top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 36 Siddeshwarayanam - 36


🌹 సిద్దేశ్వరయానం - 36 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 5వ శతాబ్దం నుండి 🏵


మహాపురుషుడు గోరఖ్నాథ్ తన గుహలో శిష్యులతో కలిసి ఉన్నాడు. మధుకైటభ సంహారకారిణి, రక్తబీజ వినాశిని యైన మహాకాళి దేవి అవతరించినరోజు కావటం వల్ల ఆ దేవి పూజ జరుగుతున్నది. పూజానంతరం దర్బారు సేవ ప్రారంభమైంది. చతుర్వేద పారాయణం, రామాయణ భారత భాగవత ప్రవచనం తర్వాత ప్రధానార్చకుడు కాళీదేవిని గూర్చి ఎవరైనా శ్లోకములు పాటలు పాడవచ్చునన్నాడు. ఎవరూ లేవలేదు. హరసిద్ధుడు లేచి నిల్చుండి కమనీయ కంఠంతో ప్రారంభించాడు.


శ్లో మత్స్యేంద్రనాధశిష్యాయ సాక్షాత్ కాళీ స్వరూపిణే సిద్ధానాం గురునాధాయ గోరక్షాయ నమోనమః


శ్లో ఆ రక్త జిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం


కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతంభజామి.


ఇలా కొన్ని శ్లోకాలు స్తుతులు పాడాడు.


ఎవరీ కొత్త యువకుడని అందరూ ఆశ్చర్యంతో చూచారు. మంత్రపుష్పం పూర్తియై అందరూ బయటకు వెళ్ళిన తర్వాత హరసిద్ధుడు గోరఖ్నాథ్ దగ్గరకు వెళ్ళి "భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వ జామదగ్న్య పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్ర: ఆపస్తంబ సూత్రః కృష్ణ యజుశ్శాఖాధ్యాయీ హరసిద్ధశర్మా అహంభో అభివాదయే" అని ప్రవర చెప్పుకొని సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ మహాయోగి వాత్సల్యంతో చూచి "హరసిద్ధా! నీ మధుర కవితాగానంతో మనస్సు స్పందిచేలా చేశావు. సంతృప్తి కలిగింది. "అని నాగపురోహితా! రా!- అంటూ పిలిచాడు. అతడు వచ్చి తాము వచ్చిన పని నివేదించాడు. గోరక్షుడు "మీరు చెప్పినది, రాక్షస భూమిలో జరిగిన ప్రయత్నాలు అన్నీ నాకు తెలుసు. మీకు నేను సహకరిస్తాను. ఎందుకంటే హరసిద్ధుడు సిద్ధాశ్రమయోగి. అతనిని గురించి మీరింతకుముందే తెలుసుకొన్నారు. దైత్యులను జయించటానికి కావలసిన శక్తిని సాధించటం చాలా రహస్యంగా జరగాలి. పాతాళంలో మైరావణుడు పూజించిన కాళిని ఆరాధించి వారు అద్భుత శక్తుల్ని పొందగలిగారు. అంతటి క్షేత్రం కామాఖ్య. కాని ఇతడు ఏ సాధన చేసినా మీ శత్రువులు తెలుసుకొంటారు. కనుక ఆ స్థలం కుదరదు. ఇప్పుడున్న పరిస్థితులలో కాళీదేవిని ప్రసన్నం చేసుకోటం సులభం కాదు. నేనొక ప్రణాళిక ఆలోచిస్తున్నాను. ఈ రోజు రాత్రి మొదలుపెట్టి మూడు రోజులు ఇక్కడి గుహలో ధ్యానం చేయాలి. ఆహార నిద్రాదులేమి ఉండకూడదు. హస్తమస్తక సంయోగంతో నా శక్తిని హరసిద్ధునిలోనికి ప్రవేశ పెడుతున్నాను.


శ్లో॥ పతంతుమూర్తి ప్రకృతాస్తరంగాః విద్యున్మయాద్యు స్థలశక్తి శృంగాః


తేజో విశేషాః పరితో విమోహాః తే వీర్యవాహాః మమదృక్సమూహాః


నాలుగవరోజు ఉదయం ఏమిజరిగిందో అతడు చెపుతాడు. దానిని బట్టి ఏం చేయాలన్నది నిర్ణయించబడుతుంది.” ధ్యాన రాత్రులు పూర్తి అయిన తర్వాత హరసిద్ధుడు గోరఖ్నాథుని సన్నిధికి వచ్చి గురువందనం చేశాడు. నాగ పురోహితుడు కూడా వచ్చాడు. గురు సూచన అందుకొని హరసిద్ధుడు జరిగినది నివేదించాడు.


"గురుదేవా! మీ ఆజ్ఞతో మీరుపదేశించిన సిద్ధగురుమంత్రాన్ని జపం చేస్తూ కూర్చున్నాను. కాసేపటికి హిమాలయాలలో టిబెట్ ప్రాంతంలోని ఒక గుహలో ఉన్నాను. ఎదురుగా వజ్రభైరవుని విగ్రహం ఉన్నది. దానిలోనుండి నాలోకి వైద్యుతశక్తి ప్రవహిస్తున్నది. విద్యాధర గంధర్వకాంతలు వచ్చి ఆ స్వామిముందు నాట్యం చేస్తున్నారు. వారందిస్తున్న మద్యాన్ని స్వీకరిస్తూ ఆయన ఆనందిస్తున్నాడు. తెల్లవారు జామున మళ్ళీ ఉజ్జయినీ గుహకు వచ్చాను. పగలంతా ఇక్కడే జపం సాగుతున్నది. రాత్రి మొదటి జాము కాగానే శ్రీశైలం మీద ఇంకొక గుహలో ఉన్నాను. అక్కడ అభౌతిక శరీరాలతో కొందరు యోగులున్నారు. వారు వాత్సల్యంతో దీవించారు. గుహ బయట శివలింగాకారంలో ఒక శిల ఉన్నది. దాని ముందు దీపాలు వెలుగుతున్నవి. ఆ శిల భైరవప్రతీక, బోయవారు కొందరు వచ్చి మేకలు నరికి బలియిస్తున్నారు. అక్కడ బలియిచ్చి నిద్ర చేస్తే ఆ రాత్రి భైరవుడు కలలో కనిపించి వరమిస్తాడట! మొదటిరోజు కనబడకపోతే రెండో రోజుమరొక మేకను బలియిస్తే ఆ రాత్రికి కనిపించి తీరతాడుట! ఆ రాత్రంతా ఆ గుహలో ఉండి మళ్ళీ పగలిక్కడ గడిపి మూడవ రాత్రి కుర్తాళంలో పొదిగై కొండల మీద గుహలో ఉన్నాను. ఎదురుగా ఉన్న చంపకాదేవిని సేవించి జలపాతం చూస్తూ నీళ్ళు పడుతున్నప్పుడు వినిపిస్తున్న నాదంలో మనస్సు లయం జేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్ళాను. జటాజూటధారి అగస్త్య మహర్షి దర్శనమిచ్చి అభయముద్రతో ఆశీర్వదించి నా శిష్యుడు భోగనాథుని దగ్గరకు వెళ్ళు మార్గదర్శనం చేస్తాడు అని పలికి అదృశ్యమైనాడు. తెల్లవారుజామున బయలుదేరుతుంటే కొందరు యోగులు వచ్చి ఆ జలపాతంలో స్నానం చేస్తున్నారు. ఇక్కడ భైరవుడు జలరూపంలో ఉన్నాడు. నీవుకూడా స్నానం చెయ్యి అనివారు నన్ను ఆదేశించారు. ఆ ప్రకారమే చేశాను. కాసేపటికి ఇక్కడ ఉన్నాను. ఆ భోగనాధుడెవరో నేనేమి చేయాలో నిర్దేశించవలసినదిగా ప్రార్థిస్తున్నాను."


( సశేషం )


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page