top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 31 Siddeshwarayanam - 31



🌹 సిద్దేశ్వరయానం - 31 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 5వ శతాబ్దం నుండి 🏵


ఒకరోజు తోటి విద్యార్థియైన నాగయువకుడు హరసిద్ధుని తమ యింటికి ఆహ్వానించాడు. హరసిద్ధుడు వెళ్ళాడు. ఆ యిల్లు మామూలు గృహం కాదు. రాజమందిరంవలె ఉంది. గదులలో గోడలకు అందమైన చిత్రములు, రంగు రంగుల తెరలు, ఒక పెద్దగదిలో ఖడ్గములు, శూలములు వివిధాయుధములు, ఒక గదిలో వీణ మొదలైన సంగీత వాద్యములు ఎందరో సేవకులు, పరిచారికా పరిచారకులు మహావైభవంగా ఉంది. యువకుడు మిత్రుని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. వయోవృద్ధులైన వారికి హరసిద్ధుడు పాద నమస్కారం చేశాడు. వారు వాత్సల్యంతో ఆశీర్వదించి "నిన్ను గురించి అబ్బాయి చాలా చెప్పాడు. నీ యుద్ధవిద్యా నైపుణ్యము, ముఖ్యంగా నీ ఖడ్గచాలన ప్రజ్ఞ విన్న తరువాత నిన్ను చూడాలనిపించింది. చూచిన తరువాత ప్రజ్ఞకు తగిన ఆకారము, వినయ విధేయతలు, మాట పొందిక ఆకర్షించినవి. ఇది మీ యిల్లనుకో. ఎప్పుడూ వస్తూ ఉండు" అని పండ్లు, పాలు తెప్పించి ఇచ్చారు.


ఆ సమయంలో ఒక పదహారేండ్ల బాలిక అక్కడ ఉన్నది. అన్నీ వింటున్నది. ఆ అమ్మాయి అద్భుత సౌందర్యవతి. హరసిద్ధుడు చూచాడు. ఇంతలో యువకుడు మేము తోటలోకి వెళతాము అని తల్లిదండ్రులకు చెప్పి మిత్రునితో కలసి ఇంటికి ఆనుకొని ఉన్న ఉద్యానవనంలోకి వెళ్ళారు. అక్కడ ఒక తిన్నెమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా ఆ అమ్మాయి వచ్చింది. "అన్నయ్యా ! అమ్మ నిన్ను ఒకసారి రమ్మన్నది. పూజ కోసం పూలు కోసుకొని రమ్మని నాకు చెప్పింది. నేను పుష్పాలు సిద్ధం చేస్తాను” అన్నది. “హిరణ్మయీ! నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను ఈ లోపు ఇతనితో మాట్లాడుతూ ఉండు. నీ విప్పుడు పూలు కోయనక్కరలేదు నేను కోయించి ఉంచాను. అమ్మకు తెలియదు. అది ఆమెకిచ్చి మాట్లాడి వస్తాను. ఇతనిని ఇందాక చూచావు గదా! నాకు ప్రాణస్నేహితుడు. ఖడ్గవిద్యలో ఇంతటివారు లేరు" అని అతడింటిలోకి వెళ్ళాడు.


ఆమె అడిగింది "మా జాతివారితో సమానంగా ఖడ్గవిద్య నేర్చినవారు మామూలుగా ఉండరు. మీరెక్కడి నుండి వచ్చారు. మీ ఊరేది?”


హర - నేను ఆంధ్రుడను. మహాక్షేత్రములైన శ్రీశైలము, సింహాచలము, దక్షారామము మొదలైన వున్న దేశం. తీర్థయాత్రకు మా తల్లిదండ్రులతో వచ్చాను. కైలాసపర్వతం దగ్గర చాతుర్మాస్యదీక్ష చేసి పరిక్రమ చేస్తూ కాలుజారి లోయలో పడి మా పితరులు మరణించారు. అక్కడికి వచ్చిన నాగకుటుంబంతో ఏర్పడ్డ అనుబంధం వల్ల వారితో ఇక్కడకు వచ్చాను. అభిరుచిని బట్టి శాస్త్రపురాణాలతో పాటు శారీరక విద్యలు నేర్చు కొంటున్నాను.


