🌹 సిద్దేశ్వరయానం - 37 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
గోరఖ్ - హరసిద్ధా! భైరవ చైతన్యం జలపాత స్నానం వల్ల నీలోకి ప్రవేశించింది. నీవు వెళ్ళిన మూడుగుహలు నీ తపస్థానాలు. ఇదివరకు, ఇప్పుడు రాబోయే కాలంలోను నీ సాధన కేంద్రాలవి. ఇక భోగనాధుడు అగస్త్య మహర్షి శిష్యుడు. కుంభసంభవుడు కాశీనుండి కుర్తాళానికి చేరుకొన్న తరువాత, భోగనాధుడు, మరొక శిష్యుడు సుందర నాధుడు, హిమాలయాలకు వెళ్ళి సిద్ధత్వాన్ని సాధించారు. అనంతరం గురుదర్శనం కోసం ఇద్దరూ కుర్తాళం వెళ్ళారు. గురుదేవుని ఆజ్ఞతో భోగనాధుడు పళనికి వెళ్ళి మూలికలతో సుబ్రహ్మణ్య విగ్రహం తయారుచేసి ప్రతిష్ఠించాడు. సుందరనాధుడు గురుదర్శనం చేసుకొని కొన్ని పరిస్థితులలో ఒక మరణించిన వ్యక్తి శరీరంలోకి పరకాయప్రవేశ విద్యద్వారా ప్రవేశించి దానిలోనే ఉండి తేజశ్శరీరాన్ని పొంది ఆ వరమిచ్చిన నందీశ్వరునిపై మూడువేల తమిళ పద్యాలు రచించాడు.
ఇక భోగనాధుడు ప్రస్తుతం అక్కడ లేడు. అతడు అగస్త్యుని సేవించి ఆ మహర్షి అనుమతితో కాశీవెళ్ళి అక్కడ విద్యాగురువైన కాళంగినాధుని కోరిక మీద చైనాకు వెళ్ళాడు. అచట ఒక చైనీయుని శరీరంలోనికి పరకాయప్రవేశ విద్యద్వారా ప్రవేశించి బోయాంగ్ అనే పేరుతో వ్యవహరిస్తూ సిద్ధమంత్ర సాధనలను చేయిస్తూన్నాడు. నీవు ప్రస్తుతం అతని దగ్గరకు వెళ్ళి అతడు బోధించిన మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది.
నాగపురోహితా! మీరు సరాసరి ఉజ్జయిని నుండి చీన దేశానికి వెళ్ళండి. వసిష్ఠుడు కొంతకాలం క్రింద భారతదేశంలో మంత్రసిద్ధి కలగక చైనాలోని తారాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనానుగ్రహంపొందాడు. త్రేతాయుగంనాటి బ్రహ్మర్షి వసిష్ఠుడు కాడితడు. ఆ పేరుగల మరొక మహాయోగి. ఆ తారాదేవి ఆలయంలో బోయాంగ్ ఉన్నాడు. మీరక్కడకు వెళ్ళి ఆయనను ఆశ్రయించండి. మీరు చేరేలోపు నాసందేశం అతనికి అందుతుంది. కార్యసిద్ధి కలిగే విధంగా ఉజ్జయినీ మహాకాళి అను గ్రహిస్తుంది."
ఆ నాధయోగి చెప్పిన విధంగా వారు బయలుదేరి చైనా దేశానికి వెళ్ళారు. తారాదేవి ఆలయంలో బోయాంగ్ అయిన భోగనాధుని దర్శనమైంది. అతనిని చూస్తుంటే విలాసపురుషుడు, శృంగారప్రియుడు అయిన సుందర యువకునిగా ఉన్నాడు. సౌందర్యవంతులైన యువతులు చుట్టూ ఉన్నారు. ఒక తరుణిపాడుతున్నది. మరొక యువతి ఆడుతున్నది. ఒక చెలువ తాంబూలం ఇస్తున్నది. వీరినిచూచి బోయాంగ్ సాదరంగా ఆహ్వానించాడు. "కుర్తాళమునుండి గురుదేవుల ఆశీస్సులు పొంది వచ్చావు. హరసిద్ధా! గోరఖ్నాథ్ నీ సంగతి తెలియ జేశాడు. సంతోషం, ఇది సంధ్యా సమయం, ఇక్కడి దేవీపూజ చూచి ప్రసాదం తీసుకొని వెళ్ళండి. అతిథి మందిరంలో మీకు విశ్రాంతి ఏర్పాటు చేయబడింది. రాత్రి 12 గంటలకు మా శిష్యుడు నా రహస్యమందిరానికి మిమ్ము తీసుకు వస్తాడు. అక్కడ నీ కర్తవ్య మార్గం తెలియజేయబడుతుంది.”
అర్ధరాత్రి నాగపురోహితుడు, హరసిద్ధుడు ఒక ఏకాంత మందిరానికి తీసుకొనిపోబడినారు. లోపలకు హరసిద్ధుడు మాత్రమే అనుమతించ బడినాడు. ద్వారములు మూయబడినవి. చీకటిగా ఉన్న ఆ మందిరంలో పెద్దగది. దానిలో వేదిక మీద భైరవుని విగ్రహం ప్రకాశిస్తున్నది. ఆ వెలుగు సూర్యకాంతికాదు. చంద్రకాంతి కాదు. అగ్ని తేజస్సు కాదు ఏదో తెలియని దీధితి. బోయాంగ్ పలుకుతున్నాడు “హరసిద్ధా! ఈ విగ్రహము శిలావిగ్రహం మాత్రమే అనుకోవద్దు. జీవద్విగ్రహమిది. ఒకసారి దీనిని స్పర్శించటానికి అనుమతిస్తున్నాను. "దేవా! భైరవా! ఈ యువకుడు ధర్మ వీరుడు కావటానికి అవసరమైన శక్తిని పొందటానికి వచ్చాడు. ఇతనిని అనుగ్రహించు" అని యువకునివైపు చూచాడు. అతడు కదలి దగ్గరకు వెళ్ళి తాకాడు. ఒళ్ళు జల్లుమన్నది. ఒక క్షణం శిల అనిపించింది. మరుక్షణం మానవ స్పర్శ. శరీరమంతా విద్యుత్తరంగాలతో పులకించింది.
బోయాంగ్ "ప్రస్తుతానికిదిచాలు. రా" అన్నాడు. ఇప్పుడా విగ్రహం మామూలు రాతి విగ్రహంగా భాసిస్తున్నది. "హరసిద్ధా! నాగజాతి నీ నుండి ఆశిస్తున్నది సాధించాలంటే సామాన్యం కాదు. జంతుబలులు, నర బలులు ఇచ్చి కాళీదేవినుండి ఘోర శక్తులు సాధించిన రాక్షసులను శక్తిహీనులను చెయ్యాలంటే కాళీదేవి వారి వైపు ఉండకూడదు. దానిని చేయగలవాడు కాళీప్రియుడైన భైరవుడు మాత్రమే. ఆ స్వామి నీ వైపు నిల్చుంటే కాళీదేవి ఆగుతుంది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments