🌹 సిద్దేశ్వరయానం - 4 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🌹సిద్దేశ్వరయానం 🌹
🏵️ ద్వాపర యుగం 🏵️
Part-4
జైగీషవ్యుడు నాగజాతిలో జన్మించాడు. పెరిగి పెద్దవాడవుతున్నప్పటి నుండి పూర్వజన్మ సంస్కారబలం వల్ల సిద్ధసాధువుల యందు ఆసక్తి ఎక్కువగా ఉండేది. మహర్షుల ఆశ్రమాలకు, దివ్యక్షేత్రాలకు ఎక్కువగా తిరుగుతూ అక్కడి పెద్దల మాటలు వింటూ భగవద్ధ్యానం చేస్తుండేవాడు. సిద్ధులను, క్షేత్రాలను పట్టుకొని తిరుగుతూ ఉండడం వల్ల అతనిని సిద్ధనాగుడనేవారు. ఆ కాలంలో నాగజాతి నివాసాలు ఎక్కువగా బ్రహ్మపుత్రానదీ తీర ప్రాంతంలో, 'ఇక్షుమతి' నదిఒడ్డున, కురుక్షేత్రంలో, దక్షిణాపధం లోని కొన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉండేవి. గంగానది యొక్క ఉత్తర భాగంలో శక్తిమంతమైన నాగరాజ్యం ఉండేది. ఐరావత, ధృతరాష్ట్రాది వంశాలకు చెందిన నాగజాతివారు అక్కడ ప్రభువులుగా ఉండేవారు. ప్రసిద్ధమైన ఖాండవవనం నాగుల అధీనంలోనే ఉండేది. క్రొత్త స్థలాలు చూడాలన్న కోరికతోను బంధువర్గంవారు తెలిసినవారు తమ జాతికి చెందినవారు విస్తరించి ఉండటం వల్లను సిద్ధనాగుడు సంచారం చేస్తూ అనేక ప్రదేశాలకు వెళ్ళాడు. ఆ యాత్రలో భాగంగా ఒకసారి గంగాతీరంలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి వాతావరణం ఎంతో నచ్చింది. ఆ రోజుల్లో ఋషుల ఆశ్రమాలకు వెడితే ఆతిధ్యానికి ఏ లోటూ ఉండేది కాదు. ఎంతో ప్రేమతో ఆహార వసతులు ఏర్పాటు చేసేవారు. అక్కడ కొన్నాళ్ళుండగా ఒక రోజు భృగువంశీయుడైన పరశురాముడు అక్కడకు వచ్చాడు. ఆ ఆశ్రమాధిపతి ఆయన శిష్యుడు కావటం వల్ల గురువుగారికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజ చేసి, గౌరవమర్యాదలతో తమ ఆశ్రమంలో వీలయినంతకాలం ఉండమని ప్రార్థించాడు. ఆ మహాపురుషు డంగీకరించి ఏదో గ్రంథరచన చేయటం ప్రారంభించాడు. ఆయనను గురించిన కొన్ని విశేషాలు ఆశ్రమ వాసులద్వారా సిద్ధనాగుడు తెలిసికొన్నాడు.
రామాయణకాలం నుండి జీవిస్తూ చిరంజీవిగా ఉన్న ఆ మహర్షి ఇటీవల తన శిష్యుడైన భీష్ముని చేతిలో విధి వశాన పరాజితుడై పూర్తి వైరాగ్యం కలిగి వెడుతూ ఇటువైపు వచ్చాడట. సర్వక్షత్రియ సంహారం చేసిన మహావీరునిగా జగత్ప్రసిద్ధుడైన ఆ మహానీయుడు తనలోని వైష్ణవతేజస్సు దశరధరామునిలో ప్రవేశించిన తరువాత ఆ మహత్వము తగ్గినా ఆయన సర్వ శస్త్రాస్త్ర కోవిదుడే. దేవజాతికి చెందిన వసువులు తమవాడని భీష్మునకు సహాయం చేసినందువల్ల మానవశరీరంలోని ఈ మహానీయుడు అపజయాన్ని అంగీకరించవలసి వచ్చింది. “శిష్యాదిచ్ఛేత్ పరాజయం" అన్నారు కనుక దానికి పరశురాముడు బాధపడలేదు. అయితే, లోకంలో తన పాత్ర యొక్క అవసరం తీరిపోయిందని గ్రహించిన ఋషివర్యుడు లోకోపకారం కోసం ఒక మంత్రశాస్త్ర గ్రంథాన్ని రచిస్తున్నాడు. ఆ విషయం విన్న సిద్ధనాగునకు ఆయనకు సేవచేసి ఆ రహస్యాలు నేర్చుకోవాలన్న ప్రబలమైన కాంక్ష కలిగింది. ఆయన శిష్యులను ప్రార్ధించి కొన్ని సేవలు చేయటానికి అనుమతిని పొందాడు. ఆయనకు కావలసిన వస్తువులు పూలు, పండ్లు, పాలు మొదలైనవి నిత్యాగ్ని హోత్రములకు కావలసిన సమిధలు మొదలైనవి సమకూరుస్తూ రోజూ సాష్టాంగ దండప్రణామాలు చేస్తూ దూరంగా చేతులు కట్టుకొని నిల్చుండేవాడు. నిశిత మేధా సంపన్నుడయిన భార్గవుడు ఇతని సేవలను గ్రహించి ఆదరాన్ని చూపిస్తున్నాడు. కొంతకాలం గడచిన మీదట ఆయన కితని మీద వాత్సల్యం కలిగింది. గ్రంథరచన పూర్తిచేసి ఆశ్రమం విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు సిద్ధనాగుని పిలిపించాడు. అతడు వచ్చి సాష్టాంగ దండప్రణామం చేసి నిల్చొన్నాడు.
పరశు : యువకుడా ! నీ సేవలు గమనిస్తున్నాను. నీ భక్తి శ్రద్ధలను నిర్మల మయిన నీ వినయసౌశీల్యాలను నేను తెలుసుకొన్నాను. ఏమి కోరి నా సేవచేశావు ? నీ కేమి కావాలి ?
సిద్ధ : ఋషివల్లభా ! బ్రాహ్మ్యము, క్షాత్రము మూర్తీభవించిన అవతార పురుషులు మీరు. మీ వంటి మహనీయుల సేవచేసే అవకాశం కల్గటం నా జన్మాంతర సుకృతం. మిమ్ము చూడగానే కారణము తెలియని భక్తిగౌరవములు నాకు కల్గినవి. నేను ఏ ప్రతి ఫలము ఆశించి సేవచేయలేదు. దయాభరితమైన మీ అనుగ్రహాన్ని నా యందు ప్రసరింప చేయండి ! చాలు.
పరశు : ఓయీ నీ మాటలు మరింతగా నా మనస్సును ఆకట్టుకొన్నవి.నాకు చేసిన సేవ ఎన్నడూ వ్యర్థం కారాదు. నే నివ్వగలిగిన దేదైనా నీవు కోరుకో. అయితే ఒక నిబంధన ఉన్నది. నా దగ్గర అస్త్రవిద్యలున్నాయి. బ్రాహ్మణేతరులకు వానిని ఉపదేశించను. నా చరిత్ర గురించి నీవు విని ఉంటావు. నా జీవిత అవసరాలను బట్టి అటువంటి నియమము ఏర్పరచుకోవలసి వచ్చినది. కనుక అవికాక ఇంకేదైనా నీవు అర్థించవచ్చు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentários