🌹 సిద్దేశ్వరయానం - 39 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
మహనీయులైన సిద్ధాశ్రమయోగులు నీ యందు అనుగ్రహంతో ఉన్నారు. కనుక నీకు త్వరలోనే భైరవానుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు మీరిద్దరూ భైరవునికి నమస్కరించండి. మీరు బయలుదేరవలసిన సమయం వచ్చింది. ఆ విగ్రహం చూచినపుడు మీకేమి కనిపిస్తున్నదో అనిపిస్తున్నదో చెప్పండి అన్నాడు బోయాంగ్. విగ్రహం జీవశక్తి గల దివ్యమూర్తిగా కనిపిస్తున్నది అన్నాడు నాగయాజి. హరసిద్ధుడు "గురువర్యా! విగ్రహంలోని జీవశక్తిని ఇదివరకే నాకు నిరూపించి చూపించారు. ఇంతకు ముందు కనిపించనిది భైరవుని చేతివ్రేలికి వజ్రం పొదిగిన అంగుళీయకం కనిపిస్తున్నది. ఆ వజ్రకాంతి ధగధగలాడుతున్నది” అని పలికాడు. తనకటువంటిదేమీ కనిపించటం లేదన్నాడు నాగయాజి. బోయాంగ్" ఆ ఉంగరం నాకు తప్ప ఎవరికీ ఇంతవరకు కనిపించలేదు. నీకు కనిపించిందంటే రాబోయే విజయానికి సూచన. ఆ ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను. దానిని ధరిస్తే నీవు వజ్రోలీ సిద్ధుడవవుతావు అని దానిని బహూకరించాడు.
నాగయాజి, హరసిద్ధుడు ఆ రాత్రే బయలుదేరి ప్రాగ్జ్యోతిషపురం చేరారు. హరసిద్ధుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పవలసినంత వరకు చెప్పి మానసికంగా సిద్ధం చేశాడు. నాగచక్రవర్తి సంబంధం- వివాహం - రహస్యంగా ఉంచవలసిన అవసరం తెలిపి ఒప్పించాడు. నాగపురోహితుడు రాజధానికి వెళ్ళి మహారాజుకు అన్ని విషయాలు విన్నవించాడు. ఐరావతుడు అంగీకరించాడు. భార్యను కూతురిని పిలచి విషయం తెలియజేసి గోప్యంగా ఉంచాలని ఆజ్ఞాపించాడు. తమ జాతిరక్షణ కోసం చేసే మహత్తర ప్రయత్నం గనుక రాణి సరేనన్నది. హిరణ్మయి తమ ప్రేమ సఫల మవుతున్నందుకు తమ జాతి గౌరవాన్ని నిలబెట్టేందుకు తానొక ఉపకరణ మవుతున్నందుకు ఆనందంతో పొంగిపోయి ఇష్టదేవతయైన కాళీమాతకు నమస్కారాలు సమర్పించుకొంది. అంతా అనుకొన్న ప్రకారమే జరిగింది. రహస్యంగా వివాహం జరిగింది.
రాజకుటుంబం, మంత్రి పురోహితులు వెళ్ళిపోయినారు. హరసిద్ధుని తల్లిదండ్రులు కొడుకు కోడళ్ళకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు. యాత్రికుల వేషాలలో రాజకుమారి చెలికత్తెలు, రాజభటులు కొద్దిమంది మాత్రం ఉన్నారు. ఆ రోజు రాత్రి ఆంధ్రదేశం నుండి వచ్చిన యాత్రికులలో కొందరు నాట్య నాటక ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పార్వతీ పరిణయం నాటక మాడుతున్నారని ఈ దంపతులు సామాన్య వేషాలతో ఒక ప్రక్కన దూరంగా కూచున్నారు. పరివారం కూడా తగు జాగ్రత్తలతో ఉన్నారు. రంగస్థలం మీదకి తెరలో ఒక ప్రక్కనుంచి సోది చెప్పే ఒక కోయస్త్రీ వచ్చింది. రెండో ప్రక్కనించి పార్వతి - కన్నెపిల్లగా వచ్చి చేటలో బియ్యం పోసి ప్రశ్న అడిగింది. తనకు పెండ్లి ఎప్పుడవుతుంది? వచ్చే మొగుడు ఎలాంటి వాడవుతాడు" అని కోయవనిత ఒక కర్రపుల్ల చేతిలో పట్టుకొని రెండోవైపు పార్వతిని పట్టుకోమని చెప్పటం మొదలు పెట్టింది.
పార్వతి - ఎవరో ఒక గొప్ప యోగి మొగుడవుతాడన్నమాట! ఇలా ఆ వీధి నాటకం పండిత పామర రంజకంగా సాగింది. నూతన దంపతులు ఇదేదో మన కథవలె ఉంది. మన జీవితాలకు అన్వయిస్తున్నది అనుకొన్నారు. మరునాడుదయం ఉషఃకాలంలో బయలుదేరి దుర్గమారణ్య మార్గాలలో పెద్ద శ్రమ లేకుండా కొద్ది పరివారంతో త్వరలో కైలాస పర్వత ప్రాంతం చేరుకొన్నారు. పవిత్రమైన మానస సరస్సులో స్నానం చేసి కైలాస పర్వత పరిక్రమ చేసి హరసిద్ధుడు పితృదేవతలను స్మరించి తీర్థ క్షేత్ర విధులు నిర్వహించి ఖోజార్నాధ్ ఆలయం చేరుకున్నారు. సాధనకు కావలసిన సమస్త ద్రవ్యాలు ఏర్పాటు జరిగింది. పరివారం వచ్చేప్పుడు దూరం నుంచి శంఖమూదుతారు. అలానే అవసరమయితే హరసిద్ధుడు శంఖనాదం చేస్తాడు. ఇబ్బంది లేకుండా అంతా ప్రణాళికాబద్ధంగా నిర్మాణమైంది. ఎవరూ ఆ ప్రాంతాలకు రాకుండా మహాసర్పముల రూపంలో భటులుంటారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments