top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 32 Siddeshwarayanam - 32

Updated: Apr 7, 2024




🌹 సిద్దేశ్వరయానం - 32 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵️ 5వ శతాబ్దం నుండి 🏵️


హిరణ్య- హర సిద్ద ఈ పాట వింటుంటే ఆర్తితో హృదయం ద్రవిస్తున్నది. ఇటువంటి అద్భుతమైన పాట ఎప్పుడూ వినలేదు.


యువకుడు - చెల్లీ ! నీవు కూడా మంచి గాయకురాలివి గదా! ఒకపాట పాడు.


హిరణ్మయి - అమ్మో! ఇప్పుడు కాదు. ఇంకోసారి ఎప్పుడైన పాడుతానులే. అందరూ ఇంటిలోకి వెళ్ళి దేవతా పూజలో పాల్గొని భోజనాలు చేశారు.


హరసిద్ధుడు ఇంటికి వెళ్ళాడు. అతని ఆహ్వానం మీద అన్నా చెల్లెళ్ళు వాళ్ళ యింటికి రాకపోకలు పెరిగినవి. హిరణ్మయి, హరసిద్ధుడు పరస్పరం ఆకర్షణకు లోనైనారు. అప్పుడప్పుడు ఉత్సవాల పేరుతో క్షేత్రదర్శనాల పేరుతో ఇతరప్రదేశాలకు కలసి వెళ్ళేవారు. సాన్నిహిత్యం పెరిగింది. అక్కడక్కడ నాగయువకుడు పనిమీద అవతలికో, బయటకో వెళ్ళినప్పుడు వారికి ఏకాంతం దొరికేది. ప్రేమ సంభాషణలు మొదలైనవి. అతనికి కొన్ని కొత్త విశేషాలు తెలిసినవి. ఆ అమ్మాయి నాగయువకుని సొంత చెల్లెలు కాదు. వరుస మాత్రమే. వాళ్ళ ఊరు చాలదూరం. క్షేత్రదేవతయైన కాళీదేవిని చూడటానికి పూజలు చేయించుకోటానికి తరచుగా ఇక్కడకు వచ్చేది. హరసిద్ధుడా అమ్మాయి మీద కవిత్వం చెప్పేవాడు. ఆ కన్య చాలా ఆనందించేది. పొంగిపోయేది. తాను కూడా మధురంగా మంజులంగా పాటలు పాడేది. అలా అలా ప్రేమ పెరిగింది.


హిరణ్మయి - హరసిద్ధా! నీ ప్రేమకు నేను వశమైపోతున్నాను. నన్నొకదేవతగా ఆరాధిస్తున్న నీ మహత్వాన్ని నేను అందుకోలేకపోతున్నాను.


హిరణ్మయి - మహావీరా! అంతమాట అనకండి. నేనే మీ పదాశ్రితురాలిని మిమ్ము విడిచి ఉండలేను. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా నాగయువకుడు వచ్చాడు. "హిరణ్యా! మీ యింటినించి వార్త వచ్చింది. పనియేదో ఉందిట. నిన్ను రమ్మన్నారు. నిన్ను తీసుకొని నన్ను కూడా రమ్మని తెలియజేశారు. అవును ! ఈసారి హరసిద్ధుని కూడా తీసుకువెళ్లామా?"


హిరణ్య - ఎలా ? నాన్నగారి అనుమతి కావాలి గదా!


నాగ - అది నేను చూచుకొంటాను. నా మిత్రునిగా వస్తాడు.


హిరణ్య -నీ యిష్టం నాకూ ఇష్టమే. కానీ జాగ్రత్త. నాకు భయంగా ఉంది.


నాగ - ఏమీ భయపడవలసిన పనిలేదు. అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. హరసిద్ధా! నీవు మాతో తప్పక రావాలి. హిరణ్య స్వస్థలంలో చాలా అద్భుతాలున్నవి. వాటిని నీకు చూపించాలని నాకు కోరికగా ఉంది.


హర - అలా అయితే నాకూ ఇష్టమే.


నాగ- మీ అమ్మా నాన్నలతో చెప్పిరా. రేపుదయమే ప్రయాణం.


మరునాడు ప్రాతఃకాలములో ముగ్గురూ ఒక రథం మీద బయలుదేరి ఊరిప్రక్కనే బ్రహ్మపుత్రానదీతీరంలోని కొండదగ్గరికి వెళ్ళారు. ఆ కొండ కొంత ఎక్కిన తర్వాత అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఒక గుహ ఉన్నది. దట్టంగా చెట్లుండటం వల్ల ఆ కొండలోని గుహ ఎవ్వరికీ కనపడదు. నాగయువకుడు ఆ కందరంలోకి దారితీశాడు. హిరణ్మయి నడిచింది. హరసిద్ధునకు ఆశ్చర్యం వేసింది. దూరంగా ఉన్న ఊరికి వెళ్ళవలసిన వాళ్ళు ఈ గుహలోకి దారితీస్తున్నా రేమిటి? అర్థం కాలేదు. అయినా ఏమీ అడుగకుండా వాళ్ళ వెంట నడిచాడు. గుహలో అలవాటు పడ్డవాళ్ళవలె వారు ముందుకు వెళ్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద శిలాఫలకం కనిపించింది. ఎదురుగా అంధకారం. ఆ ఫలకం మీద నిల్చున్నారు ముగ్గురు. అది కొంచెం ముందుకు కదలి వేగంగా భూమిలోకి వెళ్ళటం మొదలు పెట్టింది. చాలా సమయం పోయిన తర్వాత ఒక చోట ఆగింది. అక్కడ పెద్ద వెలుతురు అది సూర్యకాంతికాదు. చంద్రుని వెన్నెల కాదు. ఏదో ధగధగమని మణులు మెరిసినట్లుగా పెద్దవెలుగు అలరారుతున్నది. ఇంతలో వీళ్ళ దగ్గరకు సాయుధులైన రాజభటులు వచ్చారు.


వారి కవచములమీద శిరస్త్రాణముల మీద సర్పచిహ్నములున్నవి. వారు వచ్చి హిరణ్మయికి నమస్కారం చేసి వీరిని ముందుకు తీసుకువెళ్ళారు. రెండు నిమిషాలలో నాగాభరణాలంకృతలైన కన్యకాగణం వచ్చి రాజకుమారీ! లోపలకు దయ చేయండి అన్నారు. హిరణ్మయి నాగయువకునితో అన్నయ్యా! వీరికిక్కడి విషయాలు చెప్పి నీవు దగ్గరఉండి నాన్నగారి దగ్గరకు తీసుకురా! అని హరసిద్ధునివైపు స్నిగ్ధ వీక్షణములతో చూచి కదిలింది. నాగయువకుడు "మిత్రుడా ! ఈ పాటికి నీవు గ్రహించే ఉంటావు. ఇది నాగలోకం. హిరణ్మయి నాగరాజైన ఐరావతుని కుమార్తె. పెద్దల అనుమతి లేక ఇన్నాళ్ళు విషయం నీకు చెప్పలేదు. ఏర్పాటు చేయబడిన వసతికి వెళ్ళి అక్కడ నుండి మహారాజుగారి దర్శనానికి వెళదాము. వారి సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేను నీకు చెప్పవలసినపనిలేదు. నీవు ప్రతిభావంతుడవు. నాకూ అన్ని విషయాలు తెలియవు. కాని మనం ఊహించని కొన్ని కొత్తవి ఇక్కడ ప్రస్తావనకు వస్తవి. జాగ్రత్త!" అని వసతికి వెళ్ళి తయారైనారు. రాజప్రతినిధి ఒకరు సైనికులతో వచ్చి వీరిని చక్రవర్తి దగ్గరకు తీసుకువెళ్ళారు.


( సశేషం )


5 views0 comments

Comments


bottom of page