🌹 సిద్దేశ్వరయానం - 35 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
ఇంకొక గదిలో రహస్య సమావేశం జరిగింది. మంత్రి అనుమతితో పురోహితుడు మొదలుపెట్టాడు.
పురో- హరసిద్ధా! నీవు తపస్సు చేసి కాళీదేవి అనుగ్రహం సాధిస్తానన్నావు. నీవు చేయగలవు. కానీ దానికి దీర్ఘకాలం పడుతుంది. యుద్ధమేఘాలు ముంచుకొస్తున్నవి. కాబట్టి వేగంగా కార్యసిద్ధి కావాలి. దీనికి గురుకృప చాలా అవసరము. ఈ కాలంలో అంతటి సిద్ధగురువు మత్స్యేంద్రనాధుని శిష్యుడు గోరఖ్నాధుడు మాత్రమే. ఆ మహాపురుషుడు ఉజ్జయినిలో ఉన్నాడు. అక్కడకు మనం రహస్యంగా వెళ్ళాలి. బయటకు పొక్కితే శత్రువులు విఘ్నాలు కలిగిస్తారు. మంత్రిగారు ఇక్కడ నుండి కదలకూడదు. మనమిద్దరము వెళదాము. ఇంకెవరూ రాకూడదు. నీ మిత్రుడు స్వస్థలానికి వెళతాడు. వేదంలో ఒక నాగమంత్రం ఉంది.
ఓం నమోస్తు సర్పే భ్యో యేకేచ పృథివీమను యే అంతరిక్షే యేదివితేభ్య స్సర్వేభ్యోనమః - అంతరిక్షంలో చరించే మా సర్పయోగి ఒకడు ఈ రోజు రాత్రికి మనలను తీసుకువెళ్ళి రేపు ప్రొద్దుటికి ఉజ్జయిని చేరుస్తాడు. తరువాత సంగతి తరువాత.
మర్నాడు తెల్లవారేసరికి వారు ఉజ్జయినిలో ఉన్నారు. శిప్రానదిలో స్నానం చేసి మహాకాళుని దర్శించారు. శ్మశానం నుండి తెచ్చిన చితాభస్మంతో ఆ రుద్రునకు అభిషేకం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ పద్ధతి లేదు. అనంతరం మహాకాళమహిషి హరసిద్ధిదేవిని దర్శించారు. హరసిద్ధుడు తనపేరు - ఆ పేరు ఒకటిగా ఉండటం చూచి తండ్రి గారు ఏ పరమార్ధంతో ఆ పేరు పెట్టారో అనుకొన్నాడు. క్షేత్రదేవత - అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటియైన మహాకాళిని దర్శించారు. భట్టి విక్రమార్కుల వంటి వారికి దీర్ఘాయువు పరాక్రమాన్ని అజేయశక్తిని ప్రసాదించిన ఆ దేవతను పూజించి ప్రార్థించి అక్కడకు సమీపంలో ఉన్న భైరవుని మందిరానికి వెళ్ళారు. ఆస్వామికి మద్యం నివేదించి కంఠంలో పోస్తారు. ఎంత సమర్పించినా లోపలికి వెళ్తూ ఉంటుంది. కొంత మిగిల్చి ప్రసాదంగా ఇస్తారు.
మదవతీ రమణుడు అయిన ఆ కాళీ వల్లభుని పూజించిన తరువాత గోరఖ్నాధుని గుహలదగ్గరకు వెళ్ళారు. నాధ సంప్రదాయానికి ఆద్యుడైన మత్స్యేంద్రనాధుడు ఒకసారి భిక్షాటనం చేస్తూ ఒక యింటిముందు ఆగి "భవతి! భిక్షాందేహి” అన్నాడు. ఆ గృహిణి వచ్చి భిక్ష వేసింది. ఆమె ముఖంలో దైన్యాన్ని చూచి ఆ యోగీశ్వరుడు "అమ్మా! ఏదో వేదనలో ఉన్నావు. నీ వదనములో దుఃఖం కనిపిస్తున్నది. ఏమిటమ్మా అది?" అని అడిగాడు. ఆమె "అయ్యా! నాకు సంతానం లేదు. నలుగురు నన్ను గొడ్రాలంటుంటే తట్టుకోలేక పోతున్నాను అన్నది. అతడు "తల్లీ! నాకు భిక్ష పెట్టావు. నీకు సంతాన భిక్ష పెడుతున్నాను. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. మీ దంపతులు దీనిని స్వీకరించండి. మీకు బిడ్డ పుడతాడు" అని ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయినాడు. భర్త యింటికి వచ్చిన తర్వాత ఆమె యీ విషయం చెప్పి ప్రసాదం యిచ్చింది. అతనికి ఇటువంటి నమ్మకాలు లేవు. "బజారున పోయే ప్రతి బైరాగిని యోగి అని నమ్ముతావు. ఈ ప్రసాదం తీసుకొంటే సంతానం కలుగుతుందా?" అని దానిని తీసుకొని పక్కనే ఆవుపేడ వేసే పెంటకుప్పమీదికి విసిరేశాడు. భర్త నేమీ అనలేక గుడ్ల నీరు గుక్కుకొని ఊరుకుంది.
సంవత్సరం తరువాత మత్స్యేంద్రనాథ్ మళ్ళీ ఆ ఊరు వచ్చి ఆ యింటిముందు నిల్చుని "భవతి! భిక్షాం దేహి అన్నాడు." ఆమె వచ్చి భిక్ష వేస్తున్నది. “అమ్మా! నీ బిడ్డ యేడి" అన్నాడు. ఆ గృహిణి జరిగిన సంగతి చెప్పి క్షమించమని ప్రార్థించింది. ఆ యోగి పేడవేసే కుప్పదగ్గరకు వెళ్ళి “గోరఖ్ లేచిరా!" అన్నాడు. దానిలో నుండి ఒక బాలుడు లేచి వచ్చాడు. "అమ్మా! బ్రహ్మ రుద్రులమాట తప్పవచ్చు. కాని మత్స్యేంద్రనాథుని మాట తప్పదు. మీకు అదృష్టం లేదు" అని ఆ యోగి బాలుని తీసుకొని వెళ్ళిపోయి పెంచి పెద్ద చేశాడు. ఆ మహాత్ముని శిక్షణలో గోరక్షుడు నాథ సంప్రదాయ ప్రవర్ధకుడైనాడు. ఆ మహాయోగిశిష్యుడై విక్రమార్క చక్రవర్తి అగ్రజునిగా చెప్పబడే భర్తృహరి కూడా సిద్ధయోగి యైనాడు. (ఇతని సమాధి కాశీకి కొంచెందూరంలో ఉన్న చునార్ కొండలదగ్గర ఉంది. దీనిని ధ్వంసం చేయటానికి మొగల్ పాదుషా ఔరంగజేబు ప్రయత్నించాడు. సైనికులు గడ్డపారతో తవ్వుతుంటే సమాధిలోనుండి వందల వేల కందిరీగలు వచ్చి కుట్టినవి. విధ్వంసం సాధ్యం కాలేదు. ఈ సమాధి జోలికెవ్వరూ పోరాదు అని ఔరంగజేబు ఒక ఫర్మానా జారీచేశాడు. ఇప్పటికి కూడా ఆ సమాధి మందిరం దగ్గర ఫర్మానా ప్రతి కనిపిస్తుంది)
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments