top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 33 Siddeshwarayanam - 33

Updated: Apr 9, 2024


🌹 సిద్దేశ్వరయానం - 33 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 5వ శతాబ్దం నుండి 🏵


రాజమందిరంలో ఒక పెద్దగది. పరిమిత సంఖ్యలో ముఖ్యులు సమావేశమైనారు. మహామంత్రి, సేనాపతి, కొందరు రాజ ప్రముఖులు మరికొందరు రుద్రాక్షమాలాధరులు దండకమండులువులు ధరించి ఫాలభాగముల పెద్ద కుంకుమబొట్లతో కూర్చున్నారు. మహారాజు, మహారాణి, వారితో పాటు యువరాణి హిరణ్మయి వచ్చారు. వారు రాగానే అందరూ లేచి నిలుచున్నారు. వారు కూర్చున్న తర్వాత మంత్రి హస్త సంజ్ఞమీద మిగతావారు ఆసీనులైనారు. నాగయువకుడు, హరసిద్ధుడు మంత్రి కూర్చోమన్నా కోర్చోలేదు. నిలుచునే ఉన్నారు. మంత్రి మహారాజు వైపు చూచి "ప్రభూ! తమ బంధువుల కుమారుడు ప్రాగ్జ్యోతిషపురం నుండి వచ్చాడు. మీకు తెలిసినవాడే! రెండవ యువకుని పేరు హరసిద్ధుడు. బ్రాహ్మణవంశంలో పుట్టాడు. కైలాస పర్వతం దగ్గర తల్లితండ్రులు మరణించటం వల్ల మనజాతి దంపతులు తెచ్చి పెంచి పెద్దచేశారు. యుద్ధవిద్యలలో ప్రధానంగా ఖడ్గవిద్యలో అద్భుతనైపుణ్యం సంపాదించాడు” అని పరిచయం చేశాడు. వెంటనే హరసిద్ధుడు సంప్రదాయం ప్రకారం గోత్రనామాలు చెప్పి మహారాజు దగ్గరకు పోగూడదు కనుక కొంతమాత్రమే సమీపానికి వెళ్ళి వంగి నమస్కారం చేశాడు. మళ్ళీ పూర్వస్థానానికి వెళ్ళి నిలుచుండి స్నిగ్ధ గంభీర కంఠంతో పలకటం మొదలుపెట్టాడు.


శ్లో || ఓం నమో నాగరాజాయ కరుణామృతవర్షిణే ఐరావతాయ త్రైలోక్య సంచారాయ నమోనమః


ఉ || దేవమనుష్యలోకముల త్రిమ్మరుచున్ విపుల ప్రతాపసం భావిత శక్తియుక్తుడు- అపార విషోత్కటకోపవిస్ఫురత్ పావకతాపితాఖిలవిపక్షుడు నైన మహానుభావుడై రావత చక్రవర్తి అహిరాణ్మణి నాకు ప్రసన్నమయ్యెడున్


చం॥ గురుకరుణావిలాపములు క్రోధభయంకరముల్ వినూత్నవి స్ఫురణ వికాసముల్ సమితి శోభనముల్ బహుచిత్రవర్ణ భా సురతర కుండలమ్ము లతి సుందరముల్ క్షరదంబు వాహ వి స్తరములు నాగరాజ విలసద్విభవంబులు సంస్మరించెదన్


ఉ ||జ్యోతిరుదగ్రముల్ వికట శోభనముల్ పటుదారుణారుణో లాతతిపుంజ పింజరచలాచల సంచలన ప్రభావ విఖ్యాతములాగ్రహోగ్ర సమయంబున అట్టి ఫణీంద్రు చంద్రికా శీతల శాంతదృష్టులు భజించెద తత్ కృపనాశ్రయించెదన్


ఈ విధంగా ప్రవహిస్తున్న కవితాగానానికి మహారాజుతో సహా సదస్యులంతా పరవశించారు. ఐరావతుని కన్నులలో చంద్రికాశీతల శాంతదృష్టులు ప్రసరించినవి. మహారాణి ప్రత్యేకంగా హరసిద్ధుని కరుణా వాత్సల్యంతో చూచింది. హిరణ్మయి ఒక క్షణం తలయెత్తి ప్రణయారాధన భావంతో వీక్షించి తలదించుకొన్నది. మహామంత్రి ఇలా పలికాడు. “హరసిద్ధా! నాలుగు నిమిషాలలో నాగసార్వభౌముని అభిమానాన్ని సంపాదించగలిగావు.


రాజదంపతులకు నీవు నచ్చావు. ఇప్పుడిక నీవు కూర్చుండి చెప్పేది వినటం ఉచితముగా ఉంటుంది అని, వారిద్దరినీ ఆసనములలో కూర్చుండ జేసి తన ప్రసంగమును సాగించాడు. "యువరాణి నీవు ప్రేమించుకొంటున్నారని మాకు తెలుసు. నీతో వచ్చిన యువకుడు రాజబంధువు, హిరణ్మయి రాజకుమారిగా తెలియకుండా ఊరువెళ్తూ వస్తూ ఉంటుంది. తెలిస్తే చుట్టూ అంగరక్షకులుండాలి. అమ్మాయికి అది ఇష్టం లేదు. అంతేకాక తానెవరో బహిరంగపరచటానికి, నీకు తెలియజేయటానికి రాజానుమతి లేదు. ఈ లోకంలోని వారికి, భూలోకంలోని కొందరికి ద్విరూపధారణ శక్తి ఉంది. అందువల్ల మా గూఢచారులు తోటలో పర్వత వన ప్రాంతాలలో నాగరూపంతో మిమ్ము గమనిస్తూనే ఉన్నారు. ఇతర స్థలాలలో దూరం నించి మానవ రూపాలతో పనివాళ్ళలాగా, పాంథులలాగా మిమ్ము పరిశీలిస్తూనే ఉన్నారు. రాజదంపతులకు అమ్మాయి అంటే చాలా ప్రేమ. గారాబంగా పెంచారు. ఆమె కోరింది కాదన లేరు. అయితే నీవు యోగ్యుడివా కాదా అనేది తేల్చుకోటానికి కొన్ని పరీక్షలు పెట్టాము.


మా సైన్యంలో ఖడ్గ విద్యానిపుణులు మీ యుద్ధ పాఠశాలలో విద్యార్ధుల రూపంలో వచ్చి నీతో స్నేహయుద్ధం చేశారు. వారందరినీ నీవు గెలిచావు. ఇక నీ వ్యక్తిత్వాన్ని గుణగణాలను పరిశీలింప జేశాము. ఉత్తమగుణయుతునిగా నిర్ణయించి ఈ విషయాలను మహారాజుగారికి విన్నవించాము. ఇప్పుడు కొన్ని అంశాలను మా పురోహితుడు నీకు తెలియజేస్తాడు.”


( సశేషం )


🌹🌹🌹🌹🌹


2 views0 comments

Commentaires


bottom of page