🌹 సిద్దేశ్వరయానం - 44 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
హరసిద్ధుడు ఒక పూట ముందు బయలుదేరి ఇంటికి వెళ్ళి పెంపుడు తల్లిదండ్రులతో గడిపి రాత్రి కామాఖ్య కాళీమందిరంలో రాజవసతి స్థలంలో ఉన్నాడు. మొదటి జాము గడచి అర్ధరాత్రి అవుతున్న సమయంలో గదిలో ఏకాంతంగా ఉన్న ప్రశాంతవేళ మధురగానం దూరం నుంచి వినిపిస్తున్నది. నెమ్మదిగా దగ్గరవుతున్నది. ఎవరో తనను పిలుస్తున్నారు.ఆ నాదం మూసిన తలుపులలో నుండి కాంతి తరంగాల రూపంలో లోపలికి వచ్చింది. చూస్తుండగా సుందరమైన ఆకృతి ధరించింది. తనకు అస్త్రవిద్యలు నేర్పిన డాకిని, "మహాయోగినీ! దివ్యవిద్యాధరీ! స్వాగతం" అని లేచి హరసిద్ధుడు ఆహ్వానించాడు. ఆమె “హరా! నిన్ను చూచి సంతోషంగా ఉంది. కార్యార్థివై ఆంధ్రభూమికి వెళుతున్నావు. విజయం సాధించటానికి ప్రయత్నించు" అన్నది. అతడు "దేవీ! నీవు గాన గాంధర్వివి. నా యందు దయ, ప్రేమ కలదానివి. నేను దక్షిణ భారతానికి వెళ్ళి మరొక యుద్ధం, మారణకాండ జరగకుండా శాంతి నెలకొల్పాలని కోరుతున్నాను. నాకు యుద్ధవిద్యలలో ఉన్న నైపుణ్యం మంత్ర విద్యలలో లేదు. నీవు దివ్యాంగనవు. నా కోసం ఈ పని చేసి పెట్టు. నేను పుట్టిన తెలుగు నేలకు ఋణం తీర్చుకొంటాను” అన్నాడు.
డాకిని "వీరాగ్రణీ! నీకు తప్పక చేస్తాను సహాయం. నాకు కూడా నీ వల్ల మేలు జరిగింది. నీకు అస్త్రవిద్యలలో నైపుణ్యం కలిగించినందుకు సంతోషించి భైరవస్వామి నాకు గంధర్వత్వం ప్రసాదించాడు. నేనిప్పుడు భూత భూమికలు దాటి గాంధర్విగా ప్రకాశిస్తున్నాను. నీకు దివ్యశక్తులు వచ్చేలా చేస్తాను. ప్రస్తుతం నీకు స్వప్నమోహినీ విద్యనుపదేశిస్తాను. దానిని ఆంధ్ర నాగనాయకుల మీద ప్రయోగించు. వారి యిష్టదేవతల రూపంలో ఈ స్వప్న దేవత కనపడి యుద్ధం వద్దని శాంతిసంధి చేసుకోమని ఆదేశిస్తుంది. ప్రస్తుతానికి నీ కోరిక నెరవేరుతుంది. మీ మామగారి మనుషులతో అక్కడికి వెళ్ళి ఈ పని సానుకూలమైన తర్వాత వాళ్ళను వెనక్కు పంపించు. అప్పుడు నేను వచ్చి అనంతర కర్తవ్యం చెపుతాను ” అన్నది.
అనుకొన్న విధంగా ఆంధ్రసీమలో శాంతి నెలకొన్నది. గాంధర్వి వచ్చి హరసిద్ధుని కుర్తాళం తీసుకువెళ్ళింది. కుర్తాళనాథేశ్వరుని దర్శనం చేసుకొన్న తర్వాత పొదిగైజలపాతాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆమె ఒక సంఘటన తెలియజేసింది. “నీకు వజ్రయాన సాధనలు నేర్పిన బోయాంగ్ కొద్ది కాలం క్రింద ఇద్దరు శిష్యులను, ఒక శునకాన్ని తీసుకొని వచ్చి గురుస్థానమైన కుర్తాళం వచ్చాడు. పొదిగై కొండల మీద దిగి వారితో మృత్యువును జయించగలిగిన ఓషధిఘుటికలను నేను తయారు చేశాను. వాటిని మీకు ఇస్తాను. నేనూ వేసుకొంటాను. నాకెంతో సేవ చేసిన మీకు ఈ మేలు చేస్తున్నాను. అని ఒక మాత్ర కుక్కనోట్లో వేసి, తానొకటి మింగి ఇద్దరు శిష్యులకూ చెరొక మాత్ర యిచ్చాడు. ఒక శిష్యుడు మింగాడు. రెండోవాడు ఇంకా మింగలేదు. ఈ లోపు కుక్క స్పృహతప్పి పడిపోయింది. బోయాంగ్, మొదటి శిష్యుడు కూడా పడిపోయినారు. ఎవరిలోను ప్రాణమున్న లక్షణాలు లేవు. అయ్యో! ఎంత పని జరిగింది! గురువుగారు ఓషధి తయారు చేయటంలో ఏదో పొరపాటు పడినారు. అందరూ మరణించారు. నేను దీనిని మింగను అని ఆ మాత్రను పొదలలోకి విసిరివేసి ఏడుస్తూ క్రిందికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళను తీసుకొని మరణించిన వాళ్ళకు అంత్యక్రియలు చేయటం కోసం తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్ద శిల మీద కొన్ని అక్షరాలు వ్రాయబడి ఉన్నవి. "నీవు మాత్ర వేసుకోలేదు. దురదృష్టవంతుడవు. మాకు విద్యున్మయమైన దివ్యదేహాలు వచ్చినవి. ఆకాశమార్గంలో వెళుతున్నాము" అని. రెండవ శిష్యుడు గ్రామస్థులు ఆ మాత్ర కోసం వెదికారు. దొరకలేదు. బాధపడుతూ వెళ్ళారు.
