🌹 సిద్దేశ్వరయానం - 45 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵
మల్లికార్జున స్వామికి ఒక భక్తుడు ఇలా విన్నవించుకొంటున్నాడు ఏదో ప్రార్థిస్తున్నాడు... కొన్ని నిమిషాలు మామూలు మాటలు - తరువాత అతనిలో నుండి కవిత ప్రవహించటం మొదలు పెట్టింది.
ఓ శ్రీపర్వతమల్లికార్జున శివా! యోగీంద్ర చింతామణీ! నీ శ్రుత్యగ్రనటత్ పదాబ్జములు ధ్యానింతున్ మహాదేవ! ఈ నా శ్రుత్యగ్రము లందు దివ్యకవితానాదంబులన్ దగ్ధకం తు శ్రీలన్ వినిపింపు నీకు నొనరింతున్ లేఖకోద్యోగమున్
స్వామీ! శ్రీ గిరిమల్లన్నా! శరణుశరణు! దేవా! నీ పాదములను ధ్యానిస్తున్నాను. దివ్యమైన కవితను నాకు వినిపించు నేను వ్రాయసగాడినై దానిని వ్రాసుకొంటాను.
చితులు సమాధులున్ శిథిల చిత్రములైన విచిత్రసీమలో కుతుకముతోడ పాడెదవు గొంతుక యెత్తి మహాభయంకరా కృతులు కృతుల్ జగన్మరణ గీతికలద్భుత మృత్యుదేవతా యతనములోని పిల్పులుశివా! యిది యెక్కడి నీకునైజమో!
మహేశ్వరా ! యిది యేమి ప్రభూ! నీ కంఠంలో నుండి భీషణమైన మృత్యు గీతాలు వినిపిస్తున్నవి. ఏదో ప్రమాద సూచన వలె ఉంది. ఏమి కాబోతున్నదో అర్థం కావటం లేదు.
కారు మొయిళ్ళ చీకటులు గ్రమ్మిన వేళల అర్థరాత్రులం దారని మంటలంతరము నందు జ్వలింప గుహాత్రికోణ కుం దారుణ వహ్ని మధ్యను భయంకర హోమము చేయు యోగులన్ వీరతపస్వులన్ దలతు భీషణ భైరవ మార్గగాములన్ !
నాకంటి ముందు కారుమబ్బులు కమ్ముకొంటున్నవి. ఈ పర్వతములోని ఒక రహస్య గుహలో భైరవ యోగులు భీషణ హోమాలు చేస్తున్నారు. ఆ పొగలు అగ్నికుండంలో లేచి సుడులు తిరుగుతూ ఆకాశమంతా వినీలమేఘావృతమై నటులున్నది. ఉరుములు దారుణ ధ్వనులు చేస్తున్నవి. ఆ ఘోర శబ్దాలకు ధ్యాన భంగమైంది. తీరా చూస్తే ప్రకృతి కూడా అలానే ఉంది. అంధకారమలముకొని పెనుగాలులువీస్తున్నవి. ప్రజలంతా ఇండ్లకు పరుగెత్తుతున్నారు. సమయం అయిపోవటంతో ఆలయం మూసివేశారు. ఈ యువకుడు తనతో వచ్చిన మిత్రులకోసం చూచాడు, ఎవరూ కనపడలేదు. ఈ హడావిడిలో ఎవరిదోవ వారిదే అయింది. తాము దిగిన వసతి కొంచెందూరం. నడుస్తున్నాడు. కొంత నడిచే సరికి తుఫానుగాలి- మహా భయంకర వర్షం
దోవ కనపడటం లేదు. చీకటిలో ఎటుపోతున్నాడో తెలియడం లేదు. ఆ మహా వేగానికి గాలి విసురుకు పడిపోయినాడు. ఎటో తేలిపోతున్నట్లున్నది. నీళ్ళలో తేలిపోతున్నాడు. కాసేపటికి స్పృహ పోయింది.
కనులు తెరిచేసరికి ఎక్కడ తానున్నాడో తెలియటం లేదు. లేవలేకపోతున్నాడు. అది ఒక కొండ గుహవలె ఉంది. పగటి వెలుతురు కొంచెం తెలుస్తున్నది. ఇంతలో ఎవరో మధ్యవయస్కుడు పక్కన కూర్చుని తన శిరస్సుమీద చేయివేసి నిమురుతున్నాడు. ఏదోశక్తి ప్రసరిస్తున్నట్లున్నది.
ప్రశ్న: "అయ్యా! ఎవరు మీరు? నే నెక్కడ ఉన్నాను?”
జవాబు: “ఇది కొండ గుహ. ఇక్కడ పడిఉన్నావు.”
ప్రశ్న: “ఇక్కడకు ఎలావచ్చాను?"
జవాబు: "వరదలో కొట్టుకు పోయి వచ్చి ఇక్కడ పడ్డావు.”
ప్రశ్న: ఎంతసేపయింది?
జవాబు: చాలా రోజులయింది.
ప్రశ్న: అయితే నేను ఎలా బతికి ఉన్నాను?
జవాబు: ఈ గుహలోకి మృత్యువురాదు. ఆయువున్నది గనుక ఇక్కడకు కొట్టుకు వచ్చావు. వచ్చావు గనుక జీవించి ఉన్నావు.
ప్రశ్న: నాకేమీ అర్థం కావటం లేదు. మీరెవరు?
జ: నేనొక యోగిని. హిమాలయాలలో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి ఈ గుహలో ఉంటాను. భ్రమరాంబా మల్లికార్జునులను దర్శించుకొని కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకొంటూ గడుపుతాను. ఇది భైరవ గుహ. ఇక్కడ జపధ్యానములను చేసే వారిని వజ్ర భైరవుడు కాపాడి వారికి మంత్ర సిద్ధిని వేగంగా ప్రసాదిస్తుంటాడు.
యువకుడు: నాకు లేచి కదిలే శక్తిని అనుగ్రహించండి. ఊళ్ళోకి వెళ్ళి మా మిత్రులను వెదికి వారితో కలిసి మా గ్రామానికి వెళ్తాను.
యోగి: ఈ తుఫానులో కొన్ని వందలమంది మరణించారు. వారిలో
మీ స్నేహితులుకూడా. దగ్గరలో ఉన్న మీ గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. ఎవరూ మిగల లేదు. అక్కడకు వెళ్ళి నీవు చేయగలిగిందేమీ లేదు.
యువకుడు: భయము, దుఃఖము తన్నుకు వస్తున్నవి. ఇవన్నీ నిజమా?
యోగి: కన్నులు మూసుకో. నీకే కనిపిస్తుంది.
యువకుడు కన్నులు మూసుకున్నాడు. యోగి చెప్పినట్లే తుఫానులో తమ ఊరు కొట్టుకు పోయింది. ఎవరూ బతికి బయటపడలేదు.
యువకుడు: (దుఃఖంతో) - ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నే నెక్కడికి పోవాలి? ఏం చేయాలి? అంతా అయోమయంగా ఉంది.
యోగి: నీకు నేనున్నాను. బ్రహ్మపుత్రానది దగ్గర కామాఖ్యలో ఉన్న నేను ఈ విషయం తెలుసుకొని నీ కోసం వచ్చాను.
యువ: మీరెవ్వరు? నాకు మీకు ఏమిటి సంబంధం?
యోగి: మనమిద్దరం కొన్ని వందల యేండ్ల క్రింద మిత్రులము. సిద్ధ గురువుల సంకల్పం వల్ల ధర్మ చైతన్యాన్ని లోకంలో ప్రసరింప జేయటం కోసం నీవు శరీరాన్ని విడిచి జన్మ యెత్తవలసి వచ్చింది. ఎప్పటికప్పుడు నీకు గుర్తుచేసి నీ దివ్యశక్తులు నీకు వచ్చేలా చేయటం నా కర్తవ్యం. అందుకే వచ్చాను.
యువకుడు: ఇప్పుడు నన్నేమి చేయమంటారు?
యోగి: నేను నీకొక మంత్రం చెపుతాను. దానిని 40 రోజులు జపం చెయ్యి. ఈ గుహకు ఎదురుగా సరస్సున్నది, ఒడ్డున పండ్లచెట్లున్నవి. ఆకలియైనప్పుడు ఆ పండ్లుతిను. కొలనులో నీళ్ళుతాగు. గుహలోధ్యానం చెయ్యి. మండల దీక్ష పూర్తి అయినప్పుడు ఒక దేవత కనిపిస్తుంది. ఆ దేవత చెప్పినట్లు చెయ్యి.
యువకుడు: మీరిక్కడే ఉంటారు గదా!
యోగి: నేనిక్కడ ఉండను. మళ్ళీ అవసరమైనప్పుడు వస్తాను. ఏ ఆటంకాలు లేకుండా తపస్సిద్ధి కలిగేలా నేను చూస్తాను. సాధనకు కావలసిన శక్తి నీకు వస్తుంది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments