top of page
Writer's picturePrasad Bharadwaj

సిద్దేశ్వరయానం - 49 Siddeshwarayanam - 49


🌹 సిద్దేశ్వరయానం - 49 🌹


💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐


🏵 16వ శతాబ్దం 🏵


ఆ తరువాత మళ్ళీ భారతదేశంలో భానుదేవుడన్న పేరుతో రాజవంశంలో పుట్టి ఒక చిన్న రాజ్యానికి ప్రభువై మధ్యవయస్సులో శత్రువుల చేతిలో ఓడిపోయి రాజ్యభ్రష్టుడైనాడు. ఏ విధంగానైనా రాజ్యం పొందాలన్న కోరికతో మత్స్యేంద్రనాధుని శిష్యుడైన గోరఖ్నాధుని ఆశ్రయించాడు. ఆ మహాయోగి దివ్యదృష్టితో చూచి “భానుదేవా ! ఈ చిన్న రాజ్యానికిమళ్ళీ ప్రభుత్వం సంపాదించటం కోసం నన్నాశ్రయించావు. నీ పూర్వసంస్కారాన్ని అనుసరించి నీవీ చిన్నపరిధికి పరిమితం కావలసిన వాడవు కావు. వెనుక ఒక జన్మలో కాళీభక్తుడవు. ఆదేవి అనుగ్రహం నీమీద ఉంది. నీకు కాళీ మంత్రాన్ని ఉపదేశిస్తాను. తీవ్రసాధన చెయ్యి. కాళీదేవి అనుగ్రహించి తీరుతుంది. అప్పుడామెను ఏమికోరుతావన్నది నీఇష్టం” అని మంత్రోపదేశం చేశాడు.


ఆ సిద్ధుడు చెప్పిన విధంగా సాధన మొదలు పెట్టి పట్టుదలతో చేశాడు భానుదేవుడు. కఠోరదీక్షలతో కొన్ని సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. చివరకు కాళీదేవి సాక్షాత్కరించి "నాయనా నీకు ఏమి కావాలో కోరుకో' అన్నది. ఇన్ని సంవత్సరాల కఠోర శ్రమలో అతనికి లౌకిక సుఖభోగవాంఛనశించింది. మళ్ళీ రాజ్యం పొందాలన్న కోరిక తొలగిపోయింది. “అమ్మా ! సమ్రాట్టును కావాలని సాధన మొదలుపెట్టాను. ఇప్పు డా వాంఛలేదు. కానీ నాకు పూర్తి వైరాగ్యమూ కలుగలేదు.అందువల్ల సిద్ధశక్తులతో లోకకల్యాణం చేస్తూ నీ సేవకునిగా ఉండాలని ఉన్నది. ఒక వేళ నేను మళ్ళీ జన్మలెత్త వలసి వచ్చినా ఎప్పుడూ నీ భక్తుడనై ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు" పరమేశ్వరి దయార్ద్రమైన చూపులతో చిరునవ్వు వెన్నెలను కురిపిస్తూ అతడు కోరిన వరమిచ్చి అదృశ్యమయింది.


ఆ శరీరంలో కొంత దీర్ఘకాలం జీవించి మళ్ళీ హిమాలయాలలోని డెహ్రాడూను ప్రాంతంలో ఒక కాళీ భక్తుల ఇంట్లో పుట్టటం జరిగింది. తమవంశంలో ఉన్న కాళీపూజ, మంత్రసాధన సహజంగానే అబ్బినవి. ఆ ప్రాంతంలో ఒక దేవి ఆలయం ఉన్నది. ఆ ఆలయం లోని దేవీమూర్తి అంటే అతనికి ఆకర్షణ ఏర్పడింది. ఆ దేవతను చూచినప్పుడల్లా మాతృభావన కాక మధుర ప్రేమభావన కలిగేది. పరమేశ్వరి విషయంలో ఈ భావన తప్పుకదా ! అనిపించేది. కానీ ఆ భావం నిల్చేది కాదు. పాశం వేసి లాగుతున్నట్లుగా అతని హృదయం ఆ దేవత వైపు బలంగా ప్రేమభావనతో మోహితమైంది. అతడు మంత్రశాస్త్ర గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించాడు. భాగవతాన్ని చాలా సార్లు చదివాడు. కృష్ణోపాసనలో గోపికాభావానికి ఉన్న ప్రాధాన్యాన్ని జాగ్రత్తగా అనుశీలనం చేశాడు.


బృందావనంలో గోపకుల భార్యలు కృష్ణుని తమ ప్రియునిగా భావించి ఉపాసించి తరించారు. తల్లిగా, తండ్రిగా, అన్నగా, బంధువుగా, స్నేహితునిగా, ప్రియునిగా ఏ విధంగానైనా పరమేశ్వరుని భావించవచ్చు. చివరకు శత్రువుగా కూడా భావించవచ్చు. భావములో తీవ్రత, ఉద్దామధ్యాననిష్ఠ ప్రధానమని నారదుడు ధర్మరాజుతో చెప్పిన శ్లోకాలను పదేపదే మననం చేశాడు. పరమేశ్వర చైతన్యం గుణ, లింగ, నామరహితమైనది. పురుషరూపాన్ని కాని, స్త్రీరూపాన్ని కాని ఏది కావాలనుకుంటే అదిధరించకలదు. పరమేశ్వరుని పురుషునిగా తన ప్రియునిగా భావించిగోపికలు తరించినట్లు ఆ అనంత చైతన్యము స్త్రీగా భావించి ప్రియురాలిగా ఎందుకు ఉపాసించరాదు ? తాంత్రిక గ్రంథములలో “వీరమార్గము” అన్న పేరుతో ఈ పద్ధతి కన్పించింది.


దానితో ఒక నిర్ణయానికి వచ్చి ఆ గుడిలో కూర్చొని ప్రేమభావంతో శ్యామకాళీమంత్రసాధన చేశాడు. కొద్దికాలం చేయగానే ఆ గుడిలోని దేవత సాక్షాత్కరించింది. “సాధకుడా ! నీ తపస్సుకు నేను సంతృప్తిని చెందాను. నీలో కలిగిన ప్రేమభావము తప్పు కాదు. దానికి కారణం నేనే. దేవాలయాలలో ఒక రహస్యమున్నది. ప్రతి దేవాలయంలోను ఎప్పుడూ ఆ దేవత ఉండదు. ఆ దేవత పరివారంలోని వారు ఆమె ఆజ్ఞవల్ల అక్కడ ఉంటూ భక్తుల కోరికలను వారి యోగ్యతను బట్టి ప్రసాదిస్తుంటారు. నేను భువనేశ్వరి పరవారంలోని అనూరాధ అనే దేవతను. పూర్ణ మానవశరీరంతో నీతో కొంతకాలం కాపరంచేస్తాను" అని వరమిచ్చింది. ఆ ప్రకారంగానే కొన్ని సంవత్సరాలు అతనితో ఆమె సంసారం చేసింది. ఆ దాంపత్య ఫలితంగా వారికొక కుమారుడు పుట్టాడు. వాడికి అయిదుఏండ్ల వయస్సు వచ్చిన తరువాత ఆ దేవత "మన దాంపత్య సమయం పూర్తయిపోయింది నేను వెడుతున్నాను. నీ జీవితంలో మళ్ళీ ఇక నేను కనపడే అవకాశం లేదు. కుమారుని జాగ్రత్తగా పెంచి పెద్దవాడిని చెయ్యి" అని వీడ్కోలు చెప్పి అదృశ్యమయింది.


ఇన్ని సంవత్సరాలు ఆమెతో సంసారం లో మునిగి కాళీసాధన సరిగా చేయలేదు. తన తపః ఫలమో లేక పూర్వపుణ్యమో పూర్తి అయిపోయింది. ఈ జన్మలో తనకింక సుఖం లేదు. పోనీ మళ్ళీ వెళ్ళి తపస్సుకు కూర్చుందాము అంటే ముద్దులొలికే చిన్నవాడిని విడిచిపెట్టి పోలేదు. తనకీ జన్మ కింతే అని మనసు కుదుట పరచుకొని ప్రేమస్వరూపిణి అయిన తన భార్య చెప్పిన విధంగా బిడ్డను పెంచి పెద్దచేశాడు. వానిని సంసారంలో స్థిరపరచేసరికి తనకు ముసలితనం వచ్చి ఆయువు తీరిపోయింది. సామాన్య సాధనయే తప్ప కఠిన తపస్సు చేయటానికి శరీరం సహకరించని స్థితిలో పడినాడు. మరణం సమీపించినప్పుడు కాళీమాతను ప్రార్ధించాడు. "తల్లీ ! ఏ జన్మలో ఏమి సుకృతము చేశానో ఈ జన్మలో నీ భక్తుడనయ్యే అదృష్టం కలిగింది. కానీ, ఇంద్రియములకు లొంగిపోయి ఒక దేవతనే భార్యగా చేయమని నిన్ను ప్రార్ధించాను. నీవనుగ్రహించి ప్రసాదించావు. కానీ, ఆ భోగంలో పడి తపస్సు విస్మరించాను. వచ్చే జన్మలో నయినా తపస్సు చేసి నీ పరిపూర్ణమయిన అనుగ్రహ సిద్ధిని పొందేలాగా కరుణించు" అని కాళీదేవిని మనస్సులో నిల్పుకొని ఆ దేవి మంత్రాన్ని జపిస్తూ తుదిశ్వాస వదిలాడు.


( సశేషం )


🌹🌹🌹🌹🌹



0 views0 comments

Comments


bottom of page