🌹 సిద్దేశ్వరయానం - 52 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 16వ శతాబ్దం 🏵
కొంత కాలం కాళీయోగి కాశీలో ఉన్నాడు. అక్కడ త్రైలింగస్వామి అనే యతి కాళీ సాధన చేసి ఇతనివలె మూడు వందల యేండ్లు జీవించే వరం పొందాడు. అతడూ ఈ కాళీ దేవతామూర్తిని అర్చించాడు. అక్కడి నుండి యోగి కొన్నాళ్ళు దక్షిణాపధంలో తిరిగాడు. చిత్రానదీ తీరంలోని కుర్తాళం అతనిని ఆకర్షించింది. ఆ పవిత్రస్థలంలో కొన్ని నెలలు ధ్యానం చేసుకుంటూ అక్కడి ఆర్తుల కష్టాలు తీరుస్తూ గడిపాడు. తిరిగి ఉత్తర భారతానికి బయలుదేరగా దోవలో ఆంధ్ర ప్రాంతంలో శ్రీనాధుడనే కవివర్యునితో పరిచయం కలిగింది. చింతామణి మంత్రసిద్ధుడై రాజ పూజితుడైన ఆ విద్వాంసుని కవిత్వ పాండిత్య ప్రాభవానికి అతడు ముగ్ధుడైనాడు. ఆ కవి-అతిథిగా తన భవనంలో కొంతకాలమైనా ఉండవలసినదిగా ప్రార్థించాడు. ఆతని ఆత్మీయ భావానికి సంతోషించి కొన్నాళ్ళున్నాడు. విపరీతంగా స్త్రీలోలుడు అయిన ఆ కవి చిత్తవృత్తి చాలా చిత్రమనిపించింది. ఆనన్యమైన అతని శివభక్తి, తనకెంతో నచ్చింది. కాళీయోగి అక్కడినుండి బయలుదేరే రోజు ఆ కవిరాజు తన భవిష్యత్తును గూర్చి చెప్పమని ప్రార్ధించాడు.
ధ్యానంలో చూచి ఇలా చెప్పాడు. “మహాకవీ!” మీది చాలా గొప్ప జన్మ. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక సిద్ధగురువు నీకు దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ సమయంలో అతడు నీకు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ మహామహుని దయ వల్ల నీకు వాక్సిద్ధి లభించింది. నీ రంగంలో నీ ముందు నిలువగల వారుండరు. దిగ్విజయం చేసి సమ్రాట్టులచే కనకాభిషేకాలు పొందుతావు. ఎంతటి రాజులయినా నీ వశులవుతారు. మహాభోగాలు అనుభవిస్తావు. కానీ నీ స్త్రీలోలత నిన్ను దెబ్బతీస్తుంది. నీ పతనానికి దారి తీస్తుంది. ఇప్పుడే కాదు ఇంకా చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నీ ప్రభజగజ్జేగీయ మానంగా వెలుగుతోంది. ఏనాడు నీ సిద్ధగురువు పెట్టిన నియమాన్ని ఉల్లంఘిస్తావో ఆనాడు నీ శకం ముగుస్తుంది.
మరపు వల్ల, కామం వల్ల, నీవు దోషం చేస్తావని, తదనంతరం నీవు హత్య చేయబడి ప్రేతమై కొన్ని వందల సంవత్సరాలు గాలిలో తిరుగుతుంటావని తోస్తున్నది. నీ పురుషకారం వల్ల, దైవభక్తి వల్ల నీ భవిష్యత్తు నేమైనా మార్చుకోగలవేమో ఆలోచించుకో” శ్రీనాధుడు “యోగిశేఖరా! కాళీదేవి అనుగ్రహపాత్రులైన మీరు ఎన్నో విశేషాలు తెలియజేశారు. మీరు చెప్పిన ప్రయత్నం చేస్తాను. కానీ ఎంత కృతకృత్యుడనవుతానో! ముక్కుకుత్రాడు వేసి గంగిరెద్దును దానిని ఆడించువాడు లాక్కువెళ్ళి ఆడించే విధంగా విధినాతో అడుకుంటున్నది. నాకు మనశ్శాంతి లేదు. చిన్నప్పుడే నా తల్లి దండ్రులు మరణించారు. నా స్వగ్రామం క్రాల పట్టణం ఉప్పెన వచ్చి సముద్రంలో కొట్టుకుపోయింది. నా మేనమామ సనత్కుమారభట్టు నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆయన కూతురును నాకు పెండ్లి చేయాలని ఆశించాడు. ఆ అమ్మాయి చాలా వికారంగా ఉంటుంది.
నా జీవలక్షణం సౌందర్యోపాసన. ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోనని తిరస్కరించాను. కృతఘ్నుడవని నన్ను దూషించాడు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. ఆయన పెద్ద అధికారపదవిలో ఉండడం వల్ల నా కెవ్వరూ ఆశ్రయమివ్వలేదు. ఆగమ్మకాకినై ఊళ్ళు పట్టుకు తిరిగాను. ఒక సిద్ధుడైన మహానుభావుడు కరుణించి మంత్రోపదేశం చేశాడు. అది సిద్ధించింది. దాని వల్ల వాగ్దేవి అనుగ్రహించింది. మహా కవియైన మా తాతగారు కమలనా భామాత్యుని వారసత్వంగా కవిత్వం వచ్చింది. సరస్వతీ చింతామణీదేవి ఇచ్చిన శక్తి వల్ల సాహిత్యరంగంలో అప్రతిహత పరాక్రమంతో ప్రకాశిస్తున్నాను. దాని వల్ల సిరిసంపదలు లభించినవి. మీ వంటి మహానుభావులకు ఆతిధ్యమిచ్చి పూజించుకోగల అవకాశం లభించింది. అయితే మీరు నా భవిష్యత్తును గూర్చి చెప్పిన విషయాలు విన్నప్పుడు దిగులు కలుగుతున్నది. నా సాధనశక్తి చాలా పరిమితమైనది. దానివల్ల విధిని మార్చగలనని నాకు నమ్మకం లేదు. నన్ను మీరే రక్షించాలి. బ్రతుకు బాటలో ముండ్ల మీద ఉండవలసి వచ్చింది. ఎన్నో మలుపులు వచ్చినవి. వాటిని మీ ముందు ఏకరువుపెట్టను. ఆ పరిస్థితులలో స్త్రీలోలుడనైనాను. అయితే యే పతివ్రత జోలికి పోలేదు. నా మంత్ర గురువులు మీకు తటస్థించవచ్చు. నేను ఎప్పుడైనా తప్పుచేస్తే నన్ను దయతో క్షమించమని వారికి చెప్పండి. వారిని మళ్ళీ చూచే అవకాశం ఉన్నదో, లేదో వా రెక్కడ ఉన్నారో ? ఏదైనా నన్ను మీరు కాపాడాలి అని ప్రార్ధించాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Bình luận