఉండవు. ఈ ద్వాపరంలో ఉన్న ఈ శరీరానికి ఇందులోని జీవునకు నీవు ఆప్తుడవు. నేను రావణాసురుని శిక్షించిననాడు- జమదగ్ని కుమారుడయిన భార్గవరాముని, పరశువులో నీవున్నావు. ఆ రేణుకాపుత్రుడు కైలాసములో మహేశ్వరుని సేవించి ఆయన శిష్యుడై ఆయుధవిద్యలు నేర్చుకొంటున్న రోజులలో భూతేశుడు, పరశుధరుడు, మహాదేవు డతని యందు కరుణించి తన పరశువు నుండి మరొక పరశువును సృష్టించి తన తేజః కిరణమయిన నిన్ను దానిలో నిక్షేపించి పంపించాడు. రుద్రశక్తివల్ల, మహాకాలుడి సంకల్పం వల్ల అతనిలో ప్రవేశించి అతని మనస్సును ప్రభావితం చేసి సర్వక్షత్రియ సంహారము చేసింది నీవు. వైష్ణవ శక్తి కూడా అతనిని ఆవేశించి విష్ణువు యొక్క అంశావతారమని పేరు తెచ్చింది. పరశురాముడు శ్రీరాముని ఎదిరించినపుడు అవసరమైన క్షత్రియ సంహారకాండ అప్పటికి పూర్తి అయి ఉన్నది కనుక, వైష్ణవతేజస్సు దాశరథిలోనికి వెళ్ళిపోయింది. నీవూ పరశురాముని వదిలి అంతరిక్షంలోకి వెళ్ళి ఆతరువాత కొంతకాలానికి నీవే మునికుమారునిగా జన్మనెత్తావు. నాకు సతీర్థ్యుడవై మిత్రుడవై ఇన్నాళ్ళు గడిపావు. ఇప్పుడు త్వరలో మరొక మార్పు రానున్నది.
జైగీ :
మీరిన్ని యుగాలు ఎలా జీవించగలిగారు ? నేనెందుకు జన్మ లెత్తుతున్నాను? నాకు రాబోయే మార్పు ఏమిటి ? ఆ మార్పు రాకుండా మీరు ఆపకూడదా ?
కపిల :
స్నేహితుడా నాకు శరీరము నిమిత్త మాత్రము. నేను ఆద్యంత రహితుడను. అయినా మానవశరీరంలో ఉంటున్నాను కనుక సహజంగా కొన్ని అనుబంధాలు ఏర్పడుతాయి. వానియందు సముచితమైన ఆదరాన్ని చూపిస్తాను. విష్ణ్వంశ వల్ల నాకీ శాశ్వతత్వము లభించింది. విష్ణువు యొక్క అంశలలో నేనూ, దత్తాత్రేయుడు ఇటువంటి వారము. నేను చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. నేనీ క్రౌంచ ద్వీపంలో నివాసమేర్పరచుకొన్న తరువాత తమ యజ్ఞాశ్వాన్ని అపహరించినవాడినని భావించి నగరపుత్రులు నన్నవమానించి నా క్రోధాగ్నికి దగ్గులయినారు. వారికి సద్గతులు కలిగించటం కోసం వారి వంశీయుడైన భగీరధుడు తపస్సు చేసి గంగను భూమికి తెచ్చాడు. సగరపుత్రులు హిమాలయము నుండి ఇక్కడి దాకా సొరంగమార్గము త్రవ్వారు. ఆ గంగ కొంతభాగం ఆ సొరంగంలో గుండా ఇక్కడకు వచ్చి, ఇక్కడ భస్మరాశులను తడిపి వాళ్ళకు ఉత్తమగతులు కల్పించింది. ఈ సొరంగమార్గం గుండా నీవు హిమాలయాలకు వెళ్ళు. ఈ గంగామార్గాన్ని అనుసరించి విశ్వనాధుని నెలవైన వారణాసికి చేరుకో. ఆ కాశీక్షేత్రంలో గంగాతీరంలోని ఒక గుహలో తపస్సు చేయి (అక్కడ ఇప్పుడూ జైగీషవ్యగుహలున్నవి). అక్కడ నీకు శరీర పతనం జరుగుతుంది. కొద్దికాలానికే బ్రహ్మపుత్రానదీ ప్రాంతంలోని నాగభూమిలో నీవు జన్మిస్తావు. మనుష్యశరీరం ప్రధానంగా ఉండి అవసరమయినపుడు నాగదేహాన్ని ధరించగల్గిన నాగజాతిలో నీపుట్టుక కలుగుతుంది. పరోక్షంగా నిన్ను నేను కాపాడుతూనే ఉంటాను. విధి ప్రభావం వల్ల పరమేశ్వరుని ఇచ్ఛానుగుణంగా జరిగే ఈ ప్రయాణాన్ని ఆపాలని కోరవద్దు. భూమి మీద ఎవరెవరి వల్ల ఏ పనులు చేయించవలసి ఉన్నదో ఆ కార్యనిర్వహణకోసం దేవజాతుల వారు సిద్ధమండలిలోని వారు ఎంపిక చేయబడి పంపించబడతారు. ఆ విధంగా ఎన్నుకోబడిన వారిలో నీ వొకడవు. ప్రాణమిత్రుడా! ఈ మార్పును గురించి బాధపడవద్దు. నాగవంశంలో ఉదయించిన తరువాత అక్కడికి దగ్గరలో ప్రాగ్జ్యోతిషపురంలో అవతరించి ఉన్న కామాఖ్య కాళి దగ్గరకు వెడతావు. ఆమె అనంతర కర్తవ్యాన్ని నీ కుపదేశిస్తుంది. శుభం భవతు.
జైగీ :
మీ ఆజ్ఞ. నేనేమీ మాట్లాడలేకుండా ఉన్నాను. మీరు నన్నెప్పుడూ పరిరక్షిస్తూ ప్రబోధిస్తూ ఉండాలని ప్రార్ధన.
కపిల : తథాస్తు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
All Messages of Siddeswarananda Swami:
Comentários