🌹 సిద్దేశ్వరయానం - 40 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
ఆలయంలోకి వెన్నెల ప్రసరిస్తుంది. పున్నమివేళ హిరణ్మయీ హరసిద్ధులు దీక్షాధారణ చేసి భైరవ తంత్రప్రక్రియ ప్రారంభించారు.ఎన్నిరోజులు - ఎన్నిరాత్రులు - ఎన్ని పగళ్ళు - లెక్కలేదు. పారవశ్యంలో మహాభావస్థితి వస్తున్నది. పశుభావం - వీరభావం - దివ్యభావం క్రమక్రమంగా మహోన్నతస్థితికి నిచ్చెనలు వేస్తున్నవి.
కృష్ణచతుర్దశి - మాసశివరాత్రి వచ్చింది. ఎందుకో హిరణ్మయి కండ్లు మూతలు పడుతున్నవి. ఇంతలో ఎవరో ఆమెలోకి ప్రవేశించినటులైంది. కనులు తెరచిన ఆమెలో నుండి మెరుపులు వస్తున్నవి. కండ్లు మిలమిలా మెరుస్తున్నవి. అతడాశ్చర్యంతో చూచాడు. చేతి భైరవ వజ్రాంగుళీయకాన్ని కన్నుల కద్దుకొన్నాడు. "హిరణ్యా! ఏమిటీ వింత " అన్నాడు. “నేను డాకినిని” అని ఆమె గళం పలికింది. అతడాశ్చర్యంతో ఆగి “ఇదేమిటి? నా భార్యలోకి ఎలా ప్రవేశించావు ? ఎందుకు? తప్పుకదా!" అన్నాడు. ఆమె హిరణ్మయిలో నుండి బయటకు వచ్చి తన దివ్యరూపంతో నిలుచున్నది. హిరణ్మయి సుప్తస్థితిలోకి వెళ్ళింది.
“సిద్ధభైరవా ! భైరవాజ్ఞ వల్ల నేనీమెలోకి ప్రవేశించాను. నేను వజ్రవైరోచని యుద్ధసఖిని. కైలాస పర్వతమార్గం దగ్గర ఉన్న శ్మశానానికి నేను అధికారిణిని. నీవు పూర్వజన్మలో నా భూమిలో తపస్సు చేశావు. అప్పుడు నీవు కోరిన వరములిచ్చాను. నేను క్రోధభైరవిని. అడుగో భైరవస్వామి వచ్చాడు. ప్రత్యక్షముగా నిలుచున్నాడు. నిన్ను అనుగ్రహిస్తున్నాడు అని భైరవుని ప్రక్కన నిలుచున్నది.
భైరవుడు “వీరుడా! మీ సాధన పూర్తి అయింది. డాకిని పలికినట్లు ఇప్పటి నుండి నీవు సిద్ధభైరవుడవు. నా అనుచరుడవు. నీలో నేనుండి రాబోయే యుద్ధంలో నిన్ను గెలిపిస్తాను. దానికి కావలసిన అస్త్రశస్త్రములను, ప్రయోగోప సంహారాలను రేవు అమావాస్య నాడు ఈ డాకిని నీకుపదేశిస్తుంది” అంటుండగానే హిరణ్మయి మెలకువ వచ్చి లేచి నమస్కరించి భర్త పక్కననిలుచున్నది. "అమ్మా! నీవు యోగినివి. నాగజాతికి విజయశ్రీని తెచ్చి పెట్టటానికి ఎంపిక చేయబడినదానివి. ఈ విజయానంతరం కొన్నాళ్ళు సుఖంగా ఉంటారు. కవిగా ఇతడు శాశ్వతంగా కావ్యాలు సృష్టిస్తాడు. "అని పలికి భైరవుడు ఎదురుగా ఉన్న విగ్రహంలోకి లీనమైనాడు. డాకిని మరునాడు భైరవాజ్ఞను నెరవేర్చింది.
(డాకిని గూర్చి గణపతిముని చేసిన వర్ణన -
శ్లో॥ చండచండి ! తవయుద్ధ వయస్యా యోగి వేద్య నిజవీర్య రహస్యా చేతసశ్చభుజయోశ్చ సమగ్రం దాకినీ దిశతుమేబలముగ్రం
హిమాలయాలలో డాకినులు కనిపించకుండా సంగీతం వినిపిస్తుంటారు. పాశ్చాత్యులెందరో పరిశోధనకు వచ్చి ఈ గానం విన్నామని తమ గ్రంథాలలో వ్రాశారు. వీరిని అద్భుత సౌందర్యంతో విరాజిల్లే వీరవనితులుగా యోగులు వర్ణించారు. ఈమె తోటి సఖివర్ణిని విద్యాదేవతగా ఛిన్నమస్తా తంత్రంలో చెప్పబడింది.
చం|| హిమగిరిలో త్రివిష్టపము హేరుక నాథుడు నాట్యమాడుచున్ డమరుక నాదముల్ సలుపు డాకినులద్భుత గానమోహినుల్
భ్రమలను ముంచు చుందురట పాంథులవారి నుతించి కొల్చితిన్ కొమరుగ వజ్రభైరవుని కోరి భజించితి క్రోధకాళికన్
హిమాలయములు ఋషులకే కాదు. అనేక రహస్య విద్యలకు నిలయము. శాంబర విద్యాకేంద్రములెన్నో అక్కడ ఉన్నవి. సర్పవృశ్చిక సింహ వ్యాఘ్ర వరాహాది వశీకరణములు, వివిధ జంతురూప ధారణములు మొదలైన విద్యలు నేర్చిన వారెందరో ఉన్నారు.)
“సిద్ధభైరవా! మహాప్రభువు ఆజ్ఞననుసరించి మీ దంపతులను సపరివారంగా ప్రాగ్జ్యోతిషం చేరుస్తాను. నేనింతటితో నిన్ను విడిచి పెట్టను. నీవింకా నేర్వవలసిన సిద్ధవిద్యలు చాలా ఉన్నవి.ప్రస్తుత కర్తవ్యం పూర్తి అయిన తరువాత నీ దగ్గరకు వస్తాను” అని డాకిని చెప్పి వారిని తన దివ్యశక్తితో కామాఖ్య కాళి ఆలయం దగ్గరకు చేర్చి అదృశ్యమైంది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Commentaires