ఆ మాత్ర నీకు దొరుకుతుంది. అది ఇంకా చెడిపోలేదు. పద". ఆమె దివ్యజ్ఞానం వల్ల అది దొరికింది. ఆ మాత్రను అతని చేత మింగించింది. చూస్తూ ఉండగా అతని శరీరంలో అద్భుతమైన పరిణామం వచ్చింది. దాదాపు స్పృహ పోయింది. కాని గంధర్వ డాకిని ప్రక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేగంగానే అతనికి విద్యున్మయమైన శరీరం వచ్చింది. ఆకాశ గమనశక్తి వచ్చింది. "గాంధర్వీ! నీ ఋణం ఎలా తీర్చుకో గలను ? నన్ను సామాన్య మానవుని దివ్యునిగా మార్చావు" అన్నాడతడు. ఆమె "నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకా చేయవలసింది ఉంది. మనం హిమాలయాలలో త్రివిష్టప భూములలోని వజ్రభైరవ గుహదగ్గరకు వెళ్ళాలి. అక్కడ నీవు మరికొన్ని సాధనలు చేయవలసి ఉంది. ఇంతకు ముందు నీవు చూచిన గుహయే అది” అన్నది. అక్కడకు చేరుకొన్న పిదప బహువిధములైన సాధనలు అతనిచేత చేయించింది. అతనికిప్పుడు ఎన్నో దివ్యశక్తులు వచ్చినవి.
"హరసిద్ధా! నీవిప్పుడు పరిపూర్ణ సిద్ధభైరవుడవు. నేను గంధర్వ లోకానికి వెళుతున్నాను. నీవు స్మరించినప్పుడు వస్తాను. నాయంతట నేను కూడా అప్పుడప్పుడు వస్తాను. భవిష్యత్తులో సాధకు లెందరికో నీవు సహాయపడవలసి ఉంది. కలియుగప్రభావం వల్ల మంత్రసిద్ధి ఎంత కష్టపడినారాదు. యోగ్యులను అనుగ్రహించు. భవిష్యత్తులో నేను కూడా మానవ జన్మ తీసుకోవలసి రావచ్చు. అప్పుడు నీవు నాకు సహాయ పడవలసి వస్తుంది. ప్రస్తుతం నీవు నాగభూమి కొకసారి వెళ్ళు. హిరణ్మయి నీ కోసం ఎదురు చూస్తున్నది.
ప్రతి జీవికి ప్రేమ కేంద్రములు మారుతుంటవి. చిన్నప్పుడు తల్లిప్రేమకేంద్రం. శిశువు అమ్మను విడచి ఉండలేదు. పెరుగుతుంటే స్నేహితులు ప్రేమ కేంద్రాలు. తరువాత ప్రియుడు లేక ప్రియురాలు. అనంతరం సంతానం. ఇప్పుడు నీ భార్యకు కుమారుడు ప్రేమ కేంద్రం. అయినా ఆమె నీయందు అనన్యప్రేమ సమన్విత. అప్పుడప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉంటూ దేశసంచారం చేస్తూ దైవ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండు. మరొక్క మాట. కొంతకాలం తర్వాత అమితాభ బుద్ధుని అంశతో పద్మసంభవుడనే యోగిపుట్టి వజ్రవైరోచనిని ఉపాసిస్తాడు. ఆమె సఖిని నేను. అతనిలో కొంతకాలం ఉండు. నీ ప్రవేశం వల్ల అతడు అద్భుతశక్తులు ప్రదర్శిస్తాడు. అది పరిమితసమయం మాత్రం. నీవు నీ మార్గంలో ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యి, సిద్ధాశ్రమ యోగులతో మైత్రి నీకు మేలు చేస్తుంది. అక్కడ మహనీయులు నీకు మార్గదర్శకులుగా ఉంటారు. భారతదేశంలోనే కాక వివిధ ద్వీపాలలో సిద్ధాశ్రమ కేంద్రాలున్నవి. అక్కడకు వెళ్ళి సిద్ధ సమావేశాలలో పాల్గొనవలసిన అవసరమున్నది. ముఖ్యంగా క్రౌంచద్వీపం భవిష్యత్తులో పెద్ద శక్తికేంద్రం కాబోతున్నది. అక్కడి సిద్ధ కేంద్రాలమీద ప్రత్యేక దృష్టి ఉంచు. నేను ఆత్మీయురాలిగా ఏదో చెపుతున్నాను. అన్నీ నీవింక స్వతంత్రంగా నిర్ణయించగలవు. నిర్వహించగలవు. విజయోస్తు!"
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comentários