హిర - చలి దేశమైన ఉత్తరభారతంలో వలె ఉష్ణదేశాలైన ద్రావిడ భూములలో శారీరకంగా బలవంతులు, వీరులు అంతగా ఉండరని చెపుతుంటారు. మీకింత సంగ్రామ విద్యలు ఎలావచ్చినవి ?


హర - బలాబలాలను దేశకాలాలను బట్టి అంత సులభంగా నిర్ణయించలేము. ద్వాపరాంతంలో కృష్ణుని చేత హతుడైన మహామల్లుడు చాణూరుడు ఆంధ్ర బ్రాహ్మణుడు. ఆనాటికాలంలో మల్లవిద్యలో అంతటివారు లేరు. అతడు దుష్టుడు కాడు. సహజంగా సజ్జనుడు. కానీ రాక్షసుడైన కంసుని చేతిలో ఓడిపోవటం వల్ల పందెం ప్రకారం అతని సేవకుడై భృత్య ధర్మం వల్ల కృష్ణునితో యుద్ధం చేశాడు. అలానే దక్షిణదేశంలో ఎందరో శారీరక విద్యలలో నిపుణులున్నారు. అయితే నీవన్నట్లు చలిదేశం కావటం వల్ల మనుషులకు ఎంత శ్రమ చేసినా అలసటరాదు. అందువల్ల ఎక్కువమంది బలవంతు లుంటారు.


వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి లోపల నుండి యువకుడు వచ్చాడు. “ఏం మాట్లాడుతున్నారు ? ఎప్పుడూ రణవిద్యల గురించేనా? హిరణ్యా! హరసిద్ధుడు సంగీత సాహిత్యములలో అద్భుత ప్రజ్ఞ కలవాడు. మంచి కవిత్వం కూడా చెపుతున్నాడు. ఇతడు దేవతా స్తోత్రాలు పాడుతుంటే పారవశ్యం కలుగుతుంది" అంటూ ఏదైనా ఒక పాటపాడమని అడిగాడు. హిరణ్మయి "మనం పూజ చేయటానికి వెళుతున్నాముగదా! క్షేత్రదేవత గురించి పాడితే బాగుంటుంది" అన్నది. అలాగే అని హరసిద్ధుడు ఒక శ్లోకం రాగయుక్తంగా పఠించాడు.


శ్లో || క్వణత్ కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా


ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనః పురమథితురాహో పురుషికా (శంకరాచార్య)


"త్రిపురసుందరియైన లలితాదేవిని గురించి గానం చేశారేమిటి? ఇక్కడి దేవత కాళి గదా!" అన్నది హిరణ్మయి. హరసిద్ధుడు "పూర్వకాలం శివుని కంటిమంటలో దహనమైన మన్మథుని లలితాదేవి దేవతల ప్రార్ధన మీద పునరుజ్జీవితుని చేసింది. ఆకృతజ్ఞతతో కాముడు కామేశ్వరియైన లలితను ఇక్కడ ప్రతిష్ఠించాడు. అయితే పాశాంకుశములు లేకుండా ఇక్షు చాప పుష్పబాణంబులతో కామదేవిగా స్థాపించి పూజించాడు. ఆమె కామదేవి. కాలక్రమాన ఆ దేవత కామాఖ్యకాళిగా మారింది. అందుకే ఆ కామేశ్వరిని స్తుతించాను.


యువకుడు - "నీవు చెప్పింది సత్యమే కావచ్చు. కానీ నీ కంఠం నుండి కాళీస్తోత్రం వినాలని ఉంది". హరసిద్దుడు - అలానే అని గొంతెత్తి కాళీదేవిని ఆవాహన చేస్తూ గానం చేశాడు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹




6 views0 comments

Comentários


bottom of page