top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 30 Siddeshwarayanam - 30



🌹 సిద్దేశ్వరయానం - 30 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 5వ శతాబ్దం నుండి 🏵


సీ || గరళకూట వినీల కంఠాయ శంభవే మదనాంతకాయోం నమశ్శివాయ


కాద్ర వేయాధిపగ్రైవేయ భూషాయ మధుభిత్సఖా యోన్నమశ్శివాయ


కుంభినీధరసుతా కుచకుంభ పరిరంభ మహలోలుపా యోన్నమశ్శివాయ



గీ || గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంధి వాహినీ నిబిడవర్గ బంధుఘోరాంధకారాఙ్ఞ బంధుకిరణ మాలినే శాశ్వతాయో న్నమశ్శివాయ ..(శ్రీనాథుడు)


జయఫాలనయన ! శ్రితలోలనయన ! సీతశైలశయన శర్వా ! జయకాలకాల ! జయమృత్యు మృత్యు ! జయదేవదేవశంభో!


అని గొంతెత్తి ఆర్తితో పిలుస్తుంటే సదస్యుల, కన్నులు చెమ్మగిల్లేవి. ఆ బాలుని అందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో చూచేవారు. అలా చూస్తున్నవారిలో అస్సాం ప్రాంతంలోని నాగభూమి నుండి వచ్చిన దంపతులు మరీ వాత్సల్యంతో చూచేవారు. పౌరాణిక దంపతులకు శ్రద్ధతో సేవలు చేస్తూ వారికి కావలసినవన్నీ సమకూర్చటంతో పాటు ఈ పిల్లవాని విషయంలో ప్రత్యేక ప్రేమ చూపించేవారు. బాలునకు కూడా వారంటే ఇష్టం ఏర్పడింది. వారు తన కోసం చేసిన మధుర భక్ష్యాలు తీసుకొనేవాడు. వారి భాష కూడా హిందీకి దగ్గరగా ఉండటం వల్ల నిత్య సాన్నిహిత్యం వల్ల ఇతనికి కూడా బాగా వచ్చింది. అతని స్నానపానములు, భోజన శయనములు అన్నీ వారే చూచుకొనేవారు. సంతానం లేకపోవటం వల్ల ఇతనినే తమ స్వంతబిడ్డగా భావించేవారు.


ఈ విధంగా నాలుగు నెలలూ కైలాసనాధుని సన్నిధిలో తపస్సు లాగా గడచిపోయినవి. దీక్షా విరమణానంతరం అందరూ స్వస్థలాలకు బయలుదేరారు. వెళ్ళే ముందు కొందరు కైలాస పరిక్రమ చేద్దామని అనుకొని యాత్ర ప్రారంభించారు. శివానందశర్మ దంపతులు కూడా వాళ్ళతో కలిశారు. అస్సాం దంపతులు అనారోగ్యంగా ఉండటం వల్ల వాళ్ళు ఉండి పోయారు. హరసిద్ధశర్మ అంతకు కొద్ది రోజుల ముందే కొందరితో కలసి వెళ్ళి రావటం వల్ల వీళ్ళకు తోడుగా ఉంటాను అన్నాడు. పరిక్రమ యాత్రికులు బయలుదేరారు. సగంపైన వెళ్ళిన తర్వాత మంచు వర్షం విపరీతంగా కురిసి ద్రోవ సరిగా కనపడక కొందరు కాళ్ళు జారి లోయలో పడిపోయినారు. జారిపోయిన వారిలో శివానందశర్మ దంపతులు కూడా ఉన్నారు. నిస్సహాయులైన మిగతావారు దుఃఖంతోనూ బాధపడుతూ పరిక్రమ పూర్తి చేసుకొని విడిదికి చేరారు. పౌరాణిక దంపతుల మరణానికి అందరూ శోక నిమగ్నులైనారు. ఏడుస్తున్న బాలుని చాతుర్మాస్యదీక్షలో ఉన్న వారంతా ఓదార్చారు. అస్సాం దంపతులు క్షణక్షణమూ తోడుగా ఉండి కర్మ చేయించారు. పన్నెండు రోజులు గడచిన తర్వాత ఈ పిల్లవానిని ఏం చేయాలన్న ప్రశ్న ఉదయించింది. కొందరు తెలుగువాళ్ళు ఇతనిని స్వగ్రామానికి తీసుకెళ్ళి అతని బంధువులకు అప్పగిస్తామన్నారు. విచారించిన మీద వీరి కుటుంబానికి ఆస్తిపాస్తులేమీ లేవని ఒకరిద్దరు బంధువులున్నా ఇతనిని పోషించి పెంచి పెద్ద చేసే పరిస్థితి లేదని తేలింది. అస్సాం దంపతులు ఇతని మీద మమకారం పెంచుకొని ఉన్నారు. మేము తీసుకెళ్ళి చదువు చెప్పించి పెంచి పెద్ద చేస్తామని అన్నారు. పిల్లవాడు కూడా వాళ్ళతో వెళ్ళటానికే ఇష్టపడ్డాడు. మిగతా వారూ సరేనన్నారు.


అక్కడ నుండి బయలుదేరి అస్సాం చేరటానికి కొంత దీర్ఘకాలం పట్టింది. వారి స్వస్థలం గౌహతి. ఒకప్పుడు దానికే ప్రాగ్జ్యోతిషపురమని పేరు. నరకాసురుని రాజధాని. ఆ వంశం వారు ఎవరూ లేరు. ఇప్పుడెవరో పరిపాలిస్తున్నారు. అష్టాదశ మహాశక్తి పీఠాలలోని కామాఖ్యకాళి అక్కడ ఉన్నది. సతీదేవి శరీర ఖండాలలో యోనిపడిన ప్రదేశం యిది. లలితాదేవి కామేశ్వరి ఆమె కరుణవల్ల పునర్జీవితుడైన మన్మథుడు ఆ దేవిని ఆ ప్రదేశములో ప్రతిష్ఠించాడు. లలితాదేవి చేతులలోని పాశాంకుశములను పెట్టకుండా పుష్పబాణములు, చెరుకు విల్లు మాత్రం కామచిహ్నంగా ఉంచి కామదేవి అని పేరు పెట్టాడు. ఆ దేవి ఎప్పుడు ఎవరి వల్ల మారిందో గాని కాళీదేవిగా మారింది. ఇప్పుడిక్కడ నిత్యము జంతుబలులిస్తారు. అంతా రక్త ప్రవాహముగా ఉంటుంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనుండి భక్తులు వస్తారు. చీనభూముల నుండి కూడా ఎక్కువమంది వస్తారు. అటువంటి పట్టణంలో ఈ దంపతులు నివసిస్తున్నారు. వారు బాగా సంపన్నులు.


హరసిద్ధునకు కోరిన విద్యలు నేర్పిస్తున్నారు. వేదశాస్త్రముల మీది కంటే హరసిద్ధునకు పురాణములమీద కావ్యములమీద అభిరుచి ఎక్కువగా ఉంది. కవిత్వం చెప్పటం శ్లోకాలు అల్లటం చేస్తున్నాడు. దానికి తోడు శారీరక విద్యల మీద కూడా ఇష్టంఏర్పడింది. వ్యాయామశాలకు వెళ్ళి మల్లముష్టియుద్ధాలలో నైపుణ్యం సంపాదించాడు. ఆ యుద్ధపాఠశాలలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉండేవారు. మగధ ప్రాంతీయులు గదావిద్యలో, పాంచాలురు మల్లవిద్యలో, ఆంధ్రులు ధనుర్విద్యలో, కాళింగులు, మహారాష్ట్రులు ఖడ్గవిద్యలో ఎక్కువ ప్రావీణ్యం ఆసక్తి చూపేవారు. అయితే ఖడ్గవిద్య సర్వసామాన్యం. నాగజాతివారు కరవాలం తిప్పటంలో అసామాన్య ప్రజ్ఞ చూపేవారు. వారు కత్తి తిప్పుతుంటే మెరుపు తీగ చలిస్తున్నట్లుండేది. హరసిద్ధశర్మ వారిని మించిపోయినాడు. వారిలో కొందరు ఇతనికి ఆప్తమిత్రులైనారు. ఈ సాధన అంతా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడతనికి పదునెనిమిది సంవత్సరాలు వచ్చినవి.


(సశేషం )


🌹🌹🌹🌹🌹


8 views0 comments

Comments


bottom of page