🌹 సిద్దేశ్వరయానం - 38 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
కాలభైరవమంత్ర సాధన చేయాలి. స్త్రీ పురుషులిద్దరూ భైరవ మంత్రజపం చేయాలి. దీనివల్ల సంతృప్తుడైన భైరవుడు నీకు దివ్య శక్తులిస్తాడు. అధర్మాన్ని జయించటానికి తప్పనిసరి పరిస్థితిలో దీనిని అనుసరించ వలసి వస్తున్నది. దీనిని ధర్మసూక్ష్మం అని గాని మహాధర్మమని గాని చెప్పవచ్చు. దీనికి ధర్మ విరుద్ధం కాని మార్గం నేను చెపుతాను. దానిని నాగ పురోహితుడు కూడ వినాలి." అని అతనిని పిలిపించాడు బోయాంగ్. “నాగయాజీ! మీరు శుక్రాచార్యుని వంశం వారు. చాలా యజ్ఞాలు చేశారు. చేయించారు. కనుక ఈ పేరు సార్థకమైనది. ఇతడూ భార్గవుడే. చ్యవనుని నుండి వచ్చిన వాడు. మీరూ కవి నుండి వచ్చిన వారు. కవి, చ్యవనుడు ఇద్దరు భృగుపుత్రులే. అది అలా ఉంచి రాక్షసులలో ఒక అత్యంత రహస్య ప్రయత్నం జరుగుతున్నది. అసుర మాంత్రికులు తమ సర్వ శక్తులు వినియోగించి ఒక దైత్య కన్యలో కాళీదేవిని ఆవాహనం చేస్తున్నారు.
సాక్షాత్తు మహాకాళి ఆమెను ఆవహిస్తున్నది. మీతో జరగబోయే మహాయుద్ధంలో అత్యవసర సమయంలో ఆమెను రణరంగానికి తీసుకువస్తారు. ఆమె దిగంబర ముక్త కేశ. చంపబడిన వారి బాహువులను నడుముకు కాంచికగా ధరించి ఉంటుంది. ఆమె నోటిలోనుండి మంటలు వస్తుంటవి. ఆమె చేతులలోకి వాటంతట అవి ఖడ్గశూలాదులు వస్తుంటవి. వాటితో ఆమె మీ సైన్యమును సంహరిస్తూ ఉంటుంది. మీ ఆయుధములు ఆమె మీద పనిచేయవు. ఆమె అజేయ పరాక్రమ. ఆమెకు సమరములో హరసిద్ధుడు కూడ చాలడు. హరసిద్ధునిలో భైరవుడు వచ్చినిలుచుంటే అతడు భర్త గనుక ఆమె యుద్ధం ఆపుతుంది. కనుక హరసిద్ధుడింక సిద్ధ భైరవుడు కావాలి. ఇక్కడి భైరవస్పర్శతో ఆ కార్యక్రమం మొదలైంది. భైరవుడు యుద్ధవీరుడు కూడా. పూర్వం నరకాసురుడు చేసిన సాధనలను గూర్చి మీరు వినే ఉంటారు.
కాళీదేవి అతనికి నిత్యయౌవనాన్ని, మహత్తర పరాక్రమాన్ని ఇచ్చింది అయితే రాజకన్యలను బలవంతంగా తెచ్చి మానభంగం చేసిన పాపానికి, ఇతర దుష్కృత్యాలకు శ్రీకృష్ణుని వలన సంహరించబడినాడు. ఇక్కడ ఆ సాధన మార్గము వరకు తీసుకోవాలి. కాళీ మంత్రం బదులు భైరవ మంత్రంతో చెయ్యాలి. దానికి కూడా అధర్మ మార్గం అక్కరలేదు. రాజకుమారి హిరణ్మయితో ఈ సాధన చేయవచ్చు. ధర్మయుక్తం కావటం కోసం వీరిద్దరి పెండ్లి చేయండి. కానీ ఈ వివాహ విషయం బయటకు పొక్కితే రాక్షసులు వెంటనే యుద్ధానికి వస్తారు. అలావస్తే మీరు తట్టుకోలేరు. కనుక కొద్ది రోజులలో కామాఖ్యలో కాళీ ఉత్సవాలు జరుగుతవి. అప్పుడప్పుడు మీ రాజుగారికి సకుటుంబంగా వెళ్ళి వాటిని వైభవోపేతంగా చేయించటం అలవాటే గదా! ఈ సారి అలానే వెళ్ళండి.
రహస్యంగా అక్కడి మీ భవనంలో కళ్యాణం చేయించండి. ఉత్సవాలు కాగానే మీరు రాజధానికి వెళ్ళవచ్చు. రాజకుమారి మీతోరాదు. తన భర్తయైన హరసిద్ధునితో రహస్యంగా హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ సామాన్య మానవులు వెళ్ళలేని ఒక భైరవాలయం ఉన్నది. మహా సిద్ధుడైన మత్స్యేంద్రనాథుడు నిర్మించి ప్రతిష్ఠించిన భైరవవిగ్రహం ఆ మందిరంలో ఉంది. ఆ దేవుని వాహనమైన శ్వానరాజు స్వర్ణ విగ్రహమై గుడిలో రక్షకునిగా ఉన్నాడు. (ఇటీవల ఆ స్వర్ణవిగ్రహం దొరికితే భక్తులు దలైలామాకు తెలియబరిచారు. ఆయన దానిని అక్కడే ఉంచి పూజించమన్నారు. చైనా ప్రభుత్వం టిబెట్ను ఆక్రమించిన తరువాత అది యేమైనదో? ఒక చైనా సైనికుడు ఆ విగ్రహంలోకి తుపాకి బాయినెట్ గ్రుచ్చగా దానిలోనుండి నెత్తురుకారింది. ఎంత పని చేశావురా దుర్మార్గుడా! అని మాటలు వినిపించినవి. ఆ భటుడు మరణించాడు వెంటనే. ఇక దాని జోలికెవ్వరూ పోలేదు. ఆ గుడిని బౌద్ధులు బుద్ధుని ఆలయంగా పిలుస్తున్నారు. భోజారానాథ్ అన్నది టిబెట్ వారు పిలిచే పేరు. నాథ సంప్రదాయ చిహ్నం) భోజారనాధుని ఆలయంలో హిరణ్మయీ హరసిద్ధులు భైరవతంత్రం అనుష్ఠించాలి. ఆ పద్ధతులు నీకు నేను ఉపదేశిస్తాